నిజం వైపు నిలబడాలి

Mar 27,2024 05:15 #jeevana

రాము 6వ తరగతి చదువుతున్నాడు. సొంత నిర్ణయాలు తీసుకోలేడు. ఎవరు ఏది చెబితే అదే నిజం అనుకుంటాడు. ఒకసారి అతడి మిత్రులందరూ ఆటల పీరియడ్‌లో కబడ్డీ ఆడుతున్నారు. రాముని ఎంపైర్‌గా ఉండమన్నారు. శివ జట్టు ఒకవైపు, కుమార్‌ జట్టు ఒకవైపు ఆడుతున్నారు. రెండు జట్లూ సమానమైన స్కోర్‌ చేశాయి. ఎలాగైనా గెలవాలని శివ జట్టు పట్టుదలగా ఉంది. రాముని ఉపయోగించుకుంటే గెలుపు సులభమని శివ, వాళ్ల జట్టుకి చెప్పాడు కూడా.
కూతకి వెళ్లిన శివ, కుమార్‌ జట్టులో ఉన్న ప్రసాద్‌ని తాకకుండానే తాకానని అబద్ధం చెప్పాడు. తాకలేదని రాము కూడా గుర్తించాడు. కానీ శివ జట్టు వారంతా ప్రసాద్‌ ”ఔట్‌.. ఔట్‌” అంటూ గట్టిగా కేకలు వేశారు. కుమార్‌ వాదించినా ఎవరూ వినలేదు. రాము తాను గ్రహించిన నిజాన్ని కూడా పక్కనబెట్టి, గట్టిగా అరుస్తున్న శివ జట్టు పోటీలో గెలిచిందని చెప్పాడు. ఇప్పుడే కాదు, రెండు మూడు సందర్భాల్లో కూడా రాము ఇలాగే చేశాడు. ఈ విషయం కుమార్‌కి బాగా తెలుసు.
ఒకరోజు రాము తరగతి గదిలోకి వస్తుండగా కుమార్‌ తన పక్కన బెంచిపై కూర్చున్న వారితో ‘ఒరేరు! గో.పి వచ్చాడు రా! గో.పి వచ్చాడు రా!’ అని ఎగతాళి చేశాడు. అక్కడ ఉన్న వారందరూ నవ్వారు. రాముకి చాలా కోపం వచ్చింది. ఉపాధ్యాయుడికి ఫిర్యాదు చేశాడు. అప్పుడు కుమార్‌, మాస్టారు దగ్గరికి వెళ్లి, ‘సార్‌! సొంతంగా నిర్ణయం తీసుకోలేక ఎటువైపు ఒత్తిడి ఉంటే అటువైపే వెళ్ళిపోతున్న వాళ్లని గోడ మీద పిల్లి అని పిలుస్తారని చెప్పారు కదా! అందుకే మేమంతా ఇకనుండి రాముని ఆ పేరుతోనే పిలుస్తాం’ అని జరిగిందంతా చెప్పాడు.
ఉపాధ్యాయుడికి విషయం అర్థమైంది. తల దించుకున్న రాముని దగ్గరకు పిలిచారు. ‘చూడు రాము, ఎప్పుడూ నిజం వైపు ఉండాలి. అరిస్తే అబద్ధం నిజమై పోదు కదా! ఎక్కువమంది అబద్దాన్ని నిజంగా నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నిజం ఏమిటో మనకు తెలిస్తే నిజం వైపే ఉండాలి. గోడమీద పిల్లిలా ఊగిసలాడకూడదు, ఈ వయసులోనే మీరు మంచి నడవడిక ఏర్పాటు చేసుకుంటే జీవితంలో విజయం సాధిస్తారు’ అని మాస్టారు తరగతిని ఉద్దేశించి మాట్లాడారు. వెంటనే రాము, కుమార్‌ దగ్గరకి వెళ్లి ‘నన్ను క్షమించు కుమార్‌.. ఇంకెప్పుడూ అలా ప్రవర్తించను. నిజం వైపు నిలబడతాను’ అని చెప్పగానే తరగతి గది అంతా చప్పట్లతో మార్మోగిపోయింది.
ా మొర్రి గోపి,

➡️