గాలిపటం…దారం

Dec 11,2023 10:59 #Jeevana Stories

                   సిద్ధు గాలిపటం తయారు చేయడానికి రంగు కాగితాలు తెచ్చాడు. మిత్రుడు దేవరాజ్‌ సహాయంతో చక్కని గాలిపటం తయారు చేశాడు. సెలవు దినం కావడంతో పాఠశాల మైదానంలోకి వెళ్లి గాలిపటానికి చక్కగా దారం కట్టి, సిద్దు, దేవరాజ్‌ ఎగరవేస్తున్నారు. అక్కడ ఖాళీ స్థలం ఎక్కువగా ఉండడంతో గాలిపటం రివ్వు రివ్వున పైకి వెళ్తున్నది.

ఆకాశంలో విహారం చేస్తున్న గాలిపటాన్ని చూస్తూ పిల్లలు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. అది చూసి, ఎగురుతున్న గాలిపటం చాలా గర్వపడింది. తనకు దిగువన ఉన్న దారం వైపు చూసి నవ్వింది.

‘ఎందుకు నవ్వుతున్నావ్‌’ అని దారం అడిగింది. ‘చూసావా! పిల్లలు నన్ను చూసి ఎలా కేరింతలు కొడుతున్నారో’ అంది గాలిపటం. అప్పుడు దారం ‘నేను ముందు చూపే చూడగలను. నేను కింద వైపు చూస్తే నీకే ప్రమాదం’ అంది. ‘నాకు ప్రమాదమా! నీకేమైనా మతి పోయిందా?’ అని ఎగతాళిగా అంటూ’ పిల్లలు నన్ను చూసి కేరింతల కొడుతున్నారని నువ్వు ఉడుక్కుంటున్నావు’ అని గాలిపటం హేళనగా మాట్లాడింది.

అప్పుడు దారం, ‘మిత్రమా! అలా ఏమీ కాదు. నిన్ను పై పైకి తీసుకువెళ్లడమే నా పని. నా ఆసరాతోనే నువ్వు ఎగురుతావు. నేను ఆ పనిలో నిర్లక్ష్యం చేస్తే నీకు ఆపద వచ్చే ప్రమాదం ఉంది.’ అని వివరించింది. అయినా గాలిపటం ఒప్పుకోలేదు. ‘నిన్నెవరూ పట్టించుకోరు. అందుకే అలా అంటున్నావు’ అని మళ్లీ ఎగతాళి చేసింది. గాలిపటం గర్వాన్ని అణచాలని దారం వెంటనే కాస్త కింది వైపుకు దిగింది. అంతే, గాలిపటం పల్టీలు కొడుతూ ఉక్కిరిబిక్కిరి అయింది. అప్పుడు దారం విలువ గాలిపటానికి తెలిసింది.

దారం వైపు చూస్తూ ‘నన్ను క్షమించు మిత్రమా, నువ్వు లేకపోతే నేను లేనని నాకు అర్థమైంది. నీ ఆసరాతోనే నేను చక్కగా ఎగరగలుగుతాను. నన్ను పడిపోకుండా రక్షించు’ అని వేడుకొంది. వెంటనే దారం సర్దుకుంది. గాలిపటం మరలా ఆకాశంలో ఎగర సాగింది. దారం వైపు చూసి, ‘నన్ను క్షమించు మిత్రమా, నీ విలువ తెలుసుకోకుండా హేళన చేశాను’ అంది.

‘మిత్రమా మనం ఒకరికి ఒకరం ఆసరాగా ఉండాలి. నేను నీకు ఆసరా. నాకు గాలిపటం ఎగరేసే ఆ బాలుడు ఆసరా. ఇందులో ఎవరు అజాగ్రత్తగా ఉన్నా అందరికీ ఇబ్బంది. అది తెలుసుకుని నడుచుకోవడమే మన పని’ అని దారం వివరించి చెప్పింది.

– మొర్రి గోపి, 94945 90820.

➡️