ఈ గ్రాండ్‌ మాస్టర్ల వెనుక ఓ అమ్మ..

Dec 5,2023 09:14

గృహిణికి ఏం తెలుసు? ఇల్లు చక్కబెట్టుకోవడం, భర్తకి, పిల్లలకి వండిపెట్టడం, పిల్లలను స్కూళ్లకి పంపించడం, వేళకి తినిపించడం! ఇంతకు మించి ఏం పాటు చేస్తుంది? ఏం విరగపడుతుంది? అనుకునే వాళ్లకి తన ఇద్దరు బిడ్డలని దేశం గర్వపడే గ్రాండ్‌ మాస్టర్లుగా తీర్చిదిద్దిన అమ్మ గురించి చెప్పాలి. అక్కాతమ్ముళ్లు ఆర్‌.ప్రజ్ఞానంద (18), ఆర్‌.వైశాలీ (22) చదరంగ పోటీల్లో ప్రపంచం మెచ్చిన క్రీడాకారులుగా కీర్తిపతాకాలు అందుకుంటున్న వేళ.. వారి ప్రతి అడుగులో తోడుంటూ విజయ తీరాలకు నడిపించిన ఆ అమ్మ తమిళనాడుకి చెందిన ఆర్‌. నాగలక్ష్మి.

ధ్యతరగతి కుటుంబానికి చెందిన నాగలక్ష్మి సాధారణ గృహిణి. భర్త రమేష్‌ బ్యాంకు ఉద్యోగి. భర్త, బిడ్డలు ఇదే ఆమె ప్రపంచం. వైశాలికి ఐదేళ్లప్పుడు టీవీ బాగా చూస్తుందని చెస్‌ బోర్డు కొనిచ్చారు నాగలక్ష్మి దంపతులు. అలా చదరంగం క్రీడవైపు ఆమె మనసు మళ్లించాలని భార్యాభర్తలిద్దరూ అనుకున్నారు. తండ్రి నేర్పించిన మెళకువలకు తన ఆసక్తి తోడై వైశాలీ చాలా త్వరగానే చెస్‌ ఆట నేర్చుకుంది. ఆ తరువాత ఆ బాధ్యత నాగలక్ష్మి తీసుకుంది. అమ్మ ప్రోత్సాహంతో వైశాలి, ఆటపై పట్టు సాధించింది. ఆట నేర్పించడం, అందుకు అవసరమైన వసతులు సమకూర్చడం, స్కూలుకు తీసుకెళ్లడం, చదువులో ముందుండేలా సాయం చేయడం నాగలక్ష్మి దినచర్యగా మారిపోయింది. కొన్ని రోజులకు కూతురుతో పాటు కొడుకు కూడా అదే పనిగా ఆటను చూస్తుంటే ఎంతో మురిసిపోయింది. ఈసారి కొడుకుకి కూడా ఆట నేర్పించింది. చదువు, చదరంగం రెండింట్లో రాణిస్తున్న పిల్లలను చూసి తెగ సంబర పడిపోయేది ఆ అమ్మ.

‘చదరంగ క్రీడలో పిల్లలిద్దరూ ఆసక్తి చూపుతున్నా శిక్షణా తరగతులకు పంపించే స్థోమత మాకు లేదు. మొదట వైశాలి ఆసక్తి కనబరిచినప్పుడే మేము ఓ నిర్ణయం తీసుకున్నాం. ఆ తరువాత ప్రజ్ఞానంద కూడా అక్క బాటలో నడుస్తుంటే ఏం చేయాలో పాలుపోలేదు. పిల్లల ఇష్టాలను తీర్చలేని తల్లిదండ్రులుగా మిగిలిపోతామేమోనని భయపడ్డాం. కానీ పిల్లల నైపుణ్యాలు చూసి, దాతలు సాయం అందించారు. స్కూలు యాజమాన్యం ఉచిత చదువు అందించింది. అలా ఎంతోమంది మాట సాయం, ఆర్థిక సాయంతో బిడ్డలు ఎదిగారు’ అంటున్న తండ్రి రమేష్‌ బాబు పోలియో బాధితుడు. బ్యాంకులో చిరు ఉద్యోగి. అయినా బిడ్డల కోసం పరితపించాడు. అయితే ఈ గొప్పతనమంతా భార్య నాగలక్ష్మికే చెందాలంటాడు.

