ఓటమి భయంతోనే వైసిపి దాడులు – టిడిపి అధినేత చంద్రబాబు

May 13,2024 22:15 #speech, #TDP chief Chandrababu

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఓటమి భయంతోనే వైసిపి దాడులకు తెగబడిందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జగన్‌ అరాచక పాలనకు గుడ్‌బై చెప్పేందుకు తెల్లవారుజాము నుంచే ఓట్లు వేసేందుకు క్యూలైన్లలో ఎదురుచూస్తున్న ప్రజలే నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను మంగళగిరిలోని టిడిపి కార్యాలయం నుంచి చంద్రబాబు పర్యవేక్షించారు. ప్రజల్లో వచ్చిన తిరుగుబాటుతో ఓటమి కళ్లకు కనిపిస్తుండడంతో వైసిపి నేతలు ఎక్కడికక్కడ దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. మండుటెండలను లెక్కచేయకుండా తెల్లవారుజాము నుంచే ఓటింగులో పాల్గనేందుకు పెద్దయెత్తున క్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతోందని తెలిపారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వైసిపి వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. తెనాలిలో క్యూలైన్‌లో రమ్మని చెప్పినందుకు ఓటరుపై వైసిపి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ దాడి చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. మాచర్ల నియోజకవర్గంలో వైసిపి హింసను కట్టడి చేయడంలో స్థానిక పోలీసు అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. పోలింగ్‌ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తూ, ఓటు హక్కును హరిస్తున్న వారిపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తెనాలి వైసిపి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ఓటరుపై దాడి చేయడం, తక్కెళ్లపాడు పోలింగ్‌ స్టేషన్‌ వద్ద ఎస్‌సి మహిళలపైకి గుంటూరు వైసిపి ఎంపి అభ్యర్థి కిలారు రోశయ్య కారుతో దూసుకురావడం దుర్మార్గమని అన్నారు. పుంగనూరు, మాచర్ల, రైల్వే కోడూరు, మైదుకూరు, ఆమదాలవలస, తాడికొండ నియోజకవర్గాల్లో ఎన్‌డిఎ కూటమి ఏజెంట్లపై దాడులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

➡️