బుజ్జిమేక

May 25,2024 05:03 #feachers, #jeevana, #katha

అనగనగా రామాపురంలో ఒక తెలివైన బుజ్జి మేక ఉండేది. అది ఒక రోజు మందతో కలిసి పక్కనే ఉన్న అడవిలోకి మేతకు వెళ్లింది. ఆ బుజ్జి మేకకు కాస్త అల్లరి ఎక్కువ. అందుకే మందతో కలిసి ఉండకుండా, అటు, ఇటూ గెంతుతూ అడవి లోపలికి వెళ్లింది. దాన్ని ఒక పెద్దపులి చూసింది. వెంటనే ముందుకు దూకింది. ఊహించని ఈ పరిణామానికి మేకపిల్ల గజగజా వణికిపోయింది. అయినా పులి ముందు ధైర్యం నటించింది. ఆపాయం నుంచి బయటపడటానికి ఉపాయంగా ఆలోచించింది.
‘పెద్దపులి బాబారు, పెద్దపులి బాబారు… నేను నీకు, నాకు సంబంధించిన నాలుగు నిజాలు చెబుతాను. అవి నిజమేనని నువ్వు ఒప్పుకుంటే, ఈ ఒక్కసారికి నన్ను చంపకుండా వదిలేయాలి. సరేనా’ అంది. ‘ఏంటీ పెద్దపులినైన నాకు, మేకపిల్లవైన నీకూ సంబంధించిన నిజాలా, ఏంటో చెప్పు చూద్దాం’ అంది కాస్త ఆసక్తిగా.
‘ఏం లేదు బాబారు, ‘నువ్వు నీతోటి పెద్ద పులులతో ఇవాళ నేనొక మేక పిల్లను చూశాను. కానీ దాన్ని చంపకుండా వదిలేశాను’ అంటే అవి నమ్మవు. నిజమేనా?’ అంది బుజ్జి మేక.
‘అవును నిజమే’ అంది పెద్దపులి.
‘అలాగే నేను నా తోటి మేకల దగ్గరకు వెళ్లి ఈ రోజు నేనొక పెద్దపులికి చిక్కాను. కానీ అది ఏమీ చేయకుండా వదిలేసింది’ అని చెబితే అవి అస్సలు నమ్మవు కదా!’ అంది మేకపిల్ల.
‘అవును’ అని తలాడించింది పెద్దపులి.
‘నేను నా తోటి మేకలకు ఈ విషయం చెప్పాలంటే నువ్వు నన్ను వదిలేయాలి కదా!’ అంది బుజ్జిమేక. ‘అవును’ అంది పులి. ‘మరి నేను వెళ్లిపోనా’ అంది మేకపిల్ల. ‘వెళ్దువు కానీ ఆ నాలుగో నిజం ఏంటో కూడా చెప్పు’ అంది పెద్దపులి.
‘బాబారు.. నీకు ఇప్పుడు ఆకలి లేదు. నువ్వు ఇందాకే ఏదో తిని ఉంటావు. అందుకే నేను కబుర్లు చెబుతున్నా, నన్ను చంపకుండా చక్కగా వింటున్నావు’ అంది మేకపిల్ల. ఆ మాటలకు పెద్దపులి పెద్దగా నవ్వేసింది. తన ముందు ధైర్యంగా మాట్లాడుతున్న మేకపిల్లను చూసి ముచ్చటపడి, ‘నిన్ను చంపనులే ఇక పో’ అంది పెద్దపులి. ‘హమ్మయ్య! గండం గడిచింది’ అనుకుని బుజ్జిమేక అక్కడి నుంచి పరుగుపరుగున తన మందను చేరుకుంది.

– కె.మంజుల, 7వ తరగతి, ఏ.పీ మోడల్‌ స్కూలు,
ఎం తిమ్మాపురం, మహానంది పండలం,నంద్యాల జిల్లా.

➡️