సంగీత ప్రియుల చేరువకే సినీ రంగాన్ని ఎంచుకున్నా : వర్తమాన సంగీత దర్శకుడు డేవ్‌ జాండ్‌

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి) : తనకు సంగీతం అంటే ప్రాణమని కోట్లాదిమంది సంగీత ప్రియుల అభిమానాన్ని మనసులను గెలుచుకోవాలంటే సినీ రంగం ఒక మార్గమని భావించి ఆ రంగంలో రాణించటానికి ప్రయత్నిస్తున్నానని వర్తమాన సినీ సంగీత దర్శకుడు డెవ్‌ జాండ్‌ (ఈగల్‌ సినిమా మ్యూజిక్‌ డైరెక్టర్‌) అన్నారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం ఆయన స్వగ్రామం సరిపల్లికి విచ్చేసిన సందర్భంగా … ఆయన అభిమానులు, గ్రామస్తులు, స్నేహితులు, ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన కొంతసేపు మీడియాతో ముచ్చటించారు. తన బాల్యమంతా నరసాపురం లోనే గడిచిందని కళాశాల విద్య మద్రాసు వైజాగ్‌ లోను ఉన్నత విద్యను అమెరికాలో పూర్తి చేశానని అన్నారు. తన తండ్రి జోసఫ్‌ రాజు కు గిటారు, పియోనో వంటి వాయిద్యాలలో మంచి ప్రావీణ్యం ఉందన్నారు. తన తల్లిదండ్రులు స్వర్ణ గీత జోసెఫ్‌ రాజు చాలా కాలం నుంచి పేదలు, వఅద్ధులు అనాధల సంక్షేమం కోసం స్వచ్ఛంద సంస్థలను నిర్వహిస్తున్నారని తెలిపారు. తన అభిరుచులను కుటుంబపరంగా ప్రోత్సహించడంతో తాను ఈ స్థాయికి రాగలిగానన్నారు. సినీ రంగంలో దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని తనకు మంచి మిత్రుడు అని చెప్పారు. రవితేజ హీరోగా నటించి తాను సంగీతం అందించిన ఈగల్‌ చిత్రం విజయం సాధించడం తనలో నమ్మకాన్ని మరింత పెంచిందని అన్నారు. ఈ చిత్రానికి పని చేసిన మిగతా ఫ్రేమ్స్‌ అందరి సహకారం మరువలేనిది అని అన్నారు. కొత్త వాళ్లను ప్రోత్సహించడంలో హీరో రవితేజ ముందు వరసలో ఉంటారని అన్నారు. హీరో తేజ సజ్జ నటిస్తున్న సినిమాకి తన సంగీతం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రంతోపాటు మరో రెండు చిత్రాలకు అగ్రిమెంట్‌ కుదిరింది అని డెవ్‌ జాండ్‌ అన్నారు. అనంతరం గ్రామానికి విచ్చేసిన డెవ్‌ జాండ్‌ ను గ్రామ సర్పంచ్‌ ఈదా సురేష్‌ బాబు, ఎంపీటీసీ చెన్నం వెంకట్రావు, గ్రామ పెద్దలు గమ్మిడి మధుబాబు, రాజ్‌ కుమార్‌ , సోడా దాసి శ్రీధర్‌ , తదితరులు సత్కరించారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులు డెవ్‌ జాండ్‌ తో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు.

➡️