లౌకికతత్వం, ప్రజాసామ్య పరిరక్షణే గాంధీజీకి నిజమైన నివాళి

Jan 30,2024 07:16 #Editorial
  • నేడు గాంధీ 76వ వర్థంతి

              తాను సనాతన హిందువునని, నిత్యం భగవత్‌ గీత పారాయణం చేస్తానని, దాన్ననుసరించే జీవితాన్ని మలచుకున్నానని ప్రకటించుకున్న జాతిపితను 1948 జనవరి 30న హిందూ మతోన్మాది, ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్త నాథూరామ్‌ గాడ్సే తుపాకితో కాల్చి చంపాడు. గాంధీ హత్య కేసులో ఆధారాలు లేక విడుదలైన సావర్కర్‌ శిష్యుడే గాడ్సే. మత సామరస్య సాధన కోసం గాంధీజీ చేసిన కృషి, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం కోసం ఆయన సల్పిన పోరాటం జీర్ణించుకోలేకనే ఆర్‌.ఎస్‌.ఎస్‌ వారు ఈ దారుణానికి పాల్పడ్డారు. భారతదేశ, ప్రజల నిర్దిష్ట పరిస్థితులను లోతుగా అధ్యయనం చేసి, ఆకళింపు చేసుకున్న స్వాతంత్య్ర ఉద్యమ నేతల్లో మహాత్ముడు అగ్రగణ్యుడు. గాంధీ ఆర్థిక, సనాతన భావాల పట్ల విభిన్న దృక్కోణాలు చరిత్రకారుల్లో ఉన్నప్పటికీ భారతీయులందర్నీ బ్రిటీష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమ పథంలోకి నడిపిన నాయకుడు గాంధీజీ. తొలినాటి జాతీయోద్యమంలో సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా విజ్ఞప్తులు, రాయబారాల ద్వారా రాయితీలు పొందాలని ఉద్యమిస్తుంటే గ్రామీణ, పట్టణ దిగువ తరగతులను కూడా స్వాతంత్య్ర పోరాటంలోకి నడిపిన నాయకుడాయన. ఆ మహానీయుడ్ని హత్యగావించడానికి సిద్ధాంత పునాది కలిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ సామ్రాజ్యవాదులకు మోకరిల్లింది. గాంధీజీ ఆ ధోరణిని ప్రతిఘటించాడు. ఆ సిద్ధాంత వాదులే దశాబ్ద కాలంగా దేశ రాజకీయ అధికారాన్ని ఏలుతున్నారు. మరోసారి 2024లో అధికారానికై అర్రులు చాస్తున్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బిజెపి గెలుపు ద్వారా తమ మతోన్మాద మనువాద ఎజెండాని పూర్తిగా అమలు జరపాలని ఉవ్విళ్లూరుతున్నారు. భారత ప్రజలు, సంపద సృష్టికర్తలైన కష్టజీవులు ఈ ప్రమాదాన్ని నివారించడానికి ప్రతినబూనాల్సిన సందర్భమిది.

