మళ్లీ కోవిడ్‌ భయం.. అప్రమత్తత అవసరం …

Dec 28,2023 08:02 #Covid Cases, #Jeevana Stories
covid cases again increasing

ప్రస్తుతం చలి తీవ్రత బాగా ఉంది. దీనికి తోడు కోవిడ్‌ వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత కాలంలో కోవిడ్‌ మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పింది. ఆ చేదు జ్ఞాపకాలను విస్మరించకుండా ప్రబలుతున్న వైరస్‌ని సమర్థవంతంగా తిప్పికొట్టాలి. వరుసగా పండుగల హడావిడి ఉంది. బస్‌స్టేషను, రైల్వే స్టేషన్లతో పాటు నూతన సంవత్సర వేడుకలతో ఎక్కడికక్కడ జనసందోహాలు కనిపిస్తాయి. వైరస్‌ భయం వెంటాడుతున్న వేళ అజాగ్రత్త కూడదు.

కోవిడ్‌ కొత్త రూపాంతరం, జెఎన్‌-1 అంత ప్రమాదకారి కాకపోయినా తగు జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోవద్దు. అసలే చలికాలం. ఫ్లూ వంటి శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా జలుబు, దగ్గు, ఆయాసం, జ్వరం బారిన పడుతున్న వారు ఈమధ్య కాలంలో బాగా పెరుగుతున్నారు. ఆందోళన చెందకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

ఇప్పుడు అందరూ కోవిడ్‌ మార్గదర్శకాలలో ముఖ్యమైన మాస్క్‌ వినియోగం తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా బయటికి వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరూ ధరించాలి. గుమిగూడిన జనంలోకి వెళ్లకుండా ఉంటే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే మాస్క్‌ వేసుకోవాలి. ఈ మాస్క్‌, కోవిడ్‌ వైరస్‌ నుండే కాక, ఇతర వ్యాధులను వ్యాపింపజేసే అనేక సూక్ష్మజీవుల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది.

అపరిశుభ్రత కూడా వైరస్‌ వ్యాప్తికి ప్రధాన కారణం. శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు అపరిశుభ్రత వల్లే ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. మురికి చేతులతో నోరు, ముక్కును తాకడం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందుతాయి. అందువల్ల వీలైనంత వరకు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే బయటి నుంచి వచ్చిన తర్వాత సబ్బు నీళ్లతో చేతులను బాగా కడగాలి. శానిటైజర్‌ని ఉపయోగించడం శ్రేయస్కరం.

బలహీనమైన రోగనిరోధక శక్తి వల్ల సాధారణ జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు తరచూ దాడి చేస్తాయి. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారం తీసుకోవాలి. ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, పాలు, తృణధాన్యాలు మొదలైనవి చేర్చుకోవాలి. రోజువారీ ఆహారంలో ఇవి భాగం చేసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి.

శరీరానికి తగినంత నీరు కావాలి. ఈ కాలంలో దాహంగా లేదని నీరు తాగకుండా ఉంటారు. శరీరం డీహైడ్రేట్‌ కావడం వల్ల శ్లేష్మ పొర మందంగా మారుతుంది. ఇది గాలి మార్గాన్ని ఇరుకైనదిగా చేస్తుంది. దీని వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి తగిన మోతాదులో నీరు తాగాలి.వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు బలపడతాయి. కాబట్టి రోజూ కొంత సమయం పాటు వ్యాయామం చేయడం అలవర్చుకోవాలి.

➡️