సంకల్పంతో సాధించాడు …

Apr 25,2024 06:10 #Jeevana Stories

సంకల్ప బలం ఉండాలేకాని, అసాధ్యాలను కూడా సుసాధ్యాలు చేయొచ్చని చాలామంది నిరూపించారు. గోవాకి చెందిన చైతన్య ముకుంద్‌ కూడా ఆ జాబితాలోని వాడే. అనారోగ్య కారణంగా చేతి రాత కూడా సరిగ్గా రాయలేని అతను, ఇప్పుడు ఏకంగా కథల పుస్తకాలే రాసేస్తున్నాడు. రచయితగానే కాదు, మోడల్‌గా కూడా రాణిస్తున్నాడు. తనలాంటి వాళ్ల హక్కుల కోసం పోరాడుతున్నాడు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తన వాణిని బలంగా వినిపిస్తున్నాడు.

బాల్యం నుండి సెరబ్రల్‌ పాలసీతో బాధపడ్డ చంద్రకాంత్‌కి, అతని తల్లిదండ్రులు ఎంతో అండగా నిలిచారు. అయితే, తమ అల్లారుముద్దు బిడ్డ అంగవైకల్యంతో బాధపడుతున్నాడని ఆ కన్న హృదయాలు మొదట్లో ఎంతో తల్లడిల్లాయి. అయినా వాళ్లు కొడుకు కష్టాన్ని చూసి ఏడ్వలేదు. అతనిలో ఆత్మవిశ్వాసం నింపేలా నడుచుకున్నారు. ‘ఏడాది వయసు వచ్చేసరికి నాకు సెరబ్రల్‌ పాలసీ ఉందని అమ్మానాన్న గుర్తించారు. అయితే ప్రత్యేక అవసరాలు గల నేను వాళ్లకి సాధారణ బిడ్డలానే కనిపించాను. అందుకే వికలాంగుల స్కూల్లో చేర్పించమని ఎంతమంది చెప్పినా వినలేదు. సాధారణ స్కూలుకే పంపించారు. ఈ ప్రయత్నం వల్ల నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను. నా చుట్టూ వున్న వారంతా వేగంగా నోట్సు రాసుకుంటుంటే, నేను మాత్రం, వారిలా రాయలేకపోయేవాడ్ని. నోట్సులు కూడా ఇచ్చేవారు కాదు. టీచర్లు, ప్రధానోపాధ్యాయులు మాత్రం నాకు అండగా నిలిచారు’ అంటున్న చంద్రకాంత్‌ తన ప్రయాణం గురించి ఇంకా ఇలా చెబుతున్నారు.
‘తల్లిదండ్రులు, టీచర్లు ఇచ్చిన ప్రోత్సాహంతో నేను ఉన్నత విద్య అభ్యసించి ప్రముఖ కంపెనీలో ఉద్యోగం సాధించాను. అయితే సుదీర్ఘ పనిగంటలు, ఒత్తిడితో కూడిన రాత్రి పని నా అనారోగ్యాన్ని తీవ్రం చేసింది. విపరీతమైన వెన్నునొప్పితో బాధపడ్డాను. దీనంతటి కంటే నన్ను మరో విషయం చాలా బాధించింది. అంగవైకల్యం కారణంగా అందరూ నాపై జాలిపడేవారు. ఆ దయ, జాలి భరించలేకపోయేవాణ్ని. ఫలితంగా ఎక్కువ కాలం అక్కడ పనిచేయలేదు. అయితే, 2017 నుండి నా జీవితం కొత్త మలుపు తిరిగింది. ఉద్యోగం మానేసిన నేను ఫ్రీలాన్స్‌ రైటర్‌గా కొన్ని కంపెనీలకు పనిచేయడం ప్రారంభించాను.
2018లో అంగవైకల్యం గల వారితో నిర్వహించే అందాల పోటీలో పాల్గన్నాను. అది ప్రపంచ ప్రసిద్ధి గాంచిన డిజైనర్లు రూపొందించిన సింగిల్‌ కంటిన్యూస్‌ ఫ్యాషన్‌ షో. ఆ ప్రదర్శన గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డులోకెక్కింది. ఆ అనుభవం నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ఆ ఆత్మవిశ్వాసంతోనే నాలో దాగున్న మరో కోణాన్ని ఆవిష్కరించుకున్నాను. రచనలపై నాకున్న ఆసక్తితో నా మొదటి పుస్తకాన్ని ప్రచురించాను. ‘శివరు’ పేరుతో వచ్చిన ఆ పుస్తకంలో ఓ అద్భుత బాలుడిని పరిచయం చేశాను. భారత్‌లో ఆ అంశంతో వచ్చిన మొదటి పుస్తకం నాదే. నా హృదయం, నా ఆత్మ ఆ పుస్తకం ప్రతి పేజీలో కనిపిస్తుంది.
అప్పుడు మొదలుపెట్టిన నా ప్రయాణం, 2021కి వచ్చేసరికి టాప్‌ 25 పిడబ్ల్యుడిఎస్‌లలో నేనొకడిలా నిలబడేలా చేసింది. ఎన్‌సిపిఇడిపి జావేద్‌ అబిది ఫెలోషిప్‌కి ఎంపికై మరింత ఆత్మవిశ్వాసాన్ని తెచ్చిపెట్టింది.
నేనెప్పుడూ నా వైకల్యాన్ని భుజం మీద వేసుకుని తిరగలేదు. ప్రతి ఒక్కరూ తమ జీవితాలను తామే మార్చుకోగలరు. దృఢ సంకల్పం ఉంటే చాలు. నా కుటుంబం, స్నేహితులు ఈ ప్రయాణంలో ఎంతో సహకరించారు. వాళ్ల మద్దతుతోనే నేను ఇన్ని విజయాలు సాధించాను. సమాజం నాకు హద్దులు పెట్టాలని చూసినా వాటన్నింటినీ అధిగమించాను. ఇప్పుడు నా కథను నేనే రాస్తాను. భవిష్యత్తు గురించి ఎంతో ఆశగా ఉంది. ఎలాంటి సవాళ్లు వచ్చినా, నేను వెనక్కి తగ్గను. పట్టుదలతో వాటిని అధిగమిస్తాను’ అంటున్న చంద్రకాంత్‌ లాంటి వారు మన చుట్టూ ఎంతోమంది. ఏ వైకల్యమూ ప్రతిభకు ఆటంకం కాదని నిరూపించే ప్రతిభావంతులు ఎందరో! అలాంటి వారే మనందరికీ స్ఫూర్తి.

➡️