మీకు వీలైతే ఆపండి ..!

Mar 21,2024 05:01 #Jeevana Stories

ఇంటినుండి తప్పిపోయిన లేక పారిపోయిన పిల్లల్లో ఇల్లు చేరేది చాలా తక్కువ మంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ తరహా సంఘటనలు కోకొల్లలు. అధికార యంత్రాంగం రాత్రింబవళ్లు పనిచేసినా ఫలితాలు అంతంతమాత్రమే! టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా పిల్లల ఆచూకీ కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్నారు. కానీ ఓ సాదాసీదా వ్యక్తి మాత్రం చాలా స్వల్ప కాలంలోనే పిల్లల ఆచూకీ తెలుసుకుంటున్నాడు. సొంత ఇళ్లకి చేర్చుతున్నాడు. మూడు దశాబ్దాలుగా ఇదే పనిపై అవిశ్రాంతంగా కృషి చేస్తున్న అతని పేరు రాజు నేపాలీ. అతనికి ఏ హోదా లేదు. అంతకుమించి డిగ్రీలు, పీజీలు చదవలేదు. కానీ తప్పిపోయిన పిల్లల ఆచూకీ తెలిసేంత వరకు నిద్రపోడు. పశ్చిమ బెంగాల్‌ దోర్స్‌ ప్రాంతంలో ఉంటాడు. ఆ ప్రాంతానికి అతనో హీరో. ‘దోర్స్‌ ఎక్స్‌ప్రెస్‌ మెయిల్‌’ పేరుతో అతను నడిపే స్వచ్ఛంద సంస్థ ఇప్పటి వరకు వెయ్యికి పైగా కుటుంబాల్లో సంతోషాలు నింపింది.

ఓ సాదాసీదా వ్యక్తి ఇంత పెద్ద బృహత్తర కార్యక్రమాన్ని నడిపించడానికి ఎంచుకున్న ఏకైక మార్గం సోషల్‌ మీడియా. వాట్సాప్‌ గ్రూపు సహాయంతో దేశ నలుమూలలకు తప్పిపోయిన పిల్లల వివరాలు షేర్‌ చేస్తుంది రాజు బృందం. సెకండ్ల వ్యవధిలో 230 మందికి ఆ వివరాలు పంపుతారు. వారిలో జర్నలిస్టులు, పోలీసులు, సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు … ఇలా ప్రజలతో ఎప్పుడూ అనుసంధానంగా ఉండే వ్యక్తులు ఉన్నారు. కొన్ని వారాలపాటు ఆ గ్రూపులో ఈ వివరాలు షేర్‌ చేస్తుంటారు. ఈ నెట్‌వర్క్‌ ఎంత బలంగా ఉంటుందో చెప్పాలంటే, ఓ సంఘటన గురించి చెప్పుకోవాలి.

వారి సేవకు ఓ ఉదాహరణ..

గతేడాది అక్టోబరులో సిక్కింకి చెందిన బిజోయ్ (పేరు మార్చబడింది) తన స్నేహితులతో కలసి వారాంతపు సెలవుల్లో పశ్చిమ బెంగాల్‌ సిలిగురికి విహారయాత్రకు వెళ్లాడు. యాత్ర ముగించుకుని మిత్రుల బృందం తిరిగి సిక్కిం చేరుకుంది. కానీ, 16 ఏళ్ల బిజోరు ఇల్లు చేరలేదు. కొడుకు ఇంటికి రాలేదని తెలియగానే అతని తండ్రి మొట్టమొదటగా రాజుకి ఫోన్‌ చేశాడు. ఆ ప్రాంతంలో ఏ పిల్లవాడు, ఏ పిల్ల కనిపించకుండా పోయినా మొదటి కాల్‌ రాజుకే వెళుతుంది.ఫోను కాల్‌ అందుకున్న రాజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిక్కిం పోలీసులకు సమాచారం అందించాడు. బిజోయ్ వివరాలను తన వాట్సాప్‌ గ్రూపులో షేర్‌ చేశాడు. వారం పాటు అతని బృందం బిజోరుని వెతికిపట్టుకునే పనిలో నిమగమైంది. ఎట్టకేలకు ఓ డ్రగ్‌ ముఠా గుప్పెట్లో బిజోరు చిక్కుకున్న సంగతిని వారు గుర్తించారు. బిహార్‌లోని భగల్‌పూర్‌ ముఠా బిజోయ్ ని పంపించాలంటే రూ. లక్ష డిమాండ్‌ చేశారు. ఆ ఫోన్‌ కాల్‌ని ట్రేసింగ్‌ చేసిన రాజు బృందం, పోలీసుల సాయంతో అక్కడికి వెళ్లి బిజోయ్ ని రక్షించింది.

