ఆ అవగాహన అబ్బాయిలకూ ఉండాలి …

Mar 22,2024 05:38 #Jeevana Stories

‘నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పాలంటే భగత్‌సింగ్‌ చేసినట్లు ఓ బాంబు విసరాలి’ అంటున్నాడు ఉత్తరాఖండ్‌కి చెందిన 40 ఏళ్ల జితేంద్ర భట్‌. అతని మాటల వెనుక, సమాజాన్ని చైతన్యం చేయాలనే కాంక్ష ఉంది.సమాజంలో పాతకుపోయిన మూఢ నమ్మకాన్ని పారదోలాలన్న తపన కనపడుతుంది. గతేడాది జులైలో జితేంద్ర కుమార్తె మొదటి పీరియడ్‌ని చూసింది. ఆ విషయాన్ని అతను వినూత్నంగా తెలియజేశాడు. ఆ చర్య ఇప్పుడు చర్చనీయాంశమైంది.

మ్యూజిక్‌ స్కూలు నిర్వహిస్తున్న జితేంద్ర తన కుమార్తె మొదటి పీరియడ్‌ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించాలనుకున్నాడు. బంధువులను, తన స్కూల్లో ఉన్న అమ్మాయిలతో పాటు అబ్బాయిలను కూడా వేడుకకు రావాలని ఆహ్వానించాడు. అందరికీ భిన్నంగా నిర్వహించిన ఆ కార్యక్రమానికి ఒక్క బంధువు కూడా రాలేదు. మ్యూజిక్‌ స్కూలు విద్యార్థులు మాత్రం వచ్చారు. ఆ రోజు ఎంతో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా మ్యూజిక్‌ స్కూల్‌ని అలకరించారు. తన కుమార్తెతో కేకు కట్‌ చేయించాడు. ఆ తరువాత తనతో అమ్మాయిలకు శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేయించాడు. ఈ కార్యక్రమం జరిగేటప్పుడు అబ్బాయిలంతా చప్పట్లు కొట్టారు. అమ్మాయిలు ఏమాత్రం సిగ్గుపడకుండా ఆ బహుమతులను తీసుకున్నారు. ‘ఈ మార్పు ఇక్కడ ఒక్కచోటే కాదు.. అన్ని చోట్లా రావాలి. అప్పుడే రుతుక్రమం చుట్టూ ఉన్న అపోహలు తొలగిపోతాయి’ అంటున్నాడు జితేంద్ర.

దేశంలో చాలా చోట్ల అసోం, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో మొదటి రుతుస్రావ కార్యక్రమాన్ని ఓ వేడుకలా నిర్వహిస్తుంటారు. అయితే అవి జితేంద్ర నిర్వహించినట్లు విభిన్నంగా మాత్రం ఉండవు. మరి ఎలా ఉంటాయి? స్ఫూర్తి (33) బెంగుళూరులో నివసిస్తోంది. 15 ఏళ్లప్పుడు తనకెదురైన మొదటి పీరియడ్‌ అనుభవాన్ని ఇలా చెబుతోంది. ‘నాకు మొదటి పీరియడ్‌ వచ్చినప్పుడు చాలా షాక్‌ అయ్యాను. స్త్రీగా నేను పరిణతి చెందడానికి ఇది మొదటి దశ అని మా అమ్మ చెప్పింది. చాలా ఘనంగా వేడుక నిర్వహించారు. నేను యుక్తవయసు వచ్చేవరకు కూడా ఇదంతా ఎందుకు చేశారో నాకు అర్థం కాలేదు. మా నానమ్మ మాత్రం ఆ రోజుల్లో నాకు బలమైన ఆహారం పెట్టింది. మసాలా పదార్థాలు తీసుకోకూడదని చెప్పడం గుర్తు. కానీ.. అప్పుడు కొన్ని రోజులపాటు నేను ఒంటరిగా ఓ గదిలో గడిపాను. నాతో ఎవరూ మాట్లాడేవారు కాదు. ఆ క్షణాలు తలచుకుంటే ఇప్పటికీ భయమేస్తుంది’ అంటున్న స్ఫూర్తి లాంటి వాళ్లు మనలో ఎంతోమంది.

మయూరి (27) అసోం నివాసి. 12 ఏళ్లప్పుడు తనకి ఎదురైన మొదటి పీరియడ్‌ అనుభవాన్ని ఇలా పంచుకుంది. ‘నాలుగు రోజుల పాటు నేను స్నానం చేయలేదు. ఆ తరువాత నా ముఖానికి పసుపురాసి స్నానం చేయించారు. స్త్రీతత్వానికి ఇది ఆరంభమని నా చుట్టూ ఉన్న మహిళలు చెప్పారు. ఆ సమయంలో మా బంధువుల్లో పురుషులు కూడా ఆ వేడుకలో భాగమయ్యారు. కానీ ఆ తరువాత ఎప్పుడూ నా రుతుక్రమం గురించి వారు పట్టించుకున్న దాఖలా లేదు. వారిలో నా తండ్రి, సోదరుడు కూడా ఉన్నారు’ అంటున్న మయూరి లాంటి పరిస్థితి అందరి అమ్మాయిలదీ.

వేడుకలో భాగమౌతున్న పురుషులు ఆ తరువాత ఎందుకు రుతుక్రమ అంశాన్ని పట్టించుకోరు? ఆ సమయంలో ఎదురయ్యే మానసిక, శారీరక రుగ్మతలపై ఎందుకు దృష్టి పెట్టరు? ఈ ప్రశ్నలను ఎప్పటి నుండో చర్చించుకుంటున్నాం.

అందుకే..’పురుషులు కూడా రుతుక్రమంలో ఉండాలి..

‘ మీరు చదువుతున్నది నిజమే. అయితే రుతుక్రమం అంశాలపై అవగాహన కలిగివుండడమే దీనర్థం. అంటే స్ఫూర్తి తన ఇంట్లో ఎదురైన ఓ అనుభవాన్ని ఇలా చెబుతోంది. ‘నా ఆరేళ్ల కొడుకు నేను పీరియడ్‌లో ఉన్నానన్న విషయాన్ని గ్రహిస్తాడు. తనకి ఊహ వచ్చినదగ్గరి నుండి ఆ రోజుల్లో నేను చేసే ప్రతి పనినీ తను గమనిస్తూ వచ్చాడు’ అని స్ఫూర్తి చెబుతున్న ఈ సంఘటనలో ఆ పిల్లవాడు రుతుక్రమాన్ని సానుకూల దృక్పథంతో ఆలోచిస్తున్నాడా! ప్రతికూల ప్రభావాలకు లోనై ఆలోచిస్తున్నాడా! అనేది కాసేపు పక్కన బెడదాం.

2015లో ఈ అంశంపై ఓ వార్తా కథనం వచ్చింది. ‘పురుషులను రుతుక్రమంలో ఉంచడం’ అంటే రుతు పరిశుభ్రత నిర్వహణలో పురుషులు, అబ్బాయిల పాత్రపై ఓ సర్వే నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌లోని 66 గ్రామాల్లో రుతుక్రమం గురించిన చర్చల్లో పురుషులు పాల్గనడం వల్ల ఎలాంటి సానుకూల దృక్పథం వచ్చిందో అందులో చర్చించారు. ఆ చర్చల ఫలితంగా సకాలంలో శానిటరీ ప్యాడ్లను అందించడంలో పురుషులు చురుకుగా పాల్గన్నారు. ఇదొక్కటే కాదు, ఆ సమయంలో మహిళల చుట్టూ సానుకూల వాతావరణం వుండేలా ఆ ఇంటి పురుషులు కృషి చేశారు. అంటే ఈ అంశం ‘ప్రత్యేకమైన స్థితి నుండి సాధారణ స్థితికి వచ్చినప్పుడు ప్రతి మహిళా రుతుస్రావంలో తాను ఒంటరి అని భావించద’ని సర్వేలో తేలింది.

‘ఈ అంశంలో అబ్బాయిలు, పురుషులను చేర్చడం కుటుంబాల నుండే ప్రారంభమవ్వాలి. అన్న, తమ్ముడు, నాన్న, బాబాయి, మామయ్య, సహోద్యోగి ఇలా ప్రతి పురుషుడూ భాగమవ్వాలి. అప్పుడే దీనిచుట్టూ ఏర్పడిన ఎన్నో కఠిన నిబంధనలు ఉల్లంఘించబడతాయి’ అంటున్నారు అజీమ్‌ ప్రేమ్‌ జీ విశ్వవిద్యాలయానికి చెందిన ముక్తా గుండి.రుతుక్రమంలో పురుషులు ఉండడం అంటే ఇప్పటికే అర్థమై ఉండాలి. ఇంకా సులభంగా చెప్పాలంటే ఒక ఉపాధ్యాయుడు రుతుక్రమం గురించి వివరించాల్సి వచ్చినప్పుడు తన తరగతి గది నుండి అబ్బాయిలను బయటికి వెళ్లమని ఆదేశించడు. ఆ సమయంలో అమ్మాయిలను టీజింగ్‌ చేయొద్దని సూచిస్తాడు. అవసరమైన సాయం చేయమని ప్రోత్సహిస్తాడు. అలాగే ఒక పురుష సర్పంచి తన గ్రామంలో రుతుక్రమ ఉత్పత్తుల పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాడు. వివక్షకు తావివ్వకుండా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తాడు. ఇక జీవితభాగస్వామి కూడా ఆ సమయంలో ఆమెకి అవసరమైన విశ్రాంతి ఇస్తాడు. శారీరకంగా, మానసికంగా ఆమె ఆరోగ్యంగా ఉండేలా ఆరోగ్యకర బంధం కొనసాగిస్తాడు.

జితేంద్ర భట్‌ ఇదే చేశాడు. తన కుటుంబంలో కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న క్రతువును కొత్త పంథాలో నిర్వహించాడు. రుతుక్రమం ఓ చాటుమాటు వ్యవహారం కాదని నిరూపించాడు. ఏ ఆడపిల్ల తాను రుతుక్రమంలో ఉన్నానని నాన్నకి, అన్నకి, తమ్ముడికి తెలియకుండా అమ్మకి మాత్రమే వినిపించేలా గుసగుసగా చెప్పనవసరం లేదని తేల్చి చెప్పాడు. శానిటరీ ప్యాడ్‌ అనగానే రుతుస్రావం మాత్రమే గుర్తుకు రాకూడదని, రుతుక్రమ పరిశుభ్రత అని తెలిసేలా చేశాడు.

➡️