అవరోధాలు అధిగమించి…

Feb 4,2024 07:52 #Jeevana Stories, #Women Stories
gypsy driving

ఆటోలు, బస్సుల నుంచి విమానాలు, రైళ్లు, యుద్ధ విమానాలు.. ఇలా ఒకటేమిటి చిన్న వాహనాల దగ్గర నుంచి పెద్ద పెద్ద వాహనాలను నడుపుతున్న మహిళా డ్రైవర్ల గురించి ఎన్నో సార్లు విన్నాం. చదివాం. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వారు ఎదిగిన తీరును అభినందించాం. అయితే ఆర్థిక ఇబ్బందులకు తోడు వివక్ష రాజ్యమేలుతున్న సమాజంలో వారు నిత్యం అవమానాలు, వేధింపులకు గురి అవుతూనే ఉన్నారు. అందుకు ఉదాహరణే ఈ కథనం. మహారాష్ట్ర చంద్రపూర్‌ జిల్లా ‘తడోబా అంథేరి టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌’ని ఆనుకుని వున్న శ్రీఖేడ గ్రామం, దాని చుట్టుపక్కల గ్రామాల్లో ఈ పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. అక్కడ మొత్తం 70 మంది మహిళలు రిజర్వ్‌ ఫారెస్ట్‌లో జిప్సీ వాహనం నడిపే శిక్షణ తీసుకుని ఏడాది గడిచిపోయింది. అయినా వారెవరూ ఇంతవరకు డ్రైవర్లుగా విధుల్లోకి వెళ్లలేదు. అడవుల్లో పూలు ఏరుకుని, కట్టెలు అమ్ముకుని, వ్యవసాయ కూలీ చేసుకునే మహిళలే వారంతా. జీవితాలు బాగు చేసుకుందామని ఎంతో శ్రమ పడి డ్రైవింగ్‌ నేర్చుకున్నారు. కానీ ఇప్పుడు వారికి ఎదురైన పరిస్థితి భిన్న రంగాల్లో ఎంతోమంది మహిళలు పడుతున్న వెతలకు సజీవరూపం.

శ్రీఖేడ గ్రామానికి చెందిన 24 ఏళ్ల మయూరి కుల్సంగి జిప్సీ డ్రైవింగ్‌ శిక్షణ తీసుకుంది. శిక్షణ తీసుకున్న మొత్తం మహిళల్లో మయూరిదే మొదటి అడుగు. 2020లో తండ్రి మరణంతో ఇంటి బాధ్యత ఆమెపై పడింది. తల్లి టీ కొట్టు నడుపుకుని జీవనం సాగిస్తుంటే ఆమెకు సాయంగా వెళ్లేది. 2023లో రిజర్వ్‌ ఫారెస్టు చేసిన ప్రకటనతో డ్రైవింగ్‌ వైపు మళ్లింది. ‘శిక్షణకు వచ్చిన మొత్తం పురుషుల్లో నేను ఒక్కదాన్నే మహిళను. అప్పుడు వారంతా నావైపు ఆశ్చర్యంగా చూశారు. వారితో సమానంగా శిక్షణ తీసుకుంటుంటే వాళ్లల్లో వాళ్లే మాట్లాడుకుంటూ నవ్వుకునేవారు. ‘నీకు ఇవన్నీ అవసరమా? మీ అమ్మతో కలసి టీ అమ్ముకో!’ అన్న వారు కూడా ఉన్నారు. ఆ మాటలు పట్టించుకోకుండా శిక్షణ తీసుకున్నాను. అడవిలోకి ఒక రైడ్‌ చేస్తే రూ.2700 వస్తాయి. అలాంటివి రోజుకు రెండు చేస్తాం. అయితే పరిమితిని బట్టి, అధికారులు ఇచ్చిన అనుమతిని బట్టి మా ఆదాయం నెలకు రూ.70 వేలు వస్తుంది. ఈ సొమ్ము నా కుటుంబాన్ని గట్టెక్కిస్తుందని ఎంతో ఆశపడ్డాను. కానీ పరిస్థితి వేరేలా ఉంది’ అంటోంది. మయూరిని చూసి ఆ గ్రామం నుంచే రేష్మా ఐక్‌, లక్ష్మి కొడపె కూడా మయూరితో పాటు శిక్షణ తీసుకున్నారు.