మతం పట్ల మహాత్ముడి అభిప్రాయం

               భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమిదని గాంధీజీ నమ్మాడు. వివిధ మతాలున్న మన దేశం వైవిధ్యాన్ని పరిరక్షించుకొంటూనే ప్రజలందర్నీ భాగస్వాముల్ని చేయాలన్నాడు. మతం పూర్తిగా వ్యక్తిగతమైనదని రాజకీయాల్లో, ప్రభుత్వ విధానాల్లో దానికి పాత్ర ఉండరాదని ప్రవచించడమే కాదు, ఆచరించాడు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన 1947 ఆగస్టు 14 రాత్రి గాంధీజీ స్వాతంత్య్ర సంబరాల్లో పాల్గొనలేదు. ఆ రోజు రాత్రి మత కలహాలను ఆపడానికి ప్రయత్నించాడు. అంతకు ముందు దేశ విభజన సందర్భంగా ప్రస్తుత బంగ్లాదేశ్‌లో ఉన్న నౌఖాలిలో హిందూ-ముస్లిం మతోన్మాద అగ్నికీలల్ని నివారించడానికి సత్యాగ్రహం చేపట్టాడు. 1948 జనవరి 12న బిర్లా గృహంలో చేసిన చివరి నిరాహార దీక్ష కూడా మత సామరస్యాన్ని కోరుతూ చేపట్టినదే. మత సామరస్యం పట్ల, లౌకికవాదం పట్ల ఆయన అచంచల విశ్వాసాన్ని తెలియజేస్తుంది. కాని ”హిందూస్థాన్‌ దేశంలో హిందూ జాతి, హిందూ మతం-హిందూ సంస్కృతి, భాషలు తప్ప భిన్నమైన వారందరూ జాతి జీవనం నుండి బహిష్కృతువ్వాలని, భిన్నంగా ఉండేవారంతా దేశ ద్రోహులని” 1939 లోనే ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినేత గోల్వాల్కర్‌ ప్రకటించాడు. నేటి పాలకులు దానినే ఆచరిస్తున్నారు. మత విద్వేషాల్ని రెచ్చగొట్టడం, జాతులు, భాషలు, సంస్కృతుల మధ్య వైషమ్యాల్ని రెచ్చగొట్టడం చూస్తున్నాం. అనుభవిస్తున్నాం. దీన్ని తీవ్రంగా ప్రతిఘటించాలని గాంధీజీ ఉద్భోదించాడు. దేశ స్వాతంత్య్రానికి పునాది హిందూ ముస్లిం ఐక్యతని గాంధీజీ చాటాడు. నేడదే శిరోధార్యం.

సామ్రాజ్యవాద వ్యతిరేకత – స్వావలంబన

                   గాంధీజీ సామ్రాజ్యవాద వ్యతిరేకి. దక్షిణాఫ్రికాలో ఉండగా జాతి వివక్షతకు వ్యతిరేకంగా సత్యాగ్రహం ప్రారంభించాడు. మన దేశంలో బ్రిటీష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సంపూర్ణ స్వాతంత్య్రం కోసం ప్రజల్ని ఐక్యం చేసి పోరు సల్పాడు. కాని నేటి పాలకులు అమెరికన్‌ సామ్రాజ్యవాదుల ముందు మోకరిల్లి…స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌ని నిస్సిగ్గుగా బలపరుస్తున్నారు. అమెరికా కనుసన్నల్లో భారత సార్వభౌమాత్వాన్ని నీరుగార్చేలా వివిధ రకాల ఒప్పందాలు చేసుకోవడం, శాంతికి భంగం కలిగించే విన్యాసాల్లో పాల్గొనడం జరుగుతున్నది. స్వాతంత్య్రోద్యమంలో ప్రజలు కాంక్షించింది ఇది కాదు. జాతీయ స్వావలంబన, ఆర్థిక స్వయం ప్రతిపత్తి కావాలని బాపూజీ కలలుగన్నాడు. నేడు గాంధీ కలలుగన్న స్వావలంబనను నిర్వీర్యం చేస్తున్నారు. విదేశ పెట్టుబడులు, స్వదేశీ కార్పొరేట్లపై ఆధారపడిన వ్యవస్థను నేటి పాలకులు నిర్మిస్తూ స్వయం ప్రతిపత్తికి తిలోదకాలిచ్చారు. ఈ విధానాల్ని ప్రతిఘటించాల్సిందే.

సామాజిక న్యాయం కోసం…

                దేశంలో అణగారిన బడుగు, బలహీన వర్గాలు, స్త్రీల విముక్తి కోసం గాంధీజీ పోరాటం చేశాడు. నాగరికతకు, ఊరికి దూరంగా నెట్టబడిన దళితులు, బలహీన వర్గాలను, హరిజనులను జన జీవన స్రవంతిలోకి తీసుకు రావడానికి సమాజం అంగీకరించేలా హరిజనోద్ధరణ, సహపంక్తి భోజనాలు పెద్ద ఎత్తున జరిపేలా సంస్కరణోద్యమం నడిపాడు. స్త్రీలకు స్వాతంత్య్రం ఉండాలని, స్వాతంత్య్రోద్యమంలో వారూ భాగస్వాములు కావాలని సబర్మతి ఆశ్రమ ద్వారాలను వారికోసం తెరిచాడు. అంతేకాక, దేశ భవితలో వారూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించిన సంస్కరణవాది గాంధీజీ.

