వేసవిలో ఇమ్యూనిటీని పెంచుకోండి ఇలా …

Mar 25,2024 05:02 #Jeevana Stories

వేసవిలో శరీరానికి రోగ నిరోధకశక్తి (ఇమ్యూనిటీ) తగ్గితే త్వరగా వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా చర్మంపై అలర్జీలు, దగ్గు, ఫ్లూ లాంటివి వస్తుంటాయి. అందువల్ల మిగతా సీజన్ల కంటే వేసవిలో ఇమ్యూనిటీ ఎక్కువ ఉండటం అవసరం. రోగ నిరోధకశక్తిని పెంచుకోవటం కోసం

కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
వేసవికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే సిట్రస్‌ ఫ్రూట్స్‌ ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మ, నారింజ, బత్తాయి, ఉసిరి లాంటి పండ్ల సలాడ్స్‌, జ్యూస్‌ రూపంలో తీసుకోవచ్చు. వీటిలో ఉండే విటమిన్‌-సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. క్యారెట్‌, గుమ్మడికాయ, బీట్‌రూట్‌లు తినటం ద్వారా విటమిన్‌ాఓ, ఫైబర్‌, పొటాషియం లభిస్తుంది. ప్రొటీన్‌ ఫుడ్‌ తీసుకోవటం ద్వారా కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది. పప్పులు, గుడ్లు, చేపలు, నట్స్‌ లాంటివి కూడా ఆహారంలో చేర్చుకోవాలి. శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండటం అవసరం. అందుకే సమ్మర్‌లో దాహం వేయకపోయినా నీళ్లు, జ్యూస్‌లు, నిమ్మరసం లాంటివి తాగుతూ ఉండాలి. బాదం, పిస్తా, జీడిపప్పు వంటి నట్స్‌లో ఉండే ఫోలిక్‌ యాసిడ్‌, నియాసిన్‌, జింక్‌, సెలేనియమ్‌ వంటివి కూడా ఇమ్యూనిటీ పెంపునకు దోహదపడతాయి. ఈ కాలంలో పిల్లలు, గర్భిణులకు నట్స్‌ చాలా మంచివి. ఈ కాలంలో పుచ్చకాయ, కర్భూజా లాంటి సీజనల్‌ పండ్లు ఎక్కువగా తీసుకోవటం వల్ల మాంగనీస్‌, విటమిన్‌ ఎ, పొటాషియం లభిస్తాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచటంతోపాటు రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి. మసాలాలు, కారం, వేపుళ్లు ఎక్కువగా తింటే ఇమ్యూనిటీ దెబ్బతినే అవకాశం ఉంది. వాటితోపాటు సమ్మర్‌లో ఫ్రైడ్‌ ఫుడ్స్‌, బేక్డ్‌ ఫుడ్స్‌ కూడా వీలైనంతవరకూ తినకుండా ఉండటమే మేలు.

రక్షిత మంచినీటినే తాగాలి
వేసవిలో సైనస్‌ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఎండ తీవ్రత, వేడిగాలి కారణంగా గాలి ద్వారా సోకే బ్యాక్టీరియా మరింత వేగంగా వ్యాపిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ తినే ఆహారం, తాగే నీటి గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. దానితోపాటుగా పీల్చే గాలిపై కూడా శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. గాలిలో ఉండే దుమ్ము, ధూళి, కాలుష్యం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు వేసవిలో కూడా వ్యాపిస్తాయి. ఎండ తీవ్రత, వేడిగాలి కారణంగా గాలి ద్వారా సోకే బ్యాక్టీరియా మరింత వేగంగా వ్యాపిస్తుంది. శరీరంలో ప్రతి కణానికీ అవసరమైన ఆక్సిజన్‌ పీల్చుకునే గాలి నుంచే లభిస్తుంది. ఇది ముందుగా ఊపిరితిత్తుల్లోకి… అక్కడి నుంచి రక్తంలోకి చేరుకుని హిమోగ్లోబిన్‌తో జతకట్టి అన్ని కణాలకు చేరుతుంది. గాలి ద్వారా వేగంగా ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందుతాయి.

