ఏడు గుర్రాల రథం

Apr 27,2024 05:02 #jeevanaa

ప్రశాంతపురం రాజ్యాన్ని పరిపాలించే రఘుపతి తన రాజ్యంలోని ఏడు ప్రధాన నగరాల్లో పాలనాధికారి ఎన్నికలకు తేదీ నిర్ణయించారు. ఒక వర్గం వారు వేపచెట్టు గుర్తు మీద, మరో వర్గం వారు మర్రి చెట్టు గుర్తు మీద నిలబడి తమను గెలిపించామని ప్రచారం చేయసాగారు.
వేపచెట్టు గుర్తుపై నిలబడిన ఏడుగురు అభ్యర్థులూ ఒకరోజు రఘుపతిని కలుసుకొన్నారు. ‘మహారాజా, ప్రజలు మమ్మల్ని ఎన్నుకునే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. ఒకసారి మీరూ వచ్చి, మా తరపున ప్రచారం చేయగలరు’ అని కోరారు.
వారి ఆహ్వానాన్ని మన్నించి రఘుపతి ఏడు నగరాల ప్రజలను కలవడానికి అంగీకరించాడు. ఏడుగుర్రాల రథం మీద రాజధాని నగరం నుంచి బయలు దేరాడు. ఏడు నగరాలనూ సందర్శించి వేపచెట్టు గుర్తుకు ఓటు వేయమని ప్రజలను కోరాడు.
ఎన్నికలు ముగిశాయి. వేపచెట్టు గుర్తు మీద నిలిచిన అభ్యర్థులు ఎవరూ గెలవలేదు. ఎందుకిలా జరిగిందో అర్థం కాక మంత్రిని పిలిపించి అడిగాడు రాజు. మంత్రి వేగుల ద్వారా విచారించి అసలు సంగతి తెలుసుకొన్నాడు. ‘మహారాజా, మీరు ఎన్నికల ప్రచారం కోసం ఏడు గుర్రాల రథం మీద వెళ్లడం పొరపాటైంది’ అన్నాడు మంత్రి.
‘అదెలాగా’ ఆశ్చర్యంగా అడిగారు రఘుపతి.
‘మహారాజా, మీరాక కోసం ప్రజలు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశారు. అయితే మీరు రథం మీద వస్తున్నప్పుడు, ప్రయాణానికి అడ్డంగా ఉన్నాయని రహదారికి ఇరువైపులా వున్న చెట్లను నరికించారు. ఎన్నో సంవత్సరాలుగా నీడనిస్తున్న ఆ చెట్లు నరికించడం ప్రజలకు నచ్చలేదు. అందుకే తమ వ్యతిరేకతను తెలియచెప్పడానికి మర్రి చెట్టు గుర్తు వారిని ఎన్నుకొన్నారు’ అని చెప్పాడు మంత్రి.
‘రాజ్యాన్ని పరిపాలించే రాజుగా చెట్లకు వున్న విలువలు నేను గుర్తించలేదు. కానీ, ప్రజలు గుర్తించారు, నా పొరపాటును తెలిసేలా చేశారు. ఆ ప్రాంతంలో మళ్లీ చెట్లు నాటుతాను. ప్రజల సుఖసంతోషాలే రాజులకు కావాలి. రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే పాలకులు సరైన రీతిలో పాలించాలి’ అని రఘుపతి మనసులో గట్టిగా అనుకున్నాడు. మొక్కలు నాటించే పనిని పురమాయించాడు.
– ఓట్ర ప్రకాష్‌ రావు,
097874 46026.

➡️