నాడు బాల నటులు… నేడు కథానాయకులు

Mar 31,2024 19:30 #movie

నేటి చైల్డ్‌ ఆర్టిస్టులే రేపటి ఫ్యూచర్‌ స్టార్లు అని చెబుతూ ఉంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ బాలనటులుగా సత్తా చాటి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న వారు ఆ తర్వాత హీరోలుగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా రాణించారు. రాణిస్తున్నారు. ఆలీ, మహేష్‌బాబు, జూనియర్‌ ఎన్‌టిఆర్‌, అల్లు అర్జున్‌, అఖిల్‌, తేజా సజ్జా, విశ్వకార్తికేయ, ఆకాష్‌ పూరి తదితరులు ఈ కోవకే చెందుతారు.
మహేష్‌బాబు బావ గల్లా జయదేవ్‌ వారసుడిగా తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టిన అశోక్‌ గల్లా కూడా బాలనటుడే. సూపర్‌స్టార్‌ కృష్ణతోనూ, ఆయన తనయుడు మహేష్‌బాబుతో ‘నాని’ సినిమాల్లో నటించాడు. తర్వాత ‘హీరో’ సినిమాతో హీరోగా తెరంగ్రేటం ఎగురవేశారు. వెంకటేష్‌ నటించిన ‘ఇంట్లో ఇల్లాలు… వంటింట్లో ప్రియురాలు’ సినిమాలో నాగ అన్వేష్‌ బాలనటుడిగా నటించాడు. బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో అలరించిన తేజ సజ్జా ‘హనుమాన్‌’ సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు.
మహేష్‌బాబు : 1979లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘నీడ’ చిత్రం ద్వారా బాలనటుడిగా నాలుగేళ్ల వయస్సులోనే మహేష్‌బాబు కనిపించాడు. 11 సంవత్సరాల్లో 9 చిత్రాల్లో బాలనటుడిగా నటించాడు. 1999లో ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు.
ఎన్‌టిఆర్‌ : గుణశేఖర్‌ దర్శకత్వంలో జూనియర్‌ ఎన్‌టిఆర్‌ ‘రామాయణం’ చిత్రంలో నటించారు. శ్రీరాముడి పాత్రలో ఆయన నటించగా అప్పట్లో ఈ సినిమా రికార్డులను నెలకొల్పింది. అంతకు ముందు ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రంలో భరతుడి పాత్రలో కనిపించాడు. 2001లో ‘నిన్ను చూడాలని’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ద్వారా ఆస్కార్‌ స్థాయి నటుడిగా గుర్తింపుపొందారు.
తరుణ్‌ : అంజలి, తేజ, మనసు మమత, పిల్లలు దిద్దిన కాపురం లాంటి సినిమాల్లో బాల నటుడిగా రాణించిన తరుణ్‌ ‘నువ్వే కావాలి’ చిత్రంతో 2000లో హీరోగా మారారు. ఉత్తమ బాల నటుడిగా పలుసార్లు నంది అవార్డులు అందుకున్నారు. నటి రోజా రమణి ఆయన తల్లి. ఆమె తన ఏడేళ్ల వయసులో సూపర్‌హిట్‌ చిత్రం ‘భక్త ప్రహ్లాద’లో ప్రహ్లాదుని పాత్రలో నటించి మెప్పించారు. సుమారు 300 సినిమాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతులను అందుకున్నారు.
ఆలీ: 1949లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘నిండు నూరేళ్లు’ సినిమా ద్వారా బాలనటుడిగా తెరంగేట్రం చేశారు. ‘సీతాకోక చిలుక’లో బాలనటుడిగా ఆకట్టుకున్నాడు. ‘యమలీల’ సినిమాలో హీరోగా కూడా నటించారు. ప్రస్తుతం స్టార్‌ కమెడియన్‌గా ఉన్నారు.
