ఈతకొలనులో ఈ జాగ్రత్తలు పాటించండి!

Apr 27,2024 04:45 #jeevana

ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది స్విమ్మింగ్‌ చేస్తుంటారు. గ్రామాల్లో అయితే చెరువులు, కాలువలు ఉంటాయి. పట్టణాల్లో వాటి సౌలభ్యం లేదు కాబట్టి, చాలామంది స్విమ్మింగ్‌ పూల్స్‌కి క్యూ కడతారు. అయితే స్విమ్మింగ్‌ పూల్‌లో నీళ్లు పాడవ్వకుండా ఉండటానికి, పలు రకాల రసాయనాలు కలుపుతారు. ఇలాంటి నీటిలో ఎక్కువసేపు గడపడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే.. ముందు జాగ్రత్తలు పాటించాలి.
మాయిశ్చరైజర్‌ అప్లై చేయాలి
స్విమ్మింగ్‌ చేయడం వల్ల శరీరం తేమను కోల్పోతుంది. కాబట్టి స్విమ్మింగ్‌ చేసే ముందు శరీరానికి మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. లేదా, క్లోరిన్‌ న్యూట్రలైజింగ్‌ లోషన్‌ను రాసుకోవాలి. వీటి వల్ల చర్మం తేమగా ఉంటుంది. ఇవి అందుబాటులో లేని వారు, కొబ్బరి నూనె లేదా ఆలివ్‌ ఆయిల్‌ అయినా రాసుకోవాలి. సన్‌ స్క్రీన్‌ రాసుకుంటే, 20 నిమిషాల తర్వాతే స్విమ్మింగ్‌ చేయాలి. నీటిలో ఎక్కువగా ఉంటే ఓ గంట తర్వాత మళ్లీ రాసుకోవాలి.
స్విమ్మింగ్‌ చేసిన తర్వాత తడి బట్టలతో ఎక్కువ సేపు ఉండకూడదు. దీని వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి. చర్మంపై ఇన్‌ఫెక్షన్లు కూడా రావొచ్చు.
స్విమ్మింగ్‌ చేసేవారి పెదవులు సన్‌ బర్న్‌, డీ హైడ్రేషన్‌కు గురవుతాయి. కాబట్టి స్విమ్మింగ్‌కు వెళ్లే ముందు లిప్‌ బామ్‌ను ఉపయోగించాలి. నీటిలో ఎక్కువగా ఉంటే, ఓ గంట తర్వాత మళ్లీ రాసుకోవాలి.
నదుల్లో, చెరువుల్లో జాగ్రత్త!
చెరువులు, నదులు, బావుల్లో ఈతకు వెళ్లే వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. వాటి లోతుపాతులు తెలియకుండా దిగకూడదు. పట్టణాల నుంచి ఊళ్లు వెళ్లే పిల్లలు తమ స్నేహితులతో కలిసి తెలియని చోట ఈతకు దిగరాదు. స్విమ్మింగు పూల్‌లో ఈతకు వీలుగా ఏర్పాట్లు ఉంటాయి. నదులూ, చెరువుల్లో అలా కాదు. ఒక్కోచోట ఒక్కో లోతు ఉండొచ్చు. కిందకు వెళితే కూరుకుపోయేలా చేసే బురద, తుప్పలూ ఉండొచ్చు. కాబట్టి, స్థానికులూ, పెద్దల పర్యవేక్షణ లేకుండా ఈతకు లేదా స్నానానికి ఉప్నకమించరాదు. ఈత తెలియని పిల్లలు కూడా ఉత్సాహం కొద్దీ నదుల్లోకి దిగుతుంటారు. సురక్షితం కాని చోట అలా చేయకూడదు.
తమ పిల్లలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో తల్లితండ్రులు తెలుసుకుంటూ ఉండాలి. నదుల్లో, చెరువుల్లోదిగొద్దని హెచ్చరించాలి. పిల్లలు ముచ్చటపడితే తామే నేరుగా తీసుకెళ్లి సురక్షిత ప్రాంతాల్లో ఈత నేర్పించాలి. అప్రమత్తత లోపిస్తే సరదాలు విషాదాంతాలయ్యే ప్రమాదం ఉందని పత్రికల్లో వచ్చే అలాంటి వార్తలు చూపించి, హెచ్చరించాలి.

➡️