Ramesh Rathore -ఆదిలాబాద్‌ మాజీ ఎంపి రాథోడ్‌ రమేష్‌ మృతి

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో :ఆదిలాబాద్‌ మాజీ ఎంపి రాథోడ్‌ రమేష్‌(57) మృతి చెందారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే అదిలాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. కోమాలోకి వెళ్లడంతో పరిస్థితి విషమించింది. శనివారం ఆదిలాబాద్‌ నుంచి హైదారాబాద్‌ తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచారు. నార్నూర్‌ మండలంలోని తాడిహత్నూర్‌ గ్రామానికి చెందిన రాథోడ్‌ రమేష్‌ 1966 అక్టోబర్‌ 20న జన్మించారు. టిడిపిలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన తొలుత నార్నూర్‌ జడ్‌పిటిసిగా పనిచేశారు. టిడిపి హయాంలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగానూ పనిచేశారు. 1999 నుంచి 2004 వరకు ఖానాపూర్‌ ఎమ్మెల్యేగా సేవలందించారు. 2009లో టిడిపి తరపున ఎంపీగా గెలుపొందారు. అనంతరం టిఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి 2018లో ఖానాపూర్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఎంపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2021 జూన్‌లో బిజెపిలో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరపున ఖానాపూర్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాథోడ్‌ మృతి పట్ల వివిధ పార్టీల నాయకులు సంతాపం తెలిపారు. జడ్‌పి చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్‌, బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్‌, కాంగ్రెస్‌ ఎంపి అభ్యర్థిగా పోటీ చేసిన ఆత్రం సుగుణ తదితరులు సంతాపం తెలిపి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆదివారం ఉదయం 10.30గంటలకు ఉట్నూర్‌ మండలంలోని లింగోజితండా(ఎక్స్‌రోడ్‌) వద్ద వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

➡️