కేంద్ర బడ్జెట్‌ – తిరగబడిన తర్కం

Feb 13,2024 07:17 #Editorial

శ్రామికుల ఆదాయాలు తరిగిపోతున్నప్పుడు రైతుల, కూలీల ఆదాయాలు వేరే దిశలో ఎలా ఉంటాయి? రైతుల ఆదాయాలు పెరిగితేనే డిమాండ్‌ పెరుగుతుంది. అప్పుడు అదనంగా కార్మికులు అవసరం ఔతారు. దాని వలన ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయి. పైగా కార్మికుల నిజ వేతనాలు కూడా పెరుగుతాయి. ఇప్పుడు కార్మికుల నిజ వేతనాలు పడిపోతున్నాయంటే దానిని బట్టి రైతుల, కూలీల ఆదాయాలు కూడా పడిపోతున్నాయని -అంటే మొత్తం శ్రామిక ప్రజలందరి ఆదాయాలూ (వ్యవసాయ, వ్యవసాయేతర కూలీలు, రైతులు, చిన్న ఉత్పత్తిదారులు ) గత ఐదేళ్ళలో పడిపోయాయని నిర్ధారణ ఔతోంది. దేశ జనాభాలో ఈ శ్రామిక ప్రజలే అత్యధిక భాగం. అంటే దేశ జనాభాలో అత్యధిక భాగం గత ఐదేళ్ళ కాలంలో దిగజారిన జీవన పరిస్థితులను అనుభవిస్తున్నారన్నది తిరుగులేని సత్యం.

మోడీ ఏం చెప్తే అదే సత్యం అన్నది బిజెపి విధానం. ఒకవేళ మోడీ చెప్పినది తప్పు అని నిర్ధారించే ఆధారాలు ఏమైనా ఉంటే అటువంటివి తప్పుడు ఆధారాలు అయి వుండాలి. కనుక వాటిని కప్పిపుచ్చాలి. తన పదేళ్ళ పాలనలో ఉన్నంత గొప్పగా భారతదేశం గతంలో ఏనాడూ లేదని మోడీ చెప్తున్నారు. కాని అధికారిక గణాంకాలు దానికి భిన్నంగా ఉన్నాయి. కాబట్టి ఆ గణాంకాలు తప్పు అని, అసలు గణాంకాలను సేకరించే విధానాన్నే మార్చాలని బిజెపి అంటోంది. మూడవ ప్రపంచ దేశాల్లోకెల్లా పేరుగాంచిన గణాంక వ్యవస్థ మనది. పి.సి. మహల్‌నోబిస్‌ రూపొందిన జాతీయ శాంపిల్‌ సర్వే విధానం మనకుంది. ఎంతో కృషి చేసి శ్రద్ధతో రూపొందించిన గణాంక వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం ధ్వంసం చేస్తోంది. 2011-12తో పోల్చినప్పుడు 2017-18లో గ్రామీణ ప్రజల తలసరి వినియోగం అన్ని విధాలా తీవ్రంగా పడిపోయిందని శాంపిల్‌ సర్వే వెల్లడించింది. అందుకు ఏకంగా ఆ సర్వే ఫలితాలను తొక్కిపెట్టారు. మనకి స్వాతంత్య్రం రాకముందు నుంచీ దేశంలో జనాభా లెక్కల సేకరణ ప్రతీ పదేళ్ళకోమారు జరుగుతోంది. మోడీ చెప్పేవన్నీ వొట్టి డాబులేనని ఆ జనాభా లెక్కలు ఎక్కడ బైట పెట్టేస్తా యో అన్న భయంతో ఆ జనాభా లెక్కల ప్రక్రియనే నిలిపివేశారు. నిరుద్యోగాన్ని లెక్కించేటప్పుడు వేతనం లేని పనిని కూడా నిరుద్యోగంగానే పరిగణించాలని ఐఎల్‌వో ప్రకటించింది. దానిని అనుసరిస్తే దేశంలో నిరుద్యోగం ఎంత తీవ్ర స్థాయిలో ఉందో బైటపడు తుంది. అందుచేత ఐఎల్‌వో విధానాన్ని పక్కన పెట్టేశారు.