వాయు కాలుష్యం కూడా ఎక్కువే !
ఎండాకాలం ఆస్తమా సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. పైగా ఈ సీజన్‌లో పొడిగాలి ఎక్కువగా ఉంటుంది. వాయికాలుష్యం స్థాయి పెరిగే కారణంగా ఆస్తమా రోగులకు ఈ సీజన్‌ కాస్త ఇబ్బందికరంగా మారొచ్చు. అందువల్ల సాధ్యమైనంత వరకూ ఎండకు బయటకు వెళ్లకుండా ఉండటమే మంచిది. వాహనాల నుంచే వెలువడే రసాయనాలు, దుమ్ము, ధూళి వంటివి శ్వాస ద్వారా లోపలికి వెళ్లినప్పుడు పొడిదగ్గు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పొల్యూషన్‌, డస్ట్‌ కారణంగా పలు రకాల ఎలర్జీలు కూడా వేధించొచ్చు. గాలి ప్రభావం వల్ల కళ్ల మంటలు, దురద, కంటి నుంచి నీరు రావటం వంటి సమస్యలు కూడా తలెత్తొచ్చు. వేడి గాలిలోని దుమ్ము, ధూళి కారణంగా కళ్లు లేదా ముక్కలో అలర్జీలు రావొచ్చు. కొంతమందిలో సైనసైటిస్‌ సమస్యకు దారితీస్తుంది. అందువల్ల వేసవి సీజన్‌లో వేడి గాలి బాగా తగలకుండా జాగ్రత్తపడటం మంచిది. మన శరీరానికి అవసరమైన దుమ్ము, ధూళి ద్వారా ఆక్సిజన్‌ సరిగా అందకపోతే అలసట, నిస్సత్తువ, చిరాకు వంటివి వేధిస్తాయి. కొందరిలో ఇది ఒత్తిడికి సైతం దారితీయొచ్చు. శ్వాస సామర్థ్యాన్ని పెంపొందించుకునేలా కార్డియో కార్డియో వ్యాయామాలు, ప్రాణామాయం వంటివి చేయటం మంచిది.

ఈ జాగ్రత్తలు పాటించండి

  • డస్ట్‌ ఎలర్జీలు వంటివి రాకూడదంటే బయటకు వెళ్లేటప్పుడు ముక్కుకు గుడ్డ కట్టుకోవటం తప్పనిసరి. ఇంకా ఈ కింది జాగ్రత్తలు పాటించాలి.
  • కాలుష్యానికి దూరంగా ఉండాలి
  • పొగతాగే అలవాటును మానుకోవాలి
  • ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
  • రోజూ వాడే వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి
  • దిండు కవర్లు, దుప్పట్లను వారానికి ఒకసారి వేడినీటిలో ఉతికి, ఎండలో ఆరబెట్టుకోవాలి.

ఒంటికి చలువ కీరదోసకాయ రసం
వేసవిలో ఒంటికి చలువ చేసే ఆహార పదార్థాలు తీసుకోవటం మంచిది. పాలకూర, దోస, కీరదోసకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి దోహదపడుతుంది. శరీరంలో తక్కువ నీటి స్థాయిలు ఉంటే మన ఆరోగ్యంతోపాటు చర్మాన్ని కూడా దెబ్బతీస్తాయి. దోసకాయ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచటంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దోసకాయ జ్యూస్‌ ఇంట్లోనే తయారుచేసుకుని తాగొచ్చు. రుచి కోసం కొద్దిగా నిమ్మరసం కూడా కలిపి తాగొచ్చు. దోసకాయ రైతా కూడా రుచికరమైనదే. చాలా ఆరోగ్యకరమైంది. రైతా చేయటం కూడా చాలా ఈజీ. రైతాతిన్నా, తాగినా కడుపు చల్లగా ఉంటుంది. జీర్ణక్రియ వేగాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

➡️