కొత్తదనానికి తెరాభిషేకం!

Dec 17,2023 18:57 #telugu movies
movies round up 2023

ఈ ఏడాది తెలుగు సినిమా సందడి ఇద్దరు పెద్ద హీరోలతో ప్రారంభమైంది. ‘వాల్తేరు వీరయ్య’తో చిరంజీవి, ‘వీర సింహారెడ్డి’తో బాలకృష్ణ సంక్రాంతి బరిలో నిలిచారు. వాళ్ల మధ్యలో ‘కళ్యాణం కమనీయం’ అంటూ సంతోష్‌ శోభన్‌, నెలాఖరులో ‘హంట్‌’ చేస్తానని సుధీర్‌బాబు ప్రేక్షకుల ముందుకువచ్చారు. బాలీవుడ్‌ సినిమా ‘పఠాన్‌’తో షారూక్‌ కూడా ఆ జబితాలోకి వచ్చాడు. తొలిసారి గోపిచంద్‌ మలినేనితో బాలకృష్ణ తీసిన ‘వీర సింహారెడ్డి’ సినిమాకు ప్రేక్షకులు నీరాజనం పలికారు. అలాగే ఒక్కరోజు వ్యవధితో విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ కూడా చిరంజీవి కెరీర్‌లో ఓ హిట్‌ని జత చేసింది. బాబీ కొల్లితో ‘అన్నయ్య’ తరువాత రవితేజ కాంబినేషన్‌తో చిరంజీవి ఈ సినిమాలో నటించారు. దీంతో అటు చిరంజీవి అభిమానులు, ఇటు రవితేజ అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. చిన్న సినిమాలతో వచ్చిన సుధీర్‌బాబు, శోభన్‌కి కూడా ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. అలా ఈ ఏడాది సినిమా శుభారంభంతో మొదలైంది.

ఆరంభం జోరునే కొనసాగిస్తూ ఫిబ్రవరి, మార్చిల్లో కూడా అభిమానులు సంతోషపడే సినిమాలు పలకరించాయి. ‘సార్‌’తో ధనుష్‌, ‘దసరా’తో నాని, ప్రకాష్‌రాజ్‌ ‘రంగమార్తాండ’, ‘బలగం’ సినిమాలు విజయాలను సొంతం చేసుకున్నాయి. కళ్యాణ్‌ రామ్‌ ‘అమిగోస్‌’కి కూడా మంచి ప్రజాదరణే దక్కింది. కిరణ్‌ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’, సంతోష్‌ శోభన్‌ ‘శ్రీదేవి శోభన్‌ బాబు’, విశ్వక్‌ సేన్‌ ‘దాస్‌ కా ధమ్కీ’, అనువాద చిత్రం ‘సెంబి’ వంటి సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరించారు.

కమెడియన్‌గా రాణిస్తున్న వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన ‘బలగం’ సినిమాకు గొప్ప ప్రశంసలు వచ్చాయి. విశేష ప్రజాదరణ పొందిన చిత్రంగా కూడా నిలిచిపోయింది. పాత రోజుల్లో లాగా తెలంగాణా గ్రామాల్లో తెరలు కట్టి మరీ ఆ సినిమాను ప్రదర్శించారు. నాని మొదటిసారి రఫ్‌ లుక్‌లో కనిపించిన ‘దసరా’కి కూడా ప్రేక్షకుల ఆదరణ వచ్చింది. నాటక రంగం ఇతివృత్తంతో తెరకెక్కిన ‘రంగ మార్తాండ’కి కూడా మంచి మార్కులే పడ్డాయి. సుధీర్‌బాబు, కృతిశెట్టి జంటగా వచ్చిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రం మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

ఈ ఏడాది వేసవికి మాత్రం పెద్ద హీరోల సినిమాలేవీ విడుదల కాలేదు. సమంత ‘శాకుంతలం’, సాయిధరమ్‌ తేజ్‌ ‘విరూపాక్ష’ సినిమాలతో పాటు మణిరత్నం ‘పొన్నియన్‌ సెల్వన్‌-2’, అఖిల్‌ ‘ఏజెంట్‌’, గోపీచంద్‌ ‘రామబాణం’, అల్లరి నరేష్‌ ‘ఉగ్రం’, రవితేజ ‘రావణాసుర’, కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’, ‘మీటర్‌’, ఆంటోని చిత్రం బిచ్చగాడు-2 వంటి సినిమాలు విడుదలైనా ‘విరూపాక్ష’ మినహా మిగిలిన వేటికీ అంతగా ఆదరణ దక్కలేదు. అలా ఈ ఏడాది వేసవిలో సినిమా సందడి అంతగా కనిపించలేదు.

ఏడాది ద్వితీయార్థంలో కూడా స్తబ్ధత కొనసాగింది. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌, ప్రభాస్‌తో తెరకెక్కించిన ‘ఆదిపురుష్‌’ చిత్రం జూన్‌లో విడుదలైంది. భారీ బడ్జెట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఆది నుంచే అభాసుపాలైంది. గ్రాఫిక్స్‌ మాయాజాలంతో కార్టూన్‌ ఫిల్మ్‌ని తలపించిందని, కథను వక్రీకరించారని ఇలా రకరకాల కారణాలతో ప్రేక్షకులు ఆ సినిమాని తిరస్కరించారు. అదే నెలలో చిన్న సినిమాగా వచ్చిన శ్రీవిష్ణు ‘సామజవరగమన’ మాత్రం ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఆ నెలలోనే ‘స్పై’ చిత్రంతో నిఖిల్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాని కూడా ప్రేక్షకులు ఆదరించలేదు. రానా తమ్ముడు అభిరామ్‌ దగ్గుబాటి డెబ్యూ సినిమాగా తేజ దర్శకత్వంలో వచ్చిన ‘అహింస’ కూడా అంతగా మెప్పించలేదు. జులై నెలలో విడుదలైన సాయిధరమ్‌ తేజ్‌, పవన్‌ కళ్యాణ్‌ కాంబినేషనల్లో వచ్చిన ‘బ్రో’ చిత్రం అభిమానులను ఖుషీ చేసింది. ‘బేబీ’ చిత్రంతో సాయిరాజేష్‌ యవత నుంచి మంచి మార్కులే పొందారు.

ఆగష్టు, సెప్టెంబరు నెలల్లో మరోసారి సినిమా పండుగ కనిపించింది. ‘భోళా శంకర్‌’తో చిరంజీవి, ‘గాంఢవీధారి అర్జున’తో వరుణ్‌తేజ్‌, రామ్‌ ‘స్కంద’, సమంత, విజరుదేవర కొండ ‘ఖుషి’, అనుష్క, నవీన్‌ కాంబినేషనల్లో వచ్చిన ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాలన్నింటికీ మిశ్రమ స్పందన వచ్చింది. ‘భోళా శంకర్‌’ చిత్రానికి మొదటి ఆట నుండే విమర్శలు ఎదురయ్యాయి. దీంతో ఆరంభం అదిరినా కొత్తదనం లేక సినిమా పండుగ వెలవెలబోయింది.

ఏడాది చివర్లో మళ్లీ పెద్ద సినిమాల జోరు కనిపించింది. ‘టైగర్‌ నాగేశ్వరరావు’తో రవితేజ, బాలకృష్ణ ‘భగవంత్‌ కేసరి’, నాని ‘హారు నాన్న’, నితిన్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ చిత్రాలు వరుసగా అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో విడుదలై ప్రేక్షకులను కనువిందు చేశాయి. అనిల్‌ రావిపూడితో బాలకృష్ణ ప్రయత్నించిన ‘భగవంత్‌ కేసరి’ మంచి వ్యూస్‌ని దక్కించుకుంది. నితిన్‌ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. బాలీవుడ్‌ చిత్రం ‘యానిమల్‌’ కూడా ఈ సీజన్‌లోనే విడుదలై విమర్శలతో పాటు కొందరి ఆదరణా పొందింది. ఈ నెలాఖరులో ప్రభాస్‌ ‘సలార్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ చిత్రాలతో పాటు ఏడాది మొత్తంలో అనువాద చిత్రాలు, రీమేక్‌లు కూడా అడపాదడపా వచ్చి పలకరించాయి. సినిమాలు చిన్నవైనా, పెద్దవైనా, అనువాదాలైనా, రీమేకులైనా కొత్తదనానికి ప్రేక్షకులు పట్టం కట్టారు. అయితే మహేష్‌బాబు, అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌, వెంకటేష్‌, నాగార్జున, పవన్‌కళ్యాణ్‌ వంటి ప్రముఖ నటుల చిత్రాలు మాత్రం ఈ ఏడాది థియేటర్లో కనిపించలేదు.

➡️