కల్కి నుంచి క్రమంగా ఆక్యుపెన్సీ పెరిగేనా?

Jun 30,2024 19:30 #movie, #review

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో దీపికాపడుకొణె, అమితాబ్‌బచ్చన్‌, కమల్‌హాసన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విజయం దిశగానే దూసుకుపోతోంది. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌లో అశ్వనీదత్‌ ఆధ్వర్యంలో ఆయన ఇద్దరు కుమార్తెలు ప్రయాంకదత్‌, స్వప్నదత్‌ ఈ సినిమాను నిర్మించారు. ఈ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావటంతో థియేటర్లు కళకళలాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈఏడాది ఆరంభం నుంచి థియేటర్లలో ఆక్సుపెన్సీ అంతంతమాత్రంగానే ఉన్న విషయం తెలిసిందే. పెద్ద హీరోల సినిమాలు వస్తేనే పెరుగుతుంది. చిన్న సినిమాలకు అంత స్పందన ఉండటం లేదు. ఏటేటా మాదిరి ఈ ఏడాది సమ్మర్‌కు కొత్త సినిమాల జాతర లేకుండా పోయిన విషయం విధితమే. కనీసం ఆక్సుపెన్సీ లేక ఏకంగా టాలీవుడ్‌ పరిధిలోని సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు మేనెలలో మూతపడిన విషయం తెలిసిందే. మేనెల చివరి వారంలో చిన్న హీరోల సినిమాలు కొన్ని రావటంతో థియేటర్లు తెరుచుకున్నా నేటికీ ఇంకా పూర్తిగా నిండే పరిస్థితులు కనిపించటం లేదు. ఈ క్రమంలో వచ్చిన ‘కల్కి 2898ఏడీ’ సినిమా రంగానికి కొంత ఊపు తెచ్చిందనే చెప్పాలి. పాజిటిక్‌ టాక్‌ రావటం, ఈ సినిమాకు మరొకటి పోటీ లేకపోవటంతో మార్కెట్లో దూసుకుపోతోంది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో కొంత ప్రేక్షకులు ఆశించినస్థాయిలోనే కనిపిస్తున్నాయి. సైన్స్‌, టెక్నాలజీలకు పెద్దపీట వేయటంతోపాటు సాంకేతికపరంగా కొత్త హంగులు జోడించటం, కొత్త ప్రపంచాలు సృష్టించటం వంటి అంశాలు సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకునేలానే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత ఈనెల 12న ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్‌గా సన్షేనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ నేతృత్వంలో కమల్‌హాసన్‌ హీరోగా ‘భారతీయుడు-2’ సినిమా విడుదల కానుంది. అగ్ర హీరో ప్రభాస్‌ సినిమాతో కొన్ని రోజులపాటు థియేటర్లు కళకళలాడుతుండే విషయం తెలిసిందే. ఈ క్రమంలో నెలకు ఒక్కటి చొప్పున పెద్ద హీరోల సినిమాలు రాబోతున్నాయి. పుష్ప-2 ఆగస్టు 15న విడుదల చేస్తామని మేకర్లు ప్రకటించినా డిసెంబర్‌ 6కు మళ్లీ వాయిదా పడింది. అక్టోబర్‌ 10న ఎన్‌టిఆర్‌ నటించిన ‘దేవర’ విడుదల కానుంది. అదేనెల 29న ‘గేమ్‌ ఛేంజర్‌’ విడుదల అవుతుందని మేకర్లు ప్రకటించారు. తుది షెడ్యూల్‌లో ఈ సినిమా ఉంది. ‘భారతీయుడు 2’ సినిమా విడుదలైన తర్వాత ‘గేమ్‌ఛేంజర్‌’ మూవీ మిగతా పార్టు పూర్తిచేస్తామని ఇటీవల దర్శకుడు శంకర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ 2025 సంక్రాంతికి విడుదల కానుంది.

మిశ్రమ స్పందన
ఇటీవల విడుదలైన చిన్న సినిమాలు కూడా కొన్ని బాగానే ఆడాయి. కథాబలం ఉన్న సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. శర్వానంద్‌ హీరోగా, కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన ‘మనమే’ కొంతమేర ఆకట్టుకుంది. ఈ మధ్యకాలంలో ‘వ్యాన్‌’, ‘లవ్‌ మీ..ఇఫ్‌ యు డేర్‌’, ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’, సుధీర్‌బాబు ‘హరోం హర’, కాజల్‌ ‘సత్యభామ’, కార్తికేయ కథానాయకుడిగా నటించిన ‘భజే వాయు వేగం’, ఆనంద్‌ దేవరకొండ ‘గం గం గణేశా’, మ్యూజిక్‌ షాపు మూర్తి, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, లాక్‌డౌన్‌, ఓ మంచి ఘోస్ట్‌ (ఓఎంజీ), ‘ఐ20’, లవ్‌, మౌళి వంటి చిత్రాలకు మిశ్రమ స్పందన లభించింది.

నిర్మాణదశల్లో..
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్‌ బాబీ కాంబినేషన్‌లో ఎన్‌బికె109 పేరుతో ఒక సినిమా తెరకెక్కుతోంది. హీరో వరుణ్‌తేజ్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘మట్కా’ లాంగ్‌ షెడ్యూల్‌లో కొనసాగుతోంది. ఈ సినిమాలో హీరో నాలుగు పాత్రల్లో నటిస్తున్నారు. నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్‌కెఆర్‌ా21’ యాక్షన్‌ జోనర్‌లో సిద్ధమవుతోంది. ప్రియదర్శి హీరోగా నటిస్తున్న చిత్రం ‘డార్లింగ్‌’. ఈ సినిమా జులై 19న విడుదల కానుంది. 8త్‌ వండర్‌ సినిమా బ్యానర్‌పై ‘స్పిరిట్‌’,ఆర్‌కె ఫిలింస్‌, స్నిగ్ధ బ్యానర్స్‌పై ‘దీక్ష’, హీరో నిఖిల్‌ నటిస్తున్న ‘స్వయంభూ’ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. నటుడు దేవ్‌గిల్‌ నేతృత్వంలో దేవ్‌గిల్‌ ప్రొడక్షన్‌ నుంచి ‘అహో! విక్రమార్క’ మొదటి ప్రాజెక్టు టీజర్‌ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. నితిన్‌, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రాబిన్‌హుడ్‌’, అడవి శేష్‌ హీరోగా, శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా ‘డకాయిట్‌’ సినిమా షూటింగ్‌ కొనసాగుతోంది. చరణ్‌, దీపిక జంటగా నటిస్తున్న సినిమా ‘మిరాజ్‌’ లాంగ్‌ షెడ్యూల్‌లో ఉంది. హీరో సుమంత్‌ నటించిన ‘అహం రీబూట్‌’ సినిమా ఆదివారంనాడు నేరుగా ఓటీటీలో విడుదలైంది.

కరోనా నుంచి కొనసాగుతున్న పరిస్థితులు
కరోనా తర్వాత నుంచి చిత్ర పరిశ్రమలో సాంకేతిక మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. లాక్‌డౌన్‌ వల్ల ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదని ఓటీటీ వేదికలు పుట్టుకొచ్చాయి. దీంతో ప్రేక్షకులు ఓటీటీలకు డబ్బులు కట్టి ఫోన్లలోనే సినిమాలను చూడటం అలవాటు పడ్డారు. దాంతో ఇప్పుడు థియేటర్లకు వచ్చి సినిమా చూసేందుకు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. గతంలో లాగా భారీ సంఖ్యలో అభిమానులు వచ్చి హంగామా చేసే పరిస్థితి లేదు. ఓటీటీ సినిమాలను తమకు వీలైన సమయంలో ఇంట్లో కూర్చొని చూస్తున్నారు. దీంతో పెద్ద సినిమాలు కూడా థియేటర్లలో విడుదలైన వారానికే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోనే విడుదలవుతున్న విషయం తెలిసిందే.

➡️