వెంకటేష్‌ : 1971లో ‘ప్రేమ్‌నగర్‌’ చిత్రంలో చిన్నప్పటి ఎఎన్‌ఆర్‌ పాత్రలో కనిపించారు. ఆ తర్వాత బాలనటుడిగా ఏ సినిమాల్లోనూ నటించలేదు. 1986లో విడుదలైన ‘కలియుగ పాండవులు’ చిత్రంతో హీరోగా మారారు.
అఖిల్‌ : 1994లో విడుదలైన ‘సిసింద్రీ’ సినిమాలో నెలల వయస్సున్నప్పుడే అఖిల్‌ తెర మీద కనిపించాడు. 2014లో ‘మనం’ చిత్రంలో ఆఖరి షాట్‌లో యువకుడిగా కనిపించాడు. 2015లో ‘అఖిల్‌’ చిత్రం ద్వారా హీరోగా తెర మీద దర్శన మిచ్చాడు.
ఆకాష్‌ పూరి : హీరో రామ్‌చరణ్‌ తొలి చిత్రం ‘చిరుత’తోనే ఆకాష్‌ పూరీ బాలనటుడిగా పరిచయం అయ్యాడు. బుజ్జిగాడు, గబ్బర్‌సింగ్‌ వంటి చిత్రాల్లోనూ నటించిన ఆకాష్‌… ‘ఆంధ్రపోరి’ చిత్రంతో హీరోగా మారాడు. ఆ తర్వాత ‘రొమాంటిక్‌’ అనే చిత్రంలో నటించాడు.
తనీష్‌ : దేవుళ్లు, మన్మధుడు వంటి చిత్రాల ద్వారా బాలనటుడిగా పేరు తెచ్చుకున్న తనీష్‌ ‘నచ్చావులే’ చిత్రంతో హీరోగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ‘రైడ్‌’, ‘మేం వయస్సుకు వచ్చాం’ వంటి యూత్‌ ఎంటర్‌టైనర్స్‌లో నటించారు.
అల్లు అర్జున్‌ : హీరో చిరంజీవి నటించిన ‘డాడీ’ సినిమాలో అల్లు అర్జున్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించారు. ఐదేళ్ల వయసులోనే ‘విజరు’ అనే చిత్రంలో చిన్న పాత్రను కూడా చేశారు. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారారు.
మనోజ్‌ : మేజర్‌ చంద్రకాంత్‌ సినిమాతో పెద్ద ఎన్‌టిఆర్‌తో స్క్రీన్‌ పంచుకున్న గౌరవం మంచు మనోజ్‌కు లభించింది. తరువాత ఎన్నో సినిమాల్లో నటిస్తున్నారు.
కళ్యాణ్‌రామ్‌ : 1989లో విడుదలైన ‘బాలగోపాలుడు’ చిత్రంతో చైల్డ్‌ ఆర్టిస్టుగా కళ్యాణ్‌రామ్‌ నటించారు. ఆ తర్వాత ఏ సినిమాలోనూ బాలనటుడిగా నటించలేదు. 2003లో విడుదలైన ‘తొలిచూపులోనే’ చిత్రంతో హీరోగా మారారు.
విశ్వకార్తికేయ : గోరింటాకు, జానకి వెడ్స్‌ శ్రీరామ్‌, విష్ణు, లేత మనసులు, శివశంకర్‌, అధినాయకుడు లాంటి చిత్రాల్లో బాలనటుడిగా కనిపించాడు. నటనతో మెప్పించటంతోపాటుగా నంది, ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులను సొంతం చేసుకున్నారు. జనసేన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కలియుగం పట్టణంలో సినిమాలో నటించారు.
తేజ సజ్జా : ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన పెద్ద హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టేసిన హీరో తేజ సజ్జా. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన హనుమాన్‌ టాలీవుడ్‌ చరిత్రలో రికార్డులను సైతం తిరగరాసింది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మనదేశంతోపాటుగా శ్రీలంక, జపాన్‌, చైనా, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, స్పెయిన్‌లోనూ సత్తా చాటింది. 2000లో యువరాజు సినిమాలో మహేష్‌ బాబు కొడుకుగా తేజ నటించాడు. సరిగ్గా 24వ ఏట అదే మహేష్‌బాబు మూవీ ‘గుంటూరు కారం’ సినిమాకు ‘హనుమాన్‌’లో హీరోగా పోటీ ఇచ్చారు.

➡️