నగరాలకు దూరంగా … పల్లె’టూరు’

May 13,2024 04:05 #Jeevana Stories

జీవితం ఉరుకుల పరుగులమయం అయ్యాక… నగరాల్లో, పట్టణాల్లో నివాసాలు ఇరుకిరుకుగా మారాక ా స్వచ్ఛమైన గాలి కూడా కరువైపోతోంది. అందుకనే చాలామందికి విశాలమైన ప్రపంచంలోకి, కనుచూపు మేరా ఆవరించిన పచ్చదనంలోకి, జన సమ్మర్థం లేని వన సముదాయాల్లోకి వెళ్లాలనే బలమైన ఆకాంక్ష కలుగుతోంది. అలాంటి వారికి చేతులారా స్వాగతం పలుకుతున్నాయి పల్లె’టూర్లు’. సహజమైన మట్టివాసన, సెలయేర్ల గలగలల ప్రవాహం, పక్షుల కిలకిల రావాలూ … ఇప్పుడు పల్లె పర్యటనలో ప్రధాన ఆకర్షణలుగా మారుతున్నాయి. పల్లె’టూరు’ ఇప్పుడొక కొంగొత్త పర్యాటక వరవడి.

పశ్చిమ బెంగాల్‌లోని కాలింపాంగ్‌కి చెందిన కబీర్‌ ప్రధాన్‌, అహనా గురుంగ్‌ దంపతులు వివిధ నగరాల్లో ఉద్యోగాలు చేశారు. ఆ బిజీ బిజీ జీవితంలో వారికి ఊపిరి సలపనట్టుగా ఉండేది. ఎన్ని ఆధునిక సదుపాయాలు అందుబాట్లో ఉన్నా ఏదో వెలితి వెంటాడుతూ ఉండేది. పల్లెలో, ప్రకృతి ఒడిలో హాయిగా గడిపిన బాల్యాన్ని తరచూ నెమరు వేసుకునేవారు. వాళ్లే కాదు; వారి మిత్రులు కూడా తరచూ ఒక మాట అనేవాళ్లు.. ”ఇక్కడ ఊపిరి సలపటం లేదు. హాయిగా ఎటన్నా, దూరంగా వెళ్లిపోవాలి. ఈ హడావిడి, ఈ ఒత్తిడీ లేని చోటికి వెళ్లి గడపాలి.”
ఎక్కడ ఉంది అలాంటి చోటు?
కబీర్‌కి, అహనాకి వాళ్ల సొంతూరు గుర్తొచ్చేది.
ఎక్కడ చూసినా పచ్చదనం, స్వచ్చమైన నీటితో ప్రవహించే చల్లని వాగులు, సమీపంలోనే ఎత్తయిన పర్వత శ్రేణులు, అంబా అని మోరమెత్తే దూడల దూకుళ్లు, పక్షుల కిచకిచలూ గుర్తొచ్చేవి. ఆ ఊరినే ఒక పర్యాటక స్థలిగా మారిస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచించారు. ‘బాగుంటుంది. చాలా బాగుంటుంది.’ అనుకున్నారు ఇద్దరూ. వెంటనే ఓ ప్రణాళిక తయారు చేసి, దానిని ఆచరణలో పెట్టారు.
కబీర్‌కి తన సొంతూరు వ్యవసాయ భూములు ఉన్నాయి. అక్కడ సాంప్రదాయ పద్ధతుల్లో మట్టి, వెదురు ఉపయోగించి, రెండు గదుల ఇళ్లను నిర్మించాడు. చూడచక్కగా, చల్లగా ఉండేలా గ్రామీణ నిర్మాణ పద్ధతులను అనుసరించాడు. తొలుత కబీర్‌ ఉద్యోగం వదిలేసి, పూర్తిగా ఈ పనిలో ఉన్నాడు. ”ప్రకృతి మధ్య గడపాలనుకునేవారికి ఆహ్వానం” అంటూ ఒక వెబ్‌ పేజీని రూపొందించాడు. మొదటినుంచీ దానికి మంచి స్పందనే లభించింది. ఎక్కడెక్కడివారో ఆ ఊరికి వచ్చి, అక్కడి పొలాల్లో, సెలయేళ్లలో, పచ్చిక బయళ్లలో, పర్వతశ్రేణుల్లో హాయిగా గడపటం మొదలు పెట్టారు. వారికి ఏఏ వంటలు కావాలో అడిగి, అప్పుడే పొలాల నుంచి తీసుకొచ్చి వండి పెట్టించేవాడు కబీర్‌. నెమ్మదిగా ఆ పల్లె’టూరు’ పుంజుకొంది. నాలుగేళ్ల తరువాత అహనా కూడా తన ఉద్యోగాన్ని, వదిలేసి, ”పాలిఘర్‌” టూరిజాన్ని అభివృద్ధి చేయడంలో భర్తకు తోడుగా నిలబడింది.