ప్రజాస్వామ్య పరిరక్షణ

                బలవంతులకు ఎన్ని అవకాశాలుంటాయో అన్ని అవకాశాలు బలహీనులకు కూడా ఇవ్వాల్సిందేనన్నాడు గాంధీజీ. రాజకీయ అధికారం ప్రజల జీవితాల్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపర్చాలని, జాతి జీవనంలో అందరికీ సమ ప్రాధాన్యత ఉండాలని, దేశానికి ప్రజలే అధిపతులుగా వుండాలని తదనుగుణంగా రాజకీయ వ్యవస్థ రూపొందాలన్నాడు. ప్రజల స్వయం ప్రతిపత్తి, పరస్పర సహకారం ఆధారంగా ప్రజాస్వామ్యంలో అభివృద్ధి ఉండాలని ఆకాంక్షించాడు. ఇవే మన రాజ్యాంగంలో పొందుపర్చబడిన అంశాలు. కాని నేటి పాలకులు పటిష్ట నిఘా పర్యవేక్షణలో నిర్మించామని చెబుతున్న పార్లమెంట్‌ భవనంలో అగంతకుల గలభాపై చర్చించడానికి, ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటుకు సమాధానం చెప్పడానికి ప్రధాని, హోం మంత్రి సంసిద్ధత వ్యక్తం చేయలేదు. పైగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిగా… ఈ విషయమై చర్చ జరగాలని కోరిన 146 మంది ప్రతిపక్ష పార్లమెంటు సభ్యుల్ని ఏకపక్షంగా సస్పెండ్‌ చేశారు.

బ్రిటీష్‌ వారు ఆనాడు తెచ్చిన రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా తీవ్ర పోరాటం చేశాడు గాంధీజీ. వాక్‌, సభ, పత్రికా స్వాతంత్య్రాలు, భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజల హక్కన్నాడు. కానీ నేటి పాలకులు పార్లమెంట్‌ సభ్యుల్ని సస్పెండ్‌ చేసి…ప్రతిపక్షాలు లేకుండానే వ్యక్తిగత స్వేచ్ఛను, వాక్‌సభా పత్రికా స్వాతంత్య్రాలను నిర్వీర్యం చేయడానికి వీలుగా సిఆర్‌పిసి, ఐపిసి, ఎవిడెన్స్‌ యాక్ట్‌ లాంటి 18 నిరంకుశ చట్టాలు ఆమోదింపచేసుకున్న తీరు భారత ప్రజాస్వామ్యానికి పట్టిన దుర్గతిని తెలియజేస్తోంది.

గాంధీజీ రాష్ట్రాలకు, స్థానిక సంస్థలకు స్వయం ప్రతిపత్తి, అధికారాలు, నిధులు ఉండేలా గ్రామ స్వరాజ్యం రావాలన్నాడు. కాని రాజ్యాంగంలో ప్రకటించిన రాష్ట్రాల హక్కులపైన, స్థానిక సంస్థల హక్కులు, అధికారాలు, నిధులపైన నేటి పాలకులు దాడి చేస్తూ గణతంత్ర రాజ్యం స్థానే ఏకస్వామ్య పరిపాలన, ఏక పార్టీ-ఏక వ్యక్తి పాలన దిశగా సాగడాన్ని సహిద్దామా? దీన్ని నిలువరించకపోతే ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్ధకమవుతుంది. నిరంకుశత్వం రాజ్యమేలుతుంది.

నేడు దేశం కార్పొరేట్‌-మతోన్మాదుల చేతుల్లో చిక్కింది. దేశ పాలకులు దేశ స్వాతంత్య్రానికి, ప్రజాస్వామ్యానికి, లౌకికతత్వానికి, సామాజిక న్యాయానికి, ఫెడరలిజానికి, స్వయంప్రతిపత్తికి ప్రమాదం కొనితెచ్చారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా మహాత్ముని ఉత్తేజంతో మరో స్వాతంత్య్ర పోరాటానికి పూనుకోవడమే 76వ వర్ధంతి సందర్భంగా ఆయనకి మనం అర్పించే నిజమైన నివాళి.

/ వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు /వి.ఉమామహేశ్వరరావు
/ వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు /వి.ఉమామహేశ్వరరావు
➡️