ఆరోగ్య హక్కు చట్టం అవసరం

ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశాలను అనుసరించి…ఆరోగ్యానికి సరిపడా బడ్జెట్‌ కేటాయింపులు చేయాలి. ప్రజలందరికి రక్షిత మంచినీరు, సమతుల ఆహారం అందించాలి. పటిష్ట ఆసుపత్రుల వ్యవస్థ, సరిపడ ఆరోగ్య, వైద్య సిబ్బంది, ఆసుపత్రులలో మౌలిక వసతులను కల్పించాలి. దీనితో పాటు ప్రజలందరికి అందుబాటు ధరల్లో మందుల లభ్యత మొదలగునవన్నీ కల్పించడం ద్వారా రోగులకు ఉపశమనం కల్గించడం ప్రధానంగా ప్రభుత్వ బాధ్యత. కానీ, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. మందుల ధరలను నియంత్రించే బాధ్యత నుండి అడ్డగోలుగా తప్పుకున్నది. అసలే వైద్య ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ధరల పాలసీ రోగులపై మరింత భారం అవుతుంది. ఇటీవల ఏప్రిల్‌ 1వ తేదీ నుండి 800 రకాల మందుల ధరలు పెరగడం ఈ విధానంలో భాగమే. మందుల కంపెనీ యజమానులకు అనుకూల విధానాలు చేయడంలో మోడీ ప్రభుత్వం ఏ మాత్రం వెనకాడటం లేదు. ఈ ధరాఘాతం బి.పి, షుగర్‌ (పట్టిక) మాత్రమేగాక…అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన మందుల పైనా పడి ప్రజలు భారం మోయలేకున్నారు.
ప్రభుత్వ విధానాలే అనుకుంటే…ఇటు మందుల కంపెనీల అనైతిక వ్యాపార విధానాలు బజారులో పెచ్చుమీరుతున్నాయి. వైద్యులను, ఫార్మసీల యజమానులను ప్రలోభపెట్టడం, విపరీతమైన కమీషన్లు-ప్రోత్సాహకాలు ఇవ్వడం, విదేశీ యానాలు, ఖరీదైన బహుమతులు ఇవ్వడం, బల్క్‌ పర్చేజ్‌ పేరుతో ఆసుపత్రులు, ఇన్‌స్టిట్యూషన్ల పర్చేజ్‌ పేరిట డిపార్టుమెంటు సిబ్బందికి విపరీతమైన లాభాల మార్జిన్లు ఆఫర్‌ చేయడంతోపాటు, బల్ల కింద లంచాల వరకు అన్ని రకాల అనైతిక చర్యలకు మందుల కంపనీల యాజమాన్యాలు పాల్పడుతున్నాయి.
ఈ ఫార్మా కంపెనీల మందుల అమ్మకాల విధానాలపై చట్టపరమైన నియంత్రణ వుండాలని చాలా సంవత్సరాలుగా జన్‌ స్వాస్థ్య అభియాన్‌ (జె.ఎస్‌.ఎ), ఫెడరేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ రిప్స్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌.ఎమ్‌.ఆర్‌.ఎ.ఐ), ఆల్‌ ఇండియా డ్రగ్‌ యాక్షన్‌ కమిటీ (ఎ.ఐ.డి.ఎ.సి) వంటి స్వచ్ఛంద సంస్థలు పోరాడుతున్నాయి. యుసిపిఎంపి ముసాయిదాను చట్టం చేసి, పటిష్టంగా అమలు చేసి, చట్టాన్ని ఉల్లంఘించే యజమానులను శిక్షించాలని పోరాడుతున్నాయి. కానీ కార్పొరేట్‌ అనుకూల మోడీ ప్రభుత్వం కనీసం యు.సి.పి.ఎం.పి పై పార్లమెంటులో చర్చించకుండా, దాన్ని చట్టంగా కాకుండా కేవలం కంటి తుడుపు చర్యగా స్వచ్ఛందంగానే ఈ కోడ్‌ని అమలు చేసుకోమని ఫార్మా కంపెనీలకు అప్పచెప్పింది. అంటే ఫార్మా కంపెనీ యజమానుల కమిటీ సభ్యులే మందుల మార్కెటింగ్‌లో కంపెనీలు ఈ కోడ్‌ అమలు చేసే రీతిని సమీక్షించి నివేదిక ఇస్తారన్నమాట. పర్యవసానంగా మందుల కంపెనీలు నిర్ద్వంద్వంగా రోగులను లూటీ చేసే పరిస్థితి ఇంకా పెరుగుతున్నది.
