నా డీప్‌ ఫేక్‌ వీడియో కాల్స్‌ వస్తే నమ్మకండి : సోనూసూద్‌

అమరావతి : డీప్‌ ఫేక్‌ వీడియోల కారణంగా ఇప్పటికే పలువురు ప్రముఖులు చాలా ఇబ్బందులుపడ్డారు. మొదట రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అలియా భట్‌, కాజోల్‌, కత్రినా కైఫ్‌, ప్రియాంక చోప్రాల డీప్‌ ఫేక్‌ వీడియోలు ఆందోళన కలిగించాయి. తాజాగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ కూడా దీని బారినపడ్డారు. వీటిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వీటిని నివారించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇప్పుడు ఈ వరుసలో నటుడు బాలివుడ్‌ నటుడు సోనూసూద్‌ చేరారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఎంతోమందికి సోనూసూద్‌ అండగా నిలిచి రియల్‌ హీరో మన్ననలను పొందారు. అయితే … కొందరు దుండగులు సోనూసూద్‌ ఫేక్‌ వీడియోను రూపొందించి అభిమానులను డబ్బులు అడుగుతున్నారు. దీనిపై జాగ్రత్తగా ఉండాలని సోనూసూద్‌ తన సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు సూచించారు. – ” కొందరు నా డీప్‌ ఫేక్‌ వీడియోను క్రియేట్‌ చేసి అభిమానులతో చాటింగ్‌, వీడియో కాల్‌ చేస్తూ డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారు. చాలామంది అమాయకులు ఆ వీడియోలో ఉన్నది నేనే అనుకొని సైబర్‌ నేరగాళ్ల వలలో పడుతున్నారు. ఇలాంటి వీడియో కాల్స్‌ వస్తే నమ్మకండి.. జాగ్రత్తగా ఉండండి ” అని సోనూసూద్‌ కోరారు. నిజ జీవితంలో జరిగిన ఇలాంటి ఘటనల మీదే.. తాను ‘ఫతే’ సినిమా తీస్తున్నట్లు చెప్పారు. డీప్‌ ఫేక్‌, లోన్‌ యాప్స్‌ వల్ల జరుగుతున్న సైబర్‌ నేరాలను అందులో వివరంగా చూపించనున్నట్లు తెలిపారు.

➡️