సెలవులకు ఊరు వెళుతున్నారా?

Apr 27,2024 10:08 #Jeevana Stories

వేసవి సెలవుల్లో చాలామంది పిల్లలతో సహా ఊర్లకు వెళుతుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వచ్చిన కుటుంబాలు ‘ఎండాకాలం సెలవుల్లో ఊరు వెళదాం’ అని చాలాసార్లు అనుకునే ఉంటారు. మరి ఈ వేసవికాలం అలాంటి ప్లానులు ఏమైనా వేశారా! అయితే ఈ ప్రయాణాల్లో ముఖ్యంగా పిల్లలతో వెళుతుంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
సాధ్యమైనంత వరకు ఎండ తీవ్రత ఎక్కువగా లేని సమయంలో అంటే ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణించడానికే మొగ్గు చూపాలి. అనివార్య పరిస్థితుల్లో ఎండలోనే వెళ్లాల్సి వస్తే మాత్రం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. నిప్పులు చెరుగుతున్నంత వేడిగా ఉంటోంది. ఈ వేడికి చెమట రూపంలో మన శరీరం త్వరగా నీటిని కోల్పోతుంది. దీనివల్ల హైడ్రేట్‌కి గురవుతాం. నోరు ఎండిపోతుంది. జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఈ పరిస్థితుల్లో తప్పనిసరిగా మీ వెంట ద్రవపదార్థాలు తీసుకెళ్లాలి. హైడ్రేట్‌ అయ్యే పరిస్థితులు తెచ్చుకోకుండా ఎప్పటికప్పుడు నీరు తాగుతూ ఉండాలి. మీతో పాటు వాటర్‌ బాటిల్‌ కానీ, వాటర్‌ టిన్‌ కానీ వెంట తీసుకెళ్లాలి. కొబ్బరినీళ్లు, ముంజెలు, పుచ్చకాయ వంటి వేసవిలో లభించేవి తరచూ తీసుకుంటూ ఉండాలి.
పిల్లలతో ప్రయాణించేటప్పుడు వారికి ఎండ దెబ్బ కొట్టకుండా జాగ్రత్త పడాలి. కళ్లను రక్షించుకునేందుకు కళ్లజోడులు తప్పనిసరిగా వాడాలి. తల మీద నేరుగా ఎండ పడకుండా స్కార్ప్‌ని కప్పుకోవాలి.
ఈ కాలంలో జీర్ణ సమస్యలు చాలా సాధారణం. ప్రయాణాలప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. ఆహారపు అలవాట్లలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. ఆకలి లేదని చాలామంది కొంచెం కొంచెం తింటుంటారు. ఈ అలవాటు మానుకోవాలి. అపరిశుభ్ర వాతావరణంలో వండిన ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదు. లేనిచో గ్యాస్ట్రిక్‌ సమస్యలు వస్తాయి.
ఈ రోజుల్లో ప్రయాణమంటే బట్టల బ్యాగుతో పాటు మందుల బాక్సు కూడా వెంట తీసుకెళ్తున్నారు. మీ ప్రయాణంలో కూడా వడదెబ్బ తగిలినప్పుడు తక్షణ సహాయం చేసే ఔషధాలను దగ్గర పెట్టుకోవాలి. వృద్ధులతో ప్రయాణించేటప్పుడు కూడా పిల్లలకు తీసుకునే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ నీటిని తాగడం, పండ్ల రసాలు, పండ్లు తీసుకోవడం, ద్రవపదార్థాలు సేవించడం వంటి సాధారణ క్రియలన్నింటినీ పాటించాలి.

➡️