యుసిపిఎంపి చట్టాన్ని అమలు చేసి రోగులకు ఉపశమనం కల్పించాల్సిన మోడీ ప్రభుత్వం చాలా ఉదాసీనంగా వ్యవహరించడానికి కారణం ఇటీవల ఎన్నికల బాండ్ల ద్వారా మందుల కంపెనీలు బిజెపికి కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం. ఈ వ్యవహారం కంపెనీలకు ప్రభుత్వానికి మధ్య జరిగిన క్విడ్‌ ప్రో కో అని అర్ధం చేసుకోవాలి. ఎస్‌బిఐ ఎలక్టోరల్‌ బాండ్ల డేటా గమనిస్తే మన దేశంలో కేవలం 9 బడా మందుల కంపెనీల యజమానులే బిజెపికి 400 కోట్ల రూపాయల ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా చందా ఇచ్చారు. ఇంకా చిన్నా పెద్దా కంపెనీలు కలసి ఎన్ని కోట్ల రూపాయల చందాలు ఇచ్చాయో తెలియాలి. ఇది పెద్ద స్కామ్‌. ఈ ఎలక్టోరల్‌ బాండ్లు ఇచ్చిన కంపెనీల జాబితాలోని ఒక కంపెనీయే చిన్న పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే నాసిరకం మందులు తయారు చేసినట్టుగా ఇటీవల చాలా వార్తలు పత్రికల్లో రావడం చూశాం. యుసిపిఎంపి చట్టం అమలు లేకపోవడంవల్లే బాబా రాందేవ్‌ లాంటి వ్యాపారవేత్తలు బిజెపి ప్రభుత్వ వత్తాసుతో తమ పతంజలి ఉత్పత్తులపై తప్పుడు ప్రకటనలు, తప్పుడు మార్కెటింగ్‌ విధానాలతో ఇష్టారాజ్యంగా వ్యాపారాన్ని విస్తరించుకోవడం, దానిపై ఇటీవల సుప్రీం కోర్టు పతంజలి కంపెనీపై సీరియస్‌ అవ్వడం, పతంజలి కంపెనీ బహిరంగ క్షమాపణ చెప్పడం చూశాం.
గణాంకాల ప్రకారం మన దేశంలో 47 నుంచి 50 శాతం వైద్య ఖర్చును ప్రజలు తమ జేబుల నుండే పెట్టుకుంటున్నారు. అసలే ఒక పక్క ద్రవ్యోల్బణం పెరుగుతూ ప్రజల ఆదాయాలు తగ్గుతూ, పెరుగుతున్న నిత్యావసర ధరలు, విద్య, ఇతర రోజువారీ ఖర్చులు సగటు మనిషికి పెనుభారం అవుతుంటే ప్రభుత్వం…రోగాల చికిత్సలు, మందులు ఇతర వైద్య ఖర్చులపై విపరీతమై జిఎస్‌టి పన్ను భారం వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజారోగ్య వేదిక (పిఎవి), జన్‌ స్వాస్థ్య అభియాన్‌ (జెఎస్‌ఎ) వంటి సంస్థలు ఆరోగ్య హక్కు చట్టంగా తేవాలని అప్పుడే ప్రజలందరికి వైద్య ఖర్చుల భారం నుండి ఉపశమనం కలుగుతుందని ప్రభుత్వాలను డిమాండు చేస్తున్నాయి. 2024 ఎన్నికల నేపథ్యంలో పిఎవి ఆరోగ్య హక్కు చట్టం ముసాయిదాని రూపొందించి అన్ని రాజకీయ పార్టీలకు పంపించింది. అలాగే తమ మ్యానిఫెస్టోలో ఆరోగ్య హక్కు చట్టంపై అన్ని పార్టీలు తమ విధానం తెలియజేయాలని డిమాండు చేసింది. కేవలం వామపక్ష పార్టీలు మినహా ఏ ఇతర రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించలేదు. పాలక, ప్రతిపక్ష పార్టీలన్నీ హెల్త్‌ ఇన్సూరెన్సే సంజీవని అని ప్రజల్ని మభ్యపెడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన మేరకు ప్రతీ ప్రభుత్వం జిడిపిలో 5 శాతాన్ని బడ్జెట్‌ ప్రజారోగ్యంపై కేటాయించాలి. మన దేశంలో ప్రభుత్వాలు 1.5 శాతం-1.8 శాతం మించి కేటాయింపులు చేయడం లేదు. ఇంత తక్కువ బడ్జెట్‌లో ప్రైమరీ ఆసుపత్రులను మొదలుకొని టెర్షియరీ కేర్‌ ఆసుపత్రుల వరకు ఉన్నత ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పించడం, మందులు/వైద్య పరికరాలు, ఆసుపత్రుల నిర్వహణ, అంబులెన్సుల నిర్వహణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌, సరిపడ వైద్య ఆరోగ్య సిబ్బంది నియామకాలు, వారి జీతాలు…ఎలా సాధ్యం? తక్కువ బడ్జెట్‌ కేటాయింపుల కారణంగానే ప్రైమరీ కేర్‌ మొత్తం నిర్వీర్యం అయ్యింది. ప్రభుత్వాలు ప్రజారోగ్య పరిరక్షణ బాధ్యత నుండి పూర్తిగా తప్పుకోడానికి ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి హెల్త్‌ ఇన్సూరెన్సు స్కీములను తీసుకొచ్చాయి. రోగుల భవిష్యత్‌ అంతా ఆసుపత్రుల యాజమాన్యాలు, ఇన్సూరెన్సు కంపెనీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఇన్సూరెన్స్‌ విధానంలో ఆసుపత్రులు-ఇన్సూరెన్స్‌ కంపెనీలు కుమ్మక్కై మరింత దోపిడి చేసే అవకాశం ఉంది. కాగ్‌ నివేదిక ప్రకారం 2022-23లో ఆయుష్మాన్‌ భారత్‌ స్కీము అమలులో 13,51,299 కేసులు నకిలీవని తేల్చింది. ఈ నివేదికపై మోడీ ప్రభుత్వం మౌనం వహించింది.
కరోనా కాలంలో సంభవించిన లక్షల మరణాలు, ఆసుపత్రులలో ఆక్సిజన్‌ మొదలుకొని పడకలు, మందులు, వైద్య పరికరాల అందుబాటు, సిబ్బంది కొరత ఇలా ప్రతీ అంశంలో మన ఇన్సూరెన్సు మోడల్‌ ఆరోగ్య వ్యవస్థలో లోపాలు బయటపడ్డాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సి వచ్చింది. అదే సమయంలో ధనికులకు మాత్రం అన్ని రకాల వైద్య సదుపాయాలు అందాయి. పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. అందుకే మన దేశంలో ఆరోగ్య హక్కు చట్టంతో మాత్రమే ప్రజల ఆర్థిక అసమానతలతో తావు లేకుండా అందరికి సామానంగా వైద్యం అందించడం సాధ్యమవుతుంది. ఆరోగ్య హక్కు చట్టం లేనంతకాలం ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణకు జవాబుదారీగా ఉండజాలదు.
ఇప్పటికైనా ఆరోగ్యం అన్న సబ్జెక్టు ఒక రాజకీయ అంశంగా ప్రజలు గుర్తించి పాలకులను ఆరోగ్య హక్కు చట్టం తెచ్చి అమలు చేసే రీతిలో ఒత్తిడి చేయాలి. అలాగే ప్రభుత్వాలు కూడా చికిత్స కంటే వ్యాధి నివారణే ప్రధానం అనే విధానం రూపొందించాలి. ఆరోగ్య శ్రీ / ఆయుష్మాన్‌ భారత్‌ కేటాయింపులను ఆరోగ్య బడ్జెట్‌గా కాకుండా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఖర్చుగా పేర్కొనాలి. ఆరోగ్య బడ్జెట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశాలు అమలు చేస్తూ, కావాలంటే వేరేగా హెల్త్‌ ఇన్సురెన్సుపై నిధులు ఖర్చు చేయాలి. ప్రజారోగ్య వేదిక రూపొందించిన ఆరోగ్య హక్కు ముసాయిదాను…ఎన్నికలైన వెంటనే కొత్త ప్రభుత్వం అసెంబ్లీలో చర్చకు పెట్టి, చట్ట రూపకల్పన చేసి తక్షణం అమలు చేయాలి.

 వ్యాసకర్త ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. కామేశ్వరరావు

➡️