గుడిసెలను కూల్చి… గుండెకోత మిగిల్చి.

గుడిసెలను కూల్చి... గుండెకోత మిగిల్చి.

గుడిసెలను కూల్చి… గుండెకోత మిగిల్చి..ప్రజాశక్తి – వెంకటగిరి ‘వాళ్లేమీ తాజ్‌మహల్‌ కట్టివ్వమని అడగడం లేదు.. కనీసం విశాఖ రిషికొండలో జగన్మోహన్‌రెడ్డి ప్యాలెస్‌ కావాలనీ కోరడం లేదు.. కేవలం ఉండటానికి రెండు సెంట్ల స్థలాన్నే కోరుతున్నారు.. ప్రభుత్వాన్ని అడిగి అడిగి విసిగి వేసారిపోయారు.. చివరకు కొన్నాళ్ల క్రితం మేత పోరంబోకు భూమిలో 300 మంది గుడిసెలు వేసుకుని, అక్కడే వంటా వార్పు చేసుకుంటూ బతుకు జీవనం సాగిస్తున్నారు. ఎన్నికల వరకూ మిన్నకుండిన అధికారులు, ఎన్నికలైన తరువాత విజృంభించారు.. గుడిసెలను కూల్చివేశారు.. పేదలకు గుండెకోత మిగిల్చారు.. వాళ్లంతా అడుగుతున్నది ఒక్కటే ఉండటానికి జానెడు జాగా.. జాయింట్‌ సర్వే చేసి ఇవ్వాలని కోరుతున్నారు. తాము గుడిసెలు వేసుకుని ఉంటున్న జాగా ఫారెస్టుది అయితే, జగనన్న కాలనీకి ఎలా కేటాయిస్తారన్నదే వారి మిలీనియం ప్రశ్న. ఈ ప్రశ్నకు అధికారులు నీళ్లు నమలడం తప్ప సమాధానం చెప్పే పరిస్థితి లేదు. జాయింట్‌ సర్వే పేరుతో ఏళ్ల తరబడి పేదల సమస్యను నానుస్తూనే ఉండటం ఇక్కడి ‘రెవెన్యూ’ అధికారుల స్పెషల్‌.పేదలకు న్యాయం చేయాలి : వడ్డిపల్లి చెంగయ్య మండలంలోని పెట్లూరు గ్రామ పంచాయతీ 12 సర్వేనంబర్‌ 1లో మేత పోరంబోకు స్థలం ఉంది. ఎంతోకాలంగా చెట్టుపుట్ట కొట్టి సాగు చేసుకుంటుంటే ఫారెస్టు అధికారులు తమదని వెళ్లిన ప్రతిసారీ తరుముతూనే ఉన్నారు. తమకు న్యాయం చేయాలని బుధవారం తహశీల్దార్‌ సాంబశివరావుకు వినతిపత్రం అందజేశాం. ఫారెస్టు అధికారులు తమ వద్ద ఎలాంటి ఆధారాలను చూపకుండా అది ఫారెస్టుదని చెప్పడం సరికాదని, 2012లో నెల్లూరు జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌ జాయింట్‌ సర్వే చేసి పట్టాలివ్వాలని చెప్పినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారే తప్ప పేదలకు న్యాయం చేయలేదని వేడుకొన్నారు. ఉన్నపళంగా వచ్చి తమ గుడిసెలను కూల్చివేసి దాష్టీకం ప్రదర్శించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. జాయింట్‌ సర్వే నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మా పోరాటం ఆగదు : చేజర్ల రమణయ్య 2004వ సంవత్సరం నుండి ఈ భూమిని చదును చేసుకుని గతంలో పంట కూడా వేశాం. ఫారెస్ట్‌ అధికారులు మాపై దౌర్జన్యం చేస్తూనే ఉన్నారు. గుడిసె నిర్మించుకుంటే మాపై దౌర్జన్యం చేసి తొలగించ డానికి ప్రయత్నిస్తున్నారు. ఇది అన్యాయం కదా అంటే కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు. ఇది ఫారెస్ట్‌ భూమి అయితే జగనన్న కాలనీకి ఏ విధంగా ఇచ్చారు. జాయింట్‌ సర్వే నిర్వహించి పేదలకు పట్టాలు ఇచ్చేవరకూ మా పోరాటం ఆగదు. పేదలపైనే ఈ జులుమంతా : కె.దేవమ్మ పేదలపైనే ఈ జులుమంతా.. అదే పెద్దలు వందల ఎకరాలు ఆక్రమించుకుంటున్నా పట్టించుకోరు.. ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న భూమికి పట్టాలివ్వాలని కోరుతుంటే ఫారెస్టోళ్లు ప్రతిసారీ దాడులు చేసి బెదరగొడుతున్నారు. గత 14ఏళ్లుగా భూమిని చదును చేసుకుని గుడిసె నిర్మించుకుని ఉంటున్నా. మా గుడిసెలను పీకేయడానికి వచ్చారు. పేదలంటే ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. కూటమి ప్రభుత్వమైనా జాయింట్‌ సర్వే నిర్వహించి పేదలకు న్యాయం చేయాలి. ఆన్‌లైన్‌లో మేత పోరంబోకుగా ఉన్నా… : తహశీల్దార్‌ పెట్లూరు గ్రామ సర్వే 12లో ఉన్న భూమి రిజర్వు ఫారెస్టుకు చెందుతుందని, మీ భూమి ఆన్‌లైన్‌లో మేత పోరంబోకుగా ఉన్నా అధికారిక రికార్డుల ప్రకారం ఫారెస్టుదని తెలిపారు. రీజియన్‌ రేంజర్‌ రాజేంద్రప్రసాద్‌తో చర్చించి చెబుతున్నానన్నారు. పేదలకు పట్టాలివ్వాలంటే చట్టపరంగా ఇస్తామన్నారు. రికార్డుల్లో మాదనే ఉంది : రాజేంద్రప్రసాద్‌, ఫారెస్టు రేంజి అధికారి ఆ భూమి రిజర్వు ఫారెస్టు భూమిగానే మా రికార్డుల్లో ఉంది. మా భూమిలో ఆక్రమణ జరిగింది. త్వరలోనే జాయింట్‌ సర్వే నిర్వహించి గుడిసెలను తొలగిస్తాం.

➡️