టెక్నాలజీని ఉపయోగించుకుని ఎంత కష్టమైన పనినైనా సులభంగా సాధించవచ్చు అంటాడు రాజు. అయితే ఇంత పెద్ద నెట్‌వర్క్‌ని 30 ఏళ్ల కిందటే రాజు ప్రారంభించారు. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? ఎవరు ప్రోద్బలం అతన్ని ముందుకు నడిపిస్తోంది? ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

ఆమె సంతోషంగా ఉంటుందనుకున్నాను..

‘నేను ఏడవ తరగతితోనే చదువు మానేశాను. ఆర్థిక ఇబ్బందులు నన్ను అంతకుమించి చదవనివ్వలేదు. ఓ స్వచ్ఛంద సంస్థలో వాలంటీర్‌గా చేరాను. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలు సందర్శించాను. 1992లో దేశం దాటి నేపాల్‌కి వెళ్లాను. అక్కడ నాకో అమ్మాయి పరిచయం అయ్యింది. నన్ను అన్నలాగా భావించేది. మేము చాలాకాలం కలిసి ఉన్నాం. ఎంతో అనుబంధం ఏర్పడింది. కొన్నేళ్లకు తన నుంచి నాకో ఉత్తరం అందింది. తన వివాహం నిశ్చయమైందని, తప్పకుండా రావాలని రాసింది. నేను పెళ్లికి వెళ్లాను. తను చాలా సంతోషంగా ఉంది. ఇంటికి తిరిగి వచ్చాక నేనెప్పుడూ ఆమె పెళ్లి గురించి ఆలోచించలేదు. ఆమె సుఖంగా ఉంటుందనే భావించాను.

కానీ, ఒక ఏడాది తరువాత నేను వాళ్లింటికి వెళ్లాను. తన గురించి ఆరా తీశాను. నేను ఊహించని సంఘటన అక్కడ ఎదురైంది. పెళ్లయిన తరువాత నుండి ఆమెకు తన తల్లిదండ్రులకు మధ్య సంబంధాలు తెగిపోయాయి. పెళ్లి కొడుకు ఎక్కడున్నాడో కూడా వాళ్లకి తెలియదు. అది విని నేను చాలా షాక్‌ అయ్యాను. ఆ క్షణం నాకు ఆ అమ్మాయి అమాయకమైన ముఖం, చిరునవ్వు గుర్తుకువచ్చి కన్నీళ్లు వచ్చాయి. ఎంతో ఆశగా వెళ్లిన నేను చాలా నిరాశగా వెనుదిరిగాను. తన గురించి పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పి వచ్చేశాను’ అంటూ గతాన్ని గుర్తుచేసుకున్నాడు రాజు.

ఓ అమ్మాయి నా భుజం తట్టింది..

ఆ సంఘటన జరిగిన 8 ఏళ్ల తరువాత రాజుకు ఓ చేదు సంఘటన ఎదురైంది. ‘నేను మిషనరీ పని మీద పూణె వెళ్లాను. ఓ దాబాలో రాత్రి భోజనం చేసేందుకు కూర్చున్నాను. ఆహారం ఆర్డర్‌ పెట్టి ఎదురుచూస్తున్నాను. ఈలోపు నా భుజంపై ఓ చేయి పడింది. వెనక్కి తిరిగి చూశాను. ఓ మహిళ నన్ను అదేపనిగా చూస్తోంది. నేను ఆమెను గుర్తుపట్టలేదు. తన నిశ్చితార్థానికి నేను వచ్చానని, చిన్నప్పుడు కలిసి ఆడుకున్నామని పదే పదే నాకు గుర్తు చేస్తోంది. ఆ పాత సంగతులన్నీ ఆమె చెబుతుంటే నాకు దు:ఖం పొంగుకొచ్చింది. జీవితంలో తనను మళ్లీ చూస్తాను అనుకోలేదు. నా ఏడుపు చూసి తను కూడా బిగ్గరగా ఏడ్చేసింది. తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పింది. పెళ్లి చేసుకోగానే ఆ వరుడు తనను రెడ్‌లైట్‌ ఏరియాకి అమ్మేశాడు. అప్పటి నుండి తను సెక్స్‌ వర్కర్‌గా మారిపోయింది. రోజూ నరకయాతన పడుతున్నానని బోరున ఏడ్చింది. తనను తీసుకుని వాళ్లింటికి వెళ్లాను. కూతురుని చూసి వాళ్లు ఆనందిస్తారని అనుకున్నాను. కానీ వాళ్లు తనను ఇంట్లోకి రావద్దన్నారు. రెడ్‌లైట్‌ ఏరియాలో నివసించిన తను తమకు అక్కర్లేదని ఖరాఖండిగా చెప్పేశారు. ఈ హఠాత్‌ పరిణామానికి నా స్నేహితురాలు, నేను నిశ్చేష్టులమైపోయాం. తనను ఏదైనా సురక్షిత ప్రదేశంలో ఉంచుదామని చాలా ప్రాంతాలు వెతికాను. ఈ లోపే తనకు హెచ్‌ఐవి పాజిటివ్‌ అని తేలింది. రోజుల వ్యవధిలోనే తను ప్రాణాలు విడిచింది.

అప్పుడే నిర్ణయించుకున్నాను..

ఈ మొత్తం సంఘటనలో నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి. మొట్టమొదటిసారి మానవ అక్రమ రవాణా గురించి విన్నాను. విచారణలో జాప్యం గురించి తెలిసింది. రెస్య్కూ చేసిన పిల్లలను తల్లిదండ్రులు అంగీకరించరని అర్థమైంది. కాబట్టి ఈ పనులన్నింటినీ నా భుజాలపై వేసుకున్నాను. తప్పిపోయిన పిల్లలను వెతికిపట్టుకోవడం, తల్లిదండ్రులకు అప్పగించడం, బాధితులకు, కుటుంబసభ్యులకు అవగాహన కల్పించడం విధిగా చేయాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను’ అంటున్న రాజ్‌ తన దృష్టికి వచ్చిన తప్పిపోయిన పిల్లల కేసులపై ప్రత్యేక శ్రద్ద పెడతాడు. పోలీసు కేసు ఫైల్‌ చేయించడం దగ్గర నుండి, వారిని వెతికి పట్టుకోవడం, అవగాహన కల్పించడం చేస్తున్నాడు. దేశంలోనే కాక, భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌లలో కూడా రాజు బృందం పనిచేస్తోంది.

‘సాధారణంగా తప్పిపోయిన పిల్లలు ఇంటికి తిరిగివెళ్తామన్న ఆశ కోల్పోతారు. కానీ మా బృందం వారిని ఇళ్లకు చేర్చినప్పుడు సంతోషంతో వాళ్ల ముఖాలు వెలిగిపోతుంటాయి. ఆ ఆనందం చూసిన తరువాత నేను పడ్డ శ్రమ అంతా దూదిపింజలా ఎగిరిపోతుంది. ఆ క్షణం చిరునవ్వు చిందిస్తున్న నా స్నేహితురాలే వాళ్ల ముఖాల్లో కనిపిస్తుంది’ అని చెబుతున్న రాజు నిర్వహిస్తున్న వాట్సాప్‌ గ్రూప్‌ పేరు ‘స్టాప్‌ ఇఫ్‌ యు కెన్‌'(మీకు వీలైతే ఆపండి).

➡️