‘వంశధార’లో వింతలు

వంశధార అధికారుల్లో వింత పోకడలు కనిపిస్తున్నాయి. కుడి, ఎడమ కాలువల్లో ప్రారంభం

నందిగాం మండలంలో సాగుతున్న జంగిల్‌ క్లియరెన్స్‌ కాలువ పనులు

కాలువ అంతటా పేరుకుపోయిన పూడిక

శివారు కాలువల్లో హడావుడిగా పనులు

షార్ట్‌ టెర్మ్‌ టెండర్లు పిలవకుండా సర్దుబాటు

నామినేషన్‌ పద్ధతిపై టిడిపి కార్యకర్తలకు కట్టబెడుతున్న వైనం

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

వంశధార అధికారుల్లో వింత పోకడలు కనిపిస్తున్నాయి. కుడి, ఎడమ కాలువల్లో ప్రారంభం నుంచి చివరి వరకు గుర్రపుడెక్క, పూడిక పేరుకుపోయింది. తొలుత కాలువ ప్రారంభం నుంచి సరిచేసుకుంటూ వస్తే శివారు భూములకు నీరందడం పెద్ద సమస్య కాదు. వంశధార ఇంజినీరింగ్‌ అధికారులు మాత్రం మొదట శివారు ప్రాంత కాలువల్లో పూడికతీత పనులు మొదలుపెట్టి రివర్స్‌లో వస్తున్నారు. పనులను ఒక పద్ధతి ప్రకారం కాకుండా హడావుడిగా చేపట్టడంపై అనే విమర్శలు వినిపిస్తున్నాయి. టిడిపి కార్యకర్తలకూ ఎంతో కొంత లబ్ధి చేకూరుస్తున్నారన్న ఆరోపణలూ లేకపోలేదు. ఎడమ కాలువ శివారు ప్రాంతంపై దృష్టిసారించిన అధికారులు, కుడి కాలువ శివారు ప్రాంతాలను విస్మరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.హిరమండలం గొట్టాబ్యారేజీ ద్వారా వంశధార కుడి, ఎడమ కాలువల కింద 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. ఇందులో ఎడమ కాలువ ద్వారా 1.70 లక్షల ఎకరాలు, కుడి కాలువ ద్వారా 80 వేల ఎకరాలకు నీటిని అందివ్వాల్సి ఉంది. ఎడమ కాలువ 104.5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కాలువ పరిధిలో జలుమూరు, సారవకోట, నరసన్నపేట, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలో గల 398 గ్రామాల్లోని 1,48,230 ఎకరాలకు సాగునీరందాల్సి ఉంది. కుడి కాలువ 63 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కాలువ పరిధిలో హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, సరుబుజ్జిలి, బూర్జ, ఆమదాలవలస, శ్రీకాకుళం, గార మండలాల్లోని 165 గ్రామాల్లోని 62,280 ఎకరాలకు సాగునీరు చేరాల్సి ఉంది. రెండు కాలువల్లో అడగడుగునా పెద్దఎత్తున గుర్రపుడెక్క, పూడిక పేరుకుపోయింది. దాన్ని తొలగిస్తే గానీ కాలువల్లో నీరు స్వేచ్ఛగా ప్రవహించే అవకాశం లేదు. తొలగింపు పనులు ప్రారంభ స్థానం నుంచి చేస్తే శివారుకు సాగునీటి సమస్యలు ఉత్పన్నం కావు. కానీ ఎడమ కాలువకు సంబంధించి ఒక్క టెక్కలి డివిజన్‌ పనులు మొదలుపెట్టి, మిగిలిన ప్రాంతాలను విస్మరించడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. నిధుల కేటాయింపులోనూ సింహభాగం ఆ డివిజన్‌కే కేటాయించినట్లు తెలుస్తోంది. రెండు కాలువలకు కలిపి రూ.90 లక్షలు కేటాయించగా, టెక్కలి డివిజన్‌లోని నందిగాం, పలాస ప్రాంతాలకు రూ.22 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది.హడావుడిగా పనులుటెక్కలి డివిజన్‌కు కేటాయించిన సొమ్ములతో హడావుడిగా పనులు ప్రారంభించేశారు. కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ ఈనెల 24వ తేదీన నందిగాం, పలాస ప్రాంతాల్లో కాలువల పరిశీలనకు వెళ్లి వచ్చిన మరుసటి రోజే పనులు మొదలుపెట్టేశారు. పనులను అంతా నామినేషన్‌ పద్ధతిపై కేటాయించినట్లు సమాచారం. పనులకు సంబంధించి రూ.లక్ష లోపు వరకు సంబంధిత ఇఇ అనుమతులు ఇస్తారు. రూ.రెండు లక్షల పనుల వరకు ఎస్‌ఇ అనుమతి ఇస్తారు. ప్రస్తుత పనులకు షార్ట్‌ టెర్మ్‌ టెండర్లను పిలవాల్సి ఉన్నా, పనులన్నింటినీ రూ.రెండు లక్షల్లోపు సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది. టెండర్లను పిలవకుండా నేరుగా నామినేషన్‌ పద్ధతిన నచ్చిన వారికి కేటాయించినట్లు సమాచారం.కుడి కాలువ శివారు కాలువల పరిస్థితేమిటి?కుడి కాలువ పరిధిలోని శివారు ప్రాంతమైన గార మండలంలో ప్రతి ఏడాదీ సాగునీరందక పంటలు ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. కుడి కాలువలోనూ పెద్దఎత్తున గుర్రపుడెక్క, పూడిక పేరుకుపోయింది. ముఖ్యంగా కాలువ ప్రారంభమయ్యే హిరమండలం, సరుబుజ్జిలి, ఎల్‌ఎన్‌పేట ప్రాంతాల్లో కాలువల్లో అడుగడుగునా గుర్రపుడెక్క ఉండడంతో నీరు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. గుర్రపుడెక్క, పూడిక తీవ్రత ఉన్న ప్రాంతాలపై దృష్టిసారించి, వాటిని తొలగిస్తే నీటి ప్రవాహానికి అడ్డంకి ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈనెల 19వ తేదీన నందిగాం, పలాస ప్రాంతాల్లో పర్యటించి వంశధార కాలువలను పరిశీలించారు. ఆ ప్రాంతాల పరిశీలనకు కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ను ఆదేశించారు. ఆ తర్వాత ఇప్పుడు అక్కడ చకచకా పనులు జరుగుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో కాలువల పరిస్థితి మాత్రం అలానే ఉంది. తమ ప్రాంతం, తమ రైతులు అనే దృక్పథం కాకుండా జిల్లావ్యాప్తంగా ఉన్న రైతుల ప్రయోజనాలను చూడాలని అంతా కోరుతున్నారు.మా పరిధి వరకు మేం పనులు చేస్తున్నాంవంశధార ఎడమ కాలువకు సంబంధించి మా పరిధిలోని నందిగాం, పలాస ప్రాంతాల్లోని కాలువల్లో గుర్రపుడెక్క, పూడికతీత పనులు చేస్తున్నాం. పనుల కోసం రూ.22 లక్షలు కేటాయించారు. పనులన్నీ రూ.రెండు లక్షల్లోపు పనులే కావడంతో నామినేషన్‌ పద్ధతిన ఉన్నతాధికారులు కేటాయించారు.- బి.శేఖర్‌రావు, వంశధార ఇఇ టెక్కలి డివిజన్‌

 

➡️