అతిధులకు కేవలం పల్లెటూరులో ఆతిథ్యం కల్పిస్తేనే సరిపోదు. వారు ఉన్నన్ని రోజులూ ప్రకృతిలో గడిపే అవకాశాలు ఉండాలి. నగర జీవితానికి పూర్తి భిన్నమైన అనుభవాన్ని ఇవ్వగలగాలి. అందుకనే కబీర్‌ ా అహనా మూడు, నాలుగు రకాల కార్యక్రమాలు రూపొందించారు. అతిథుల వయసు, ఆసక్తి, అభిరుచులను బట్టి వారు ఏదొక యాక్టివిటీని ఎంచుకోవొచ్చు. వారికి అవసరమైన సహాయ సహకారాలు పాలిఘర్‌ నుంచి అందిస్తారు. ఆ ఊరు డార్జిలింగ్‌కు దగ్గర్లో ఉంది. ఆ కొండల పైకి ట్రెక్కింగ్‌కి వెళ్లచ్చు. వాగుల్లో ఈత కొడుతూ, చేపలు పడుతూ, ఆ గట్టు మీదనే వండుకు తింటూ కాలక్షేపం చేయొచ్చు. ఆయా కాలాల నుంచి పొలాల్లో నాట్లు వేయొచ్చు. కలుపు తీయొచ్చు. కోత కోయొచ్చు. నూర్పిడి చేయొచ్చు. తమకు కావాల్సిన కాయగూరలను తామే పొలాల నుంచి సేకరించొచ్చు. తోటల్లో ఆడొచ్చు పాడొచ్చు. 4, 5 కిలోమీటర్ల చుట్టుదారిలో కాలి నడకన అడవి అందాలను తిలకించవొచ్చు. వివిధ జంతువుల, పక్షుల ఫొటోలు తీసుకోవొచ్చు. లేదూ సమీపంలో ఉన్న గ్రామాల్లో తిరిగి రావొచ్చు. స్థానికుల జీవన స్థితిగతులను పరిశీలించొచ్చు. వారితో మాట్లాడుతూ, మమేకం అవుతూ గడపొచ్చు. ఇలా అతిథుల ఆసక్తిని బట్టి, తిరగగలిగిన ఓపికను బట్టి, బృందాల వారీగా కార్యక్రమాలను ఎంచుకోవొచ్చు. వారికి ఎలా కావలిస్తే అలా పాలిఘర్‌ సిబ్బంది ఆహార, రవాణా ఏర్పాట్లు చేస్తారు.
ఒక్కో ఇంట్లో రెండు పడక గదులు, ఒక హాలు, ఒక వంటశాల ఉంటాయి. అతిథులు తమకు కావాల్సిన వంటలను వండించుకునే అవకాశం ఉంది. కాకుంటేా అవన్నీ అక్కడి సాంప్రదాయ వంటలే. అందులో తమకు కావాల్సినవి ఉంచుకోవొచ్చు. కబీర్‌ ా అహనా ప్రారంభించిన ఈ పల్లె’టూరు’కు మంచి ఆదరణే లభిస్తోంది. ఆన్‌లైన్లో ఏడాది ముందుగానే గదుల బుకింగ్‌ జరిగిపోతోంది. దేశవిదేశాల నుంచి ఎందరో ఈ పల్లె’టూరు’ను ఇష్టపడుతున్నారు. ఊపిరి సలపని నగరాల నుంచి, జీవనం నుంచి ఉపశమనం కోసం, కొత్త ఉత్సాహం కోసం భవిష్యత్తులో ఈ తరహా టూరిజానికి మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉంది. స్థానికంగా ఉన్న ప్రకృతిపరమైన సందర్శక ప్రాంతాలతో అనుసంధానం చేసుకుంటూా పల్లెల్లో ఇలాంటి అతిథి గృహాలు మరిన్ని నెలకొనవొచ్చు.
విశాలమైన ప్రదేశాలు, అడవులు, సెలయేళ్లు, జలపాతాలు, మహావృక్షాలు, పర్వతశ్రేణులూ మాట్లాడలేవు కానీ, సహజంగా, సరళంగా, సంతోషంగా, సమైక్యంగా జీవించమని ప్రతి క్షణం సందేశాన్ని ఇస్తాయి. మనసారా జీవించటానికి అలాంటి ప్రబోధం అవసరమే కదా!

➡️