వాస్తవానికి వేతనం లేని పని మాత్రమే కాదు. వేతనం చెల్లించే పనుల్లో కూడా అన్ని రకాల పనులనూ ఉపాధిగా లెక్కించకూడదు. 1930 దశకంలో మహా మాంద్యం నెలకొన్న కాలంలో బ్రిటన్‌లో చాలామంది నిరుద్యోగులు రోడ్ల పక్కన బూట్లు పాలిష్‌ చేయడానికి తయారయ్యారు. వారేమీ ఆ పనిని ఉచితంగా చేయలేదు. కాని అలాంటి వారినందరినీ ఉద్యోగులుగా లెక్కిస్తే నిరుద్యోగం అంత సంక్షోభ కాలంలో కూడా చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్టే నిర్ధారణ వస్తుంది. ఇటువంటి తరహాను ”ప్రచ్ఛన్న నిరుద్యోగులు”గా పరిగణించారు. ఐతే ఆనాటి సమాజం సంక్షోభాన్ని తీవ్రమైన విషయంగా పరిగణించింది. బాధాకరమైనది ఏమంటే ప్రస్తుతం భారత దేశంలో పాలకులు సంక్షోభాన్ని కూడా తీవ్రమైన విషయంగా పరిగణించడంలేదు.

ఒకవేళ మోడీ కొట్టుకునే సెల్ఫ్‌ డబ్బాయే వాస్తవం అయితే బడ్జెట్‌ గతంలో చెప్పినదాన్నే మళ్ళీ చెప్పడం అన్నది ఆశ్చర్యం కలిగించదు. ఈ బడ్జెట్‌ నిరుద్యోగాన్ని మరింత పెంచుతుంది. శ్రామిక ప్రజలను మరింత దారిద్య్రంలోకి నెడుతుంది. సమాజంలో ఇప్పటికే వికృత రూపం దాల్చుతున్న ఆర్థిక అసమానతలను మరింత పెంచుతుంది. కాని ఈ వాస్తవాలను ప్రభుత్వం ఒప్పుకోదు. మీడియాలో ఉన్న భజంత్రీలూ ఒప్పుకోరు. ఎందుకంటే, వారి నాయకుడు అటువంటి సమస్యలేవీ లేనే లేవని ప్రకటించారు కదా! ఫిబ్రవరి 1న పార్లమెంటులో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ ఈ సంగతిని స్పష్టం చేసింది.

ఆర్థిక మంత్రి ప్రసంగాన్ని చూద్దాం. సగటు నిజ ఆదాయాలు 50 శాతం పెరిగాయని ఆమె ప్రకటించారు. బహుశా గత దశాబ్దంతో పోల్చి ఆమె చెప్పి వుండాలి. కాని ఆమె చెప్పినది తలసరి ఆదాయం గురించి. అంతే తప్ప దేశంలో అత్యధిక సంఖ్యాకుల ఆదాయాల గురించి మాత్రం కాదు. జాతీయ సగటు ఆదాయం పెరిగింది కాబట్టి దేశంలో అందరి ఆదాయాలూ పెరిగినట్టే అని, దేశ ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని ఆమె చెప్పుకోవడంలో మేధోపరమైన నిజాయితీ లోపించింది.

2011-12, 2017-18 సంవత్సరాల మధ్య కాలంలో దేశంలో పౌష్టికాహార లేమి పెరిగింది. ముఖ్యంగా గ్రామీణ భారతంలో రోజుకు కనీసం 2200 కేలరీల శక్తినిచ్చే ఆహారాన్ని పొందలేని జనాభా (గ్రామీణ ప్రాంతంలో పేదరికాన్ని నిర్ధారించేందుకు ప్రణాళికా సంఘం నిర్ధారించిన ప్రమాణాల ప్రకారం) 68 శాతం నుండి 80 శాతానికి పెరిగింది. మరి ఈ కాలంలో దేశంలో అత్యధికుల ఆదాయాలు మెరుగుపడ్డాయని ఏ ప్రాతిపదికన చెప్తున్నారు ?

ఈ కాలంలో దేశంలో ఏం జరిగిందనేది ఇక్కడ పరిశీలించడం ముఖ్యం. ప్రజలు చేసే వినిమయాన్ని అంచనా వేయడానికి గతంలో జాతీయ శాంపిల్‌ సర్వే ఐదేళ్ళకోమారు గణాంకాలు సేకరించేది. ఇప్పుడు దానికి స్వస్తి చెప్పారు. కాని కొన్ని ఇతర గణాంకాల ఆధారంగా మనం కొన్ని నిర్ధారణలకు రావచ్చు. వాటిలో ఒకటి గ్రామీణ ప్రాంతాల్లో వాస్తవ ఆదాయాలకు సంబంధించి గత ఐదు సంవత్సరాల డేటా. వ్యవసాయ పనుల్లో గాని, వ్యవసాయేతర పనుల్లో గాని ఉన్నవారి నిజ ఆదాయాలు గత ఐదేళ్ళలోనూ పడిపోయాయి. పట్టణ ప్రాంతాల్లో సైతం అదే పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ యా నిర్ణీత వ్యవధుల్లో నిర్వహించే శ్రామిక సర్వే (పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే) తాజా వివరాల ప్రకారం దేశం మొత్తం మీద, అటు పట్టణాల్లో గాని, ఇటు గ్రామాల్లోగాని సగటు నెలవారీ ఆదాయాలు 2017-18కి, 2022-23కి మధ్య 20 శాతానికి పైగా పడిపోయాయి! అంటే 2017-18 తర్వాత నిజ ఆదాయాలు పడిపోతున్నాయనేది నిస్సందేహం.

స్వాతంత్య్రం వచ్చినది మొదలు ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో నేడు నిరుద్యోగం ఉంది. సిఎంఐఇ (సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ది ఇండియన్‌ ఎకానమీ) ప్రకారం దేశంలో ఉన్న ఉద్యోగాల సంఖ్యలో గత ఐదేళ్ళలో నికరమైన పెరుగుదల ఏమీ లేదు. ఒకపక్క నిజ వేతనాలు పడిపోతూ, మరొక పక్క ఉద్యోగాల సంఖ్యలో పెరుగుదల లేకపోవడం చూస్తే శ్రామికులుగా పని చేస్తున్నవారి తలసరి నిజ ఆదాయాలు పడిపోతున్నట్టు స్పష్టం ఔతోంది.

శ్రామికుల ఆదాయాలు తరిగిపోతున్నప్పుడు రైతుల, కూలీల ఆదాయాలు వేరే దిశలో ఎలా ఉంటాయి? రైతుల ఆదాయాలు పెరిగితేనే డిమాండ్‌ పెరుగుతుంది. అప్పుడు అదనంగా కార్మికులు అవసరం ఔతారు. దాని వలన ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయి. పైగా కార్మికుల నిజ వేతనాలు కూడా పెరుగుతాయి. ఇప్పుడు కార్మికుల నిజ వేతనాలు పడిపోతున్నాయంటే దానిని బట్టి రైతుల, కూలీల ఆదాయాలు కూడా పడిపోతున్నాయని-అంటే మొత్తం శ్రామిక ప్రజలందరి ఆదాయాలూ (వ్యవసాయ, వ్యవసాయేతర కూలీలు, రైతులు, చిన్న ఉత్పత్తిదారులు ) గత ఐదేళ్ళలో పడిపోయాయని నిర్ధారణ ఔతోంది. దేశ జనాభాలో ఈ శ్రామిక ప్రజలే అత్యధిక భాగం. అంటే దేశ జనాభాలో అత్యధిక భాగం గత ఐదేళ్ళ కాలంలో దిగజారిన జీవన పరిస్థితులను అనుభవిస్తున్నారన్నది తిరుగులేని సత్యం. 2011-12 నుంచి 2017-18 మధ్య కాలంలో వీరి వినిమయం బాగా పడిపోయిందని ధృవపరిచే గణాంకాలను కూడా దీనికి తోడు చేస్తే శ్రామిక ప్రజల దుర్భర జీవితాలు మనకి దర్శనమిస్తాయి.

ఈ కారణంగానే మోడీ హయాంలో ప్రైవేటు పెట్టుబడులు ఎదుగుదల లేకుండా స్తంభించిపోయాయి. బడా పెట్టుబడిదారులకు, అందునా ఎంపిక చేసిన కొద్దిమంది క్రోనీ పెట్టుబడిదారులకు బిజెపి ప్రభుత్వం ఎంత కొమ్ముగాసినా, ఇదే పరిస్థితి. ఇక ప్రైవేటు చిన్న పెట్టుబడిదారుల పెట్టుబడులూ స్తంభించిపోయాయి. లేదా తరిగిపోయాయి. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి అమలు, నిరంకుశమైన లాక్‌డౌన్‌లతో ఈ రంగం నడుము విరిగిపోయింది. కార్పొరేట్‌ సంస్థల లాభాలలో పెరుగుదల ఉన్నా, వారి పెట్టుబడులలో మాత్రం స్తంభనే కొనసాగుతోంది. తనకు వచ్చిన లాభాలను బట్టి కాకుండా, మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను బట్టి పెట్టుబడులు పెట్టడం జరుగుతుందన్నది వాస్తవం.

ఐతే పెట్టుబడుల వ్యయం ఏటికేడూ పెరుగుతోందని ప్రభుత్వం వాదించవచ్చు. తన బడ్జెట్‌ ప్రసంగంలోనూ ఆర్థిక మంత్రి ఇదే వాదన చేశారు. ఇలా పెరగడం వలన ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రైవేటు పెట్టుబడిదారులకు కావలసిన మార్కెట్‌ విస్తరణ జరుగుతుందని, అప్పుడు వారినుండి పెట్టుబడులు కూడా పెరుగుతాయని ఆ వాదన అంటుంది. ఐతే, ఇక్కడ జరిగిందేమంటే ప్రభుత్వం వైపు నుండి పెరిగిన పెట్టుబడుల వ్యయం ప్రభావం దేశీయ మార్కెట్‌లో కన్నా అంతర్జాతీయ మార్కెట్‌లో ఎక్కువగా వ్యక్తం ఔతోంది. అందుచేత దేశీయ మార్కెట్‌లో పెట్టుబడుల పెరుగుదల లేదు. ఇక ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహంలోని మరో భాగం ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా ప్రైవేట్‌ పెట్టుబడిదారులకు భారీగా రుణాలు ఇవ్వడం. ఇలా రుణాలు పొందినవారిలో క్రోనీ పెట్టుబడిదారులు కూడా ఉన్నారు. ”మౌలిక వసతుల కల్పన రంగం”లో పెట్టుబడులు పెట్టడానికిగాను వారికి ఈ రుణాలు ఇస్తున్నట్టు ప్రభుత్వం చెప్తోంది. దీని పర్యవసానంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల దగ్గర పారు బకాయిలు పెద్ద మొత్తాల్లో పేరుకుపోయాయి. అంటే ప్రైవేటు పెట్టుబడిదారులు తీసుకోవలసిన రిస్క్‌ను ప్రభుత్వ రంగ బ్యాంకులు తీసుకోవలసి వస్తోందన్నమాట. ఇలా రిస్క్‌ తీసుకున్నా, ఆ పెట్టుబడులలో అధిక భాగం విదేశీ మార్కెట్‌ లోని డిమాండ్‌ను పెంచడానికే దోహదపడుతోంది.

మోడీ ప్రవచించిన ”సత్యం” కారణంగా ఈ బడ్జెట్‌ ఎందుకూ కొరగాకుండా పోయింది. అలాగాక, ఏ లేశమైనా ప్రజల వాస్తవ పరిస్థితులను గనుక బడ్జెట్‌ పరిగణనలోకి తీసుకుని వున్నట్లైతే అది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుని వుండేది. నేరుగా ప్రజలకు నగదు బదిలీ చేయడం కాని, కనీస వేతనాల స్థాయిని పెంచి చట్టబద్ధంగా అమలు చేయడం కాని ప్రతిపాదించి వుండేది. ఈ రెండింటిలో రెండూ కాని, ఏ ఒక్కటి కాని చేసినా ప్రజలకు నేరుగా ప్రయోజనాలు లభిస్తాయి. అంతేగాక దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక ఊపు వచ్చి వుండేది. మార్కెట్‌ బలపడి, ప్రైవేట్‌ పెట్టుబడులు పెరిగి, ఉపాధి అవకాశాలు కూడా పెరిగివుండేవి.

కాని మన పాలకులకు అటువంటి విధానాలు నిషిద్ధం. నిజానికి దానికి పూర్తి వ్యతిరేక దిశలో నడుస్తున్నారు. ఆహారం, ఎరువులు, ఇంధనం మీద ఇచ్చే సబ్సిడీని రూ.4.13 లక్షల కోట్ల నుండి రూ.3.81 లక్షల కోట్లకు తగ్గించారు. ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు ఏ మాత్రం పెంచలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాదిరిగానే రూ.86,000 కోట్లకే పరిమితం చేశారు. ఈ విధంగా చేయడం ”ఆర్థిక విజ్ఞత”ను సూచిస్తోందని భజంత్రీ మీడియా మెచ్చుకుంది. ఇటువంటి ”ఆర్థిక విజ్ఞత”ను ప్రదర్శించినందువలన విదేశీ పెట్టుబడులు బాగా తరలి వస్తాయని ప్రభుత్వం కూడా చెప్పుకుంటోంది. అందువలన మన వృద్ధిరేటు ఇంకా పెరుగుతుందని కూడా చెప్తోంది. మన ”ఆర్థిక విజ్ఞత” ఎంత గొప్పగా ఉన్నా మన క్రెడిట్‌ రేటింగ్‌ (ఆర్థిక స్తోమతను అంచనా వేసే రేటింగ్‌) మాత్రం చాలా హీనంగానే కొనసాగుతోంది. ఇండోనేషియా కన్నా ఒక మెట్టు దిగువన, థారులాండ్‌ కన్నా రెండు మెట్లు దిగువన మనం ఉన్నాం. జంక్‌ బాండ్లు (దివాలా ఎత్తిపోయిన కంపెనీల వాటాలకు సంబంధించినవి) కన్నా ఒక్క మెట్టు మాత్రమే మనం పైన ఉన్నాం. అంటే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి మన ”ఆర్థిక విజ్ఞత” అంతగా రుచించలేదన్న మాటేగా !

(స్వేచ్ఛానుసరణ) ప్రభాత్‌ పట్నాయక్‌
(స్వేచ్ఛానుసరణ) ప్రభాత్‌ పట్నాయక్‌
➡️