17న ‘బాహుబలి : క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’ విడుదల

May 8,2024 19:15 #bahubali, #movie

‘బాహుబలి’ సినిమాలతో సినీప్రియుల్ని అలరించారు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఇప్పుడీ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న యానిమేటెడ్‌ సిరీస్‌ ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’. దీనికి జీవన్‌ జె.కాంగ్‌, నవీన్‌ జాన్‌ దర్శకత్వం వహించారు. గ్రాఫిక్‌ ఇండియా, ఆర్కా మీడియా వర్క్స్‌ ప్రయివేటు లిమిటెడ్‌ సంస్థలతో కలిసి రాజమౌళి, శరద్‌ దేవరాజన్‌, శోభు యార్లగడ్డ నిర్మించారు. ఇది ఈ నెల 17న ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు రాజమౌళి మాట్లాడారు. ‘బాహుబలి సినిమా ప్రపంచాన్ని సృష్టించే సమయంలో అందులోని ప్రతి పాత్రకు సంబంధించిన పూర్తి స్టోరీని రాసి పెట్టుకున్నాం. మొత్తం కథను రెండు భాగాల్లో చెప్పడం అసాధ్యమని అర్థమై.. దాన్ని ఇలా గేమ్స్‌, యానిమేటెడ్‌ సిరీస్‌ రూపాల్లో బయటకు తీసుకురావాలని ప్రయత్నించాం. అయితే ఈ ప్రయాణంలో సరైన వ్యక్తులతో జత కట్టాలని మాకు అర్థమైంది. అప్పుడే శరద్‌ తన ఆలోచనని నాతో పంచుకున్నారు. యానిమేషన్‌లో ఆయన విజన్‌ నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత ఆయనతో చాలా కథాచర్చలు జరిగాయి. ఈ కథను ముందుకు తీసుకెళ్లమని శరద్‌కు చెప్పడానికి నా మనసుకు చాలా కష్టంగా అనిపించింది. నా ప్రమేయం లేకుండా బాహుబలి కథ చెప్పడమా అనిపించింది (నవ్వుతూ). కానీ, శరద్‌ ‘బాహుబలి’లోని పాత్రలపై నాకున్న ప్రేమను అర్థం చేసుకుని.. తన బృందంతో కలిసి చక్కగా ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’ కథను సిద్ధం చేసి తీసుకొచ్చారు. అది నాకు బాగా నచ్చడంతో ఈ సిరీస్‌ మొదలైంది. ఇది ‘బాహుబలి’కి సీక్వెల్‌ లేదా ప్రీక్వెల్‌లా ఉండదు. ఆ రెండు భాగాలకు మధ్యలో జరిగే కథ ఇది.” అని అన్నారు. ఈ కార్యక్రమంలో శరద్‌ కేల్కర్‌, శరద్‌ దేవరాజన్‌, గౌరవ్‌ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.

➡️