Hajj : వెయ్యి దాటిన హజ్‌ మృతుల సంఖ్య

Jun 20,2024 16:33 #Hajj Pilgrims, #Mecca, #Saudi Arabia

రియాద్‌ : హజ్‌ యాత్రలో మృతుల సంఖ్య వెయ్యికి చేరినట్లు మీడియా గురువారం తెలిపింది. మృతుల్లో సగానికి పైగా అధిక వేడి, ఉక్కపోత కారణంగానే మరణించినట్లు వెల్లడించింది. గురువారం మరణించిన వారిలో 58 మంది ఈజిప్టియన్లు ఉన్నట్లు తెలిపింది. ఈ దేశానికి చెందిన మొత్తం 658 మంది మరణించారని సౌదీ అరేబియా దౌత్యవేత్త పేర్కొన్నారు. 630 మంది నమోదు కాలేదని అన్నారు. మృతుల్లో 68 మంది భారతీయులు కూడా ఉన్నారు.
హజ్‌ యాత్రలో సుమారు 1,081 మంది మరణించినట్లు పది దేశాలు నివేదించాయి. ఈ గణాంకాలు అధికారిక ప్రకటనలు లేదా ఆయా దేశాల దౌత్యవేత్తలు సమాచారమిచ్చినట్లు దౌత్యవేత్త పేర్కొన్నారు.
మక్కా మసీదులో ఈ వారం ప్రారంభంలో అత్యధికంగా 51.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రాంతంలో ప్రతీ దశాబ్దానికి ఉష్ణోగ్రతలు 0.4 డిగ్రీలు పెరుగుతున్నట్లు గతనెలలో ప్రచురితమైన సౌదీ అధ్యయనం పేర్కొంది.

➡️