శ్రీఖేడకి 20 కిలోమీటర్ల దూరంలోని కోలారా గ్రామం నుండి 30 ఏళ్ల భారతి కూడా శిక్షణ తీసుకుంది. పత్తి చేలో కూలీ పనులకు వెళ్లే భారతి స్టీరింగ్‌ పట్టుకుని ఎన్నో కలలు కన్నది. తన జీవితం మెరుగుపడుతోందని ఆశపడింది. ‘ఈ అడవిలోనే నా బాల్యం గడిచింది. ఇక్కడే ఆడుకున్నాను. గెంతులు వేశాను. ఇక్కడికి వచ్చే పక్షులతో చెలిమి చేశాను. అందుకే రిజర్వ్‌ ఫారెస్ట్‌లోకి డ్రైవింగ్‌ శిక్షణ ఇస్తున్నారని తెలిసి, వెళ్లాను. మొన్న డిసెంబరులో లైసెన్సు కూడా తీసుకున్నాను. కానీ సొంత వాహనం లేకపోవడం వల్ల ఇంతవరకు సఫారీ రైడ్‌కి వెళ్లలేదు’ అని నిరుత్సాహంతో చెబుతోంది.

gypsy driving

‘శిక్షణ తీసుకున్న మహిళల అందరి పరిస్థితి ఇదే. రూ.7 లక్షలు ఖర్చు పెట్టి జిప్సీని కొనుగోలు చేయలేం. బ్యాంకు రుణం తీసుకుని వాహనం కొందామన్న కుటుంబాలు ఒప్పుకోవడం లేదు. అంత సొమ్ము ఉంటే పెళ్లి చేసి పంపేవాళ్లం. లోను తీసుకుని బండి నడపడం మొదలుపెడితే, రేపు పెళ్లయిన తరువాత అత్తింటి వాళ్లు ఒప్పుకుంటారా?’ అని వెనక్కి లాగుతున్నారు’ అంటోంది భారతి.

‘అమ్మానాన్న పూర్తి మద్దతుతో 23 ఏళ్ల రేష్మ డ్రైవింగ్‌ శిక్షణ తీసుకుంది. అయితే జిప్సీ కొనే స్థోమత లేక, అంత రుణం తెచ్చి బండి కొనడం వృథా అని తల్లిదండ్రులు అడ్డు చెబుతున్నార’ని తన స్నేహితురాలి గురించి కూడా భారతి చెప్పింది. రిజర్వ్‌ ఫారెస్ట్‌లోకి 22 గేట్ల ద్వారా అనుమతి ఉంది. 362 జిప్సీలకు లైసెన్సులు ఇచ్చారు. అయితే జిప్సీలన్నీ పురుషులే ఎక్కువగా నడుపుతారు. ఇప్పుడు శిక్షణ తీసుకున్న మహిళలకు వాహనాలు ఉంటే వారు కూడా నడుపుకోవచ్చు. లేదా అద్దెకు తీసుకునైనా నడపవచ్చు. కానీ మహిళలకు కాదు కదా, వారు నడిపే జిప్సీలకు స్థలం ఇవ్వడానికి కూడా అక్కడి పురుషులు అంగీకరించడం లేదు. అనారోగ్యం వల్ల జిప్సీ నడపలేని పరిస్థితుల్లో కూడా వాహనాన్ని పురుషులకు ఇచ్చేందుకే మొగ్గుచూపుతున్నారు. ‘జిప్సీ ఖాళీగా ఉందని తెలిసి, ఒకసారి రైడ్‌కి ఇవ్వమని ఆ డ్రైవర్లను ఎన్నోసార్లు అడిగాను. వారు ఇవ్వలేదు. పైగా లోపల అంతా గతుకుల రోడ్డు.. బండి ఎగిరెగిరి పడుతుంది. టైర్లు పంచరై గాల్లోకి తేలతాయి. మేమైతే ఏవో తంటాలు పడి మరమ్మతు చేసుకుంటాం. ఎంత రాత్రైనా ఇంటికి చేరుకుంటాం. మీ పరిస్థితి అలా కాదు కదా! మీకు అలాంటివి ఎదురైతే ఎలా బయటికి వస్తారు’ అంటూ భయపెడుతున్నారు. ఆ మాటలు వింటుంటే ఫారెస్ట్‌లోకి వెళ్లాలంటే వణుకుపుడుతోంది’ అంటోంది అమాయకంగా మయూరి.

గణాంకాల ప్రకారం 2020లో దేశంలో జారీచేయబడిన కోటీ ఐదు లక్షల డ్రైవింగ్‌ లైసెన్సుల్లో కేవలం 14.9 శాతమే మహిళలు పొందారు. సమాజంలో లోతుగా పాతుకుపోయిన లింగవివక్షను ఈ నిష్పత్తి ప్రతిబింబిస్తోంది. మహారాష్ట్రతో పాటు ఉత్తరాఖండ్‌ లాంటి రాష్ట్రాల్లో సఫారీ డ్రైవింగ్‌లో మహిళలు శిక్షణ పొందుతున్నారు. వందలాది మంది శిక్షణ తీసుకుంటే కొంతమందే విధుల్లో ఉంటున్నారు. ఆర్థిక లేమి, అనవసర భయాలు, వెక్కిరింపు మాటలు, వివక్ష నిండిన సమాజం ఈ మహిళలను వెనక్కి లాగుతున్నాయి. ఈ అవరోధాలన్నీ అధిగమించి ఆమె సాఫీగా ప్రయాణించాలంటే మరింత ప్రోత్సాహం కావాలి.

➡️