నిజమైన స్నేహితుడు

May 13,2024 04:20 #jeevana

ఇద్దరు స్నేహితులు సెలవురోజు ఊరు వెలుపలకి షికారుకెళ్లారు. తోవలో మాట్లాడుకుంటూ ఏదో విషయంపై అభిప్రాయం కుదరక వాదించుకున్నారు. వాదన ఎక్కువై మొదటివాడు రెండోవాడిని చెంపపై కొట్టాడు. దెబ్బ తిన్నవాడు అక్కడ ఇసుకపై ‘ఈ రోజు నా స్నేహితుడు నా చెంపపై కొట్టాడు’ అని రాశాడు. మళ్లీ ఇద్దరూ ముందుకు నడిచారు.
మరికొంత దూరం వెళ్లాక ఇద్దరికీ దాహం వేసింది. మడుగు దగ్గరకు వెళ్లారు. చెంపదెబ్బ తిన్న మిత్రుడు నీళ్లలోకి దిగాడు. అక్కడ ఊబి ఉంది. అతడు ఊబిలోకి కూరుకుపోతుండగా గట్టునే ఉన్న స్నేహితుడు వెంటనే తన దగ్గర ఉన్న తువాలుని విసిరి పైకి లాగాడు. బయటపడిన స్నేహితుడు పైకి రాగానే అక్కడే ఉన్న బండరాయిపై ‘ఈ రోజు నా మిత్రుడు నన్ను ప్రమాదం నుండి రక్షించాడు’ అని చెక్కాడు.
మొదటి విషయాన్ని ఇసుకపై, రెండోదాన్ని రాయిపై ఎందుకు రాశావని మొదటి మిత్రుడు అడిగాడు. ‘ఇసుకపై రాస్తే గాలి వీచినప్పుడు చెరిగిపోతుంది. స్నేహితుల మధ్య వచ్చిన పొరబాట్లను మనసులో పెట్టుకోకూడదు. ఎప్పటికప్పుడు తుడిచేసుకోవాలి. అలాగే ఆపదలో సహాయం చేసినప్పుడు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. అందుకే నన్ను రక్షించినప్పుడు రాయిపై రాశాను’ అని రెండవ స్నేహితుడు చెప్పాడు.
నీతి : స్నేహితుల మధ్య పొరపచ్చాలు వచ్చినప్పుడు వెంటనే మర్చిపోవాలి. అదే సాయం చేసినప్పుడు కలకాలం గుర్తుంచుకోవాలి.
సేకరణ : యు.రుష్మిక, 5వ తరగతి,
గీతాంజలి హైస్కూలు, రెడ్డిగూడెం.

➡️