టోర్నమెంట్లకు వెళ్లినప్పుడల్లా పిల్లలతో పాటు నాగలక్ష్మి వెళ్లేది. ‘పిల్లలు బాగా చిన్నవాళ్లు.. వెళ్లిన చోట వాళ్లకి అక్కడి ఆహారం పడక ఆరోగ్యం దెబ్బతింటుందని, ప్రయాణంలో నాతోపాటు, ఓ గ్యాస్‌ స్టవ్‌, కొంచెం బియ్యం, పప్పు తీసుకెళ్లేదాన్ని. అన్నం, సాంబారు వండిపెట్టేదాన్ని. వాళ్లు ఎంత ఎదిగినా నా కంటికి చిన్నపిల్లల్లానే కనబడతారు. అందుకే శ్రమ అనుకోకుండా వాళ్లతో పాటే వెళ్లిపోతాను’ అంటూ ఆమె చెబుతున్నప్పుడు, బిడ్డల ఆరోగ్యంపై శ్రద్ద చూపే ఎందరో తల్లులు మనకు కనపడతారు.

ఆటలో అక్కాతమ్ముళ్లు

చదరంగ క్రీడలో మొట్టమొదటిసారి అక్కాతమ్ముళ్లిద్దరూ గ్రాండ్‌మాస్టర్లైన రికార్డు వైశాలీ, ప్రజ్ఞానందకే సొంతం. అయితే ఎవరికి వారికే ప్రత్యేక రికార్డులు కూడా ఉన్నాయి. బాల్యం నుండీ ప్రజ్ఞానంద రికార్డులు బద్దలుకొడుతున్నాడు. జాతీయ అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. తాజాగా డిసెంబరు 1న స్పైయిన్‌లో జరిగిన ఈవెంట్‌లో వైశాలీ పాల్గొని, 2500 ఎఫ్‌ఐడిఇ రేటింగ్స్‌ని అధిగమించి కోనేరు హంపి, హారికా ద్రోణవల్లి తరువాత ఇండియా నుండి ఎన్నికైన మూడవ మహిళా గ్రాండ్‌మాస్టరుగా నిలిచింది. తన సొంత రాష్ట్రం తమిళనాడు నుండి ఎంపికైన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది జరిగిన ప్రపంచ చదరంగ పోటీల్లో ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచినప్పుడు ‘అక్క వైశాలిని చూసి తాను చదరంగం నేర్చుకున్నాన’ని చెప్పాడు. అప్పుడే వైశాలి గురించి ఆరా తీసిన వారందరూ ఆశ్చర్యపోయారు. తమ్ముడి కంటే ముందే వైశాలీ చదరంగ పోటీల్లో రాణించింది. 2015 ఆసియన్‌ యూత్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ అండర్‌-14 క్యాటగిరీలో విజయం సాధించింది. ఈ విజయం ఆమెని ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ (ఐఎం) బిరుదును అందించడంలో కీలకపాత్ర పోషించింది. ఎనిమిదేళ్ల తరువాత, అంతర్జాతీయ మాస్టరు నుండి గ్రాండ్‌ మాస్టరుగా ఎదిగింది. ప్రజ్ఞానంద ఎఫ్‌ఐడిఇ వరల్డ్‌కప్‌ నుండి తిరిగివచ్చిన కొన్నిరోజులకే ఎఫ్‌ఐడిఇ గ్రాండ్‌ స్విస్‌ ఈవెంట్‌లో పాల్గొని విజయం సాధించింది వైశాలి. అలా ఇప్పుడు జరిగిన మహిళా అభ్యర్థుల టోర్నమెంట్‌కు అర్హత సాథించింది.

‘నేను చదరంగం ఆడడం ప్రారంభించిన నాటి నుండే గ్రాండ్‌ మాస్టర్‌ (జీఎం) కావాలని లక్ష్యం పెట్టుకున్నాను. ఇప్పుడు సాధించాను. చాలా సంతోషంగా ఉంది’ అని గ్రాండ్‌ మాస్టర్‌గా అవతరించిన తరువాత వైశాలీ తన ఆనందాన్ని వెల్లిబుచ్చింది. ఈ బిడ్డలు సాధించిన ఘనత చూసి నాగలక్ష్మి తను పడ్డ శ్రమంతా మర్చిపోయి, ఎంతో సంబరపడిపోతోంది. అమ్మ అంటే అంతేగా..!

➡️