జల గరళం

May 30,2024 05:30 #editpage

ప్రాణాధారమైన తాగునీరు విషతుల్యంగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రెండు నెలల క్రితం గుంటూరు నగరాన్ని వణికించిన కలుషిత తాగునీటి సమస్య ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఆ సంఘటన మరచిపోక ముందే తాజాగా విజయవాడలోనూ తాగునీరు కలుషితం కావడం, ఒకరిద్దరు మృత్యువాత పడినట్లు వస్తున్న వార్తలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఈ రెండు సంఘటనల్లోనూ అధికార యంత్రాంగం స్పందన అందుకు తగినట్లు లేకపోవడం విచారకరం! అటు గుంటూరులోనూ, ఇటు విజయవాడలోనూ స్థానిక ప్రజానీకం కలుషిత నీరు సరఫరా అవుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి ముందుగానే తీసుకువెళ్లారు. రెండు చోట్లా ప్రజలు అస్వస్థతకు గురికావడం, ఆస్పత్రుల్లో చేరడం, ప్రాణాలు పోవడం వంటి సంఘటనలు చోటుచేసుకుని, నిర్లక్ష్యపు తీరుపై మీడియాలో దుమ్మెత్తిపోసిన తరువాతే వారిలో కదలిక కనిపించింది. అప్పటికే జరిగిన నష్టాన్ని పూడ్చలేము కదా! ప్రజల నుండి ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. జలం గరళంగా మారడంతో గుంటూరు నగరంలో 2018లో ఏకంగా 24 మంది మృతి చెందారు. వేలాది మంది అస్వస్థతకు గురయ్యారు. ఆ సంఘటన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో తాగునీటి వ్యవస్థ తీరుతెన్నులపై ప్రభుత్వం వివరాలు సేకరించింది. కానీ, చర్యలు మాత్రం శూన్యం! ప్రతి ఏడాదీ ఏదో ఒక స్థాయిలో రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో ఈ తరహా సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయినా, అధికార యంత్రాంగం పాఠాలు నేర్వకపోవడం దారుణం!
తాజాగా కలుషిత నీటిబారిన పడిన విజయవాడ నగరంలోని 64 డివిజన్లలో సుమారు 1.40 లక్షల మంచినీటి కనెక్షన్లు ఉన్నాయి. తాగునీటిని సరఫరా చేసే పైపులైన్లన్నీ పాతకాలం నాటివి. వీటిలో కూడా డ్రైనేజి పైపులకు ఆనుకుని పోయే పైపులే ఎక్కువ! పైపులకు పెద్ద ఎత్తున లీకేజి సమస్యలు ఉన్నట్లు గతంలోనే గుర్తించారు. 2018 గుంటూరు విషాదం తరువాత అధికార యంత్రాంగం సేకరించిన వివరాల్లో ఈ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లు తేలింది. దాదాపుగా అన్ని నగరాలు, పట్టణాల్లోనూ మంచినీటి పైపులు పాతవని, మురుగునీటి పైపులు, కాలువల పక్కనుండి మంచినీటి పైపులు పోతున్నాయని, లీకేజీలు జరిగినప్పుడు మురుగునీరు మంచినీటితో కలుస్తోందని అధికారులు నిర్ధారించారు. నిర్ధారణైతే జరిగిందిగానీ, నివారణకు తీసుకున్న చర్యలు శూన్యం కావవడమే బాధాకరం! అప్పట్లోనే దాదాపుగా అన్ని పురపాలక, నగరపాలక సంస్థల నుండి తాగునీటి వ్యవస్థ మెరుగుదలకు వచ్చిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. అంతకు మందు కూడా అనేక సార్లు ఈ తరహా ప్రతిపాదనలు పంపినట్లు కింది స్థాయి సిబ్బంది చెబుతున్నారు. ప్రభుత్వాలకు ప్రజల నుండి పన్నులు వసూలు చేయడంపై ఉన్న శ్రద్ధ మౌలిక వసతుల కల్పనపై లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. ప్రపంచబ్యాంకు వంటి విత్త సంస్థలు సైతం వీటిపై దృష్టి పెట్టకుండా, కార్పొరేట్లకు మేలు జరిగేలా చూస్తున్నాయి.
మరోవైపు ఏజెన్సీ ప్రాంతంలో వాంతులు, విరేచనాలు, జ్వరాలతో ఆస్పత్రుల పాలవుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మన్యం జిల్లాలో ఈ తరహా లక్షణాలతో వస్తున్న రోగులకు బెడ్‌లు చాలక, నేల మీదనే ఉంచి వైద్యం అందిస్తుండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ఏజెన్సీ ప్రాంతంలో ఈ తరహా వ్యాధులు ప్రబలడానికి అనేక అంశాలతో పాటు నీటి కాలుష్యం కూడా కారణం. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందన్న ఆందోళన స్థానిక గిరిజనుల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ నాయకత్వం లేదు. జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వచ్చి, కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పడటానికి మరి కొంత సమయం పట్టవచ్చు. అప్పటి వరకు అధికార యంత్రాంగానిదే కీలక బాధ్యత! ఈ విషయాన్ని అత్యున్నత స్థాయి నుండి దిగువ స్థాయి వరకు ఉన్న ప్రభుత్వ అధికారులు గుర్తించాలి. ముంచుకొచ్చే సమస్యలపై ఎప్పటికప్పుడే కదలి ప్రజలకు భరోసా ఇవ్వాలి. అదే సమయంలో పట్టణ ప్రాంతాలతో పాటు, మారు మూల గ్రామాల్లోనూ, ఏజెన్సీ ప్రాంతాల్లోనూ కొన్ని సీజనల్‌ సమస్యలు, వ్యాధులు తలెత్తుతున్నాయి. వాటిపై శ్రద్ధ పెట్టాల్సిన బాధ్యత అధికార యంత్రంగానిదే. ఏది ఏమైనా ప్రజలందరికీ రక్షిత నీటిని అందించడం ప్రభుత్వాల బాధ్యత. దాన్ని నెరవేర్చాలి.

➡️