అల్లరి కోతి

Mar 5,2024 06:59 #Jeevana Stories, #Stories

సీతాపురం పొలిమేరలో ఒక సత్రం ఉంది. బాటసారులు బస చేయడానికి వసతి సౌకర్యాలతో పాటు, వండుకోవడానికి పాత్రలు, మూడు రాళ్ల పొయ్యిలు, తినడానికి కంచాలు, నీటికోసం పక్కనే చేద బావి అక్కడ ఉన్నాయి. బావికి ఆనుకుని ఒక రావిