Om Bheem Bush Movie Review : ఓం భీం బుష్‌ మూవీ రివ్యూ

Mar 22,2024 19:00 #Movie Review, #Om Bheem Bush

ప్రముఖ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌’. ఈ చిత్రంలో ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా జాతిరత్నాలు మూవీలోలా ముగ్గురు చేసే కామెడీనే సినిమాకు హైలెట్‌. మరి ఈ చిత్రం ప్రేక్షకులకు ఏమేరకు నచ్చిందో తెలుసుకుందామా..!

కథ
కృష్ణకాంత్‌ అలియాస్‌ క్రిష్‌ (శ్రీవిష్ణు), వినరు గుమ్మడి (ప్రియదర్శి), మాధవ్‌ రేలంగి అలియాస్‌ మ్యాడీ (రాహుల్‌ రామకృష్ణ)లు మంచి స్నేహితులు. వీళ్లంతా సైంటిస్టులు అవ్వాలనే కోరికతో పిహెచ్‌డి విద్యార్థులుగా లెగసీ యూనివర్సిటీలో చేరతారు. అయితే కాలేజీలో వీళ్ల చేష్టల్ని తట్టుకోలేక ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ రంజిత్‌ విలుకొండ (శ్రీకాంత్‌ అయ్యంగార్‌) కోరుకున్న సమయం కంటే వీళ్లకి ముందే డాక్టరేట్లు ఇచ్చి పంపిస్తాడు. సరిగ్గా ఈ సమయంలోనే వీరంతా భైరవపురం అనే గ్రామానికి చేరతారు. ఆ ఊరిలో ఎ టు జెడ్‌ సర్వీసెస్‌ పేరుతో ఓ దుకాణం తెరిచి ఊరి ప్రజల సమస్యల్ని తీర్చి.. వారి అభిమానాన్ని సంపాదించుకుంటారు. ఈ క్రమంలోనే వారు సైంటిస్టులు కారని.. కేవలం డబ్బుల కోసమే అలా చేశారని ఆ ఊరి జనం తెలుసుకుంటారు. దీంతో అక్కడుండే భూతవైద్యుడు వీళ్లకి సంపంగి మహాల్‌లో ఉన్న నిధిని తీసుకురావాలని సవాల్‌ విసురుతాడు. మరి అక్కడికివెళ్లిన వీళ్లకి నిధి దొరుకుతుందా? ఆ మహల్‌లో దెయ్య ఉందా? చివరికి ఏం జరిగింది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
ఈ సినిమా లాజిక్‌లెస్‌గా ఉంది. ముందే సినిమా టైటిల్‌లో నో లాజిక్‌ ఓన్లీ మాజిక్‌ అని ట్యాగ్‌లైన్‌ ఉంది. ఈ ఉపశీర్షికకు తగ్గట్టే ఈ సినిమా కూడా ఉంది. క్రిష్‌, వినరు, మ్యాడీల హడావిడి, కామెడీ తెరపై నవ్వులు పూయించాయి. ఇక సినిమా విషయానికొస్తే.. సంపంగి మహల్‌లలో తాంత్రిక పూజ సీన్‌తో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కథ కాలేజీవైపు టర్న్‌ అవుతుంది. క్రిష్‌, వినమ్‌, మ్యాడీలు చేసే పనులతో వీళ్ల క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయో ప్రేక్షకులకు అర్థమయ్యేలా డైరెక్టర్‌ తెరపై చూపించారు. కాలేజీ ప్రిన్సిపాల్‌ వీళ్లని భరించలేక ముందే డాక్టరేట్లు ఇచ్చి బయటకు పంపిస్తాడు. దీంతో వీరంతా మార్గ మాధ్యలో భైరవపురం చేరి.. దుకాణం పెట్టి… ప్రజలను నమ్మిస్తారు. తీరా వీళ్లు సైంటిస్టులుకారు అని నిజం తెలిసి సంపంగి మహల్‌లో నిధిని తేవాలని భూతవైద్యుని సవాల్‌తో విరామం వస్తుంది. ఇక సెకండాఫ్‌ మొత్తం సంపంగి మహల్‌లోనే కథ నడుస్తుంది. సంపంగి దెయ్యం.. వినరుని భయపెట్టే సీన్‌ నవ్వులు పూయిస్తుంది. అసలు సంపంగి ఎందుకు దెయ్యమైంది అన్న విషయాన్ని రివీల్‌ చేశాక దర్శకుడు తెరపై మరో ట్విస్ట్‌ను ఇచ్చాడు. అది కూడా ఆకట్టుకుంటుంది. చివరి క్లైమాక్స్‌ కూడా డిఫరెంట్‌గా చూపించారు. కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఓవరాల్‌గా సినిమా అందరికీ నచ్చుతుంది. కాకపోతే కొన్ని సంభాషణలు, సన్నివేశాలు ఫ్యామిలీ ప్రేక్షకుల్ని ఇబ్బంది పెడతాయి. ఈ సినిమా యూత్‌కి బాగా కనెక్ట్‌ అవుతుంది.

ఎవరెలా చేశారంటే..
హీరో శ్రీవిష్ణు తన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి నటన ఈ సినిమాకు హైలెట్‌. ప్రీతి ముకుందన్‌, ఆయేషాఖాన్‌, రచ్చరవితోపాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. రాజ్‌ తోట సినిమాటోగ్రఫీ బాగుంది. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

➡️