చిట్టి – పొట్టి

Jan 31,2024 10:14 #jeevana, #Kavitha

చిట్టి, పొట్టి పాపలిద్దరు

ఒక్క రోజునే పుట్టారు

చెట్ట పట్టా లేసుకుంటూ

జట్టుగ తిరుగుతుంటారు

పుట్టిన రోజుని ఎంతో గొప్పగ

కలిసే చేసుకుంటారు

తరగతిలో పిల్లలందరికి

బహుమతులను అందిస్తారు.

అందరితో కలిసి మెలిసి

ఆప్యాయతలను పంచేరు

ఆటలు ఆడి పాటలు పాడి

వేడుకలెన్నో చేస్తారు.

ఆ ఏడాది పుట్టిన రోజును

కొత్తగ చేయాలనుకున్నారు.

చిట్టి తండ్రి మొక్కలు తెస్తే,

పొట్టి నాన్న గోతులు తీసే …

పాఠశాలలో ఓ పక్కన

వనమహోత్సవం పెట్టారు.

నేస్తాలకి మొక్కలు పంచి

గోతులలో నాటించారు.

ప్రతి మొక్కకు పేరును పెట్టి

చక్కగ పెంచాలన్నారు

ఎవ్వరి మొక్క ముందుగా పూస్తే

వారికి బహుమతి అన్నారు

పిల్లలందరూ ఎంతో శ్రద్ధగ

తమ తమ మొక్కలు పెంచారు.

అందరి మొక్కలు ఒక్క రోజునే

రంగుల పువ్వులు పూసాయి!

మిత్రులందరు సంతోషంగా

మొక్కల మధ్యన తిరిగారు.

చిట్టి పొట్టి బహుమతులీయగా

శుభాకాంక్షలు తెలిపారు !

ఉపాధ్యాయులు వరుసగ వచ్చి

పిల్లలను మెచ్చుకున్నారు

పుట్టిన రోజును కొత్తగా చేసిన

చిట్టిని పొట్టిని దీవించారు!

– కూచిమంచి నాగేంద్ర

91821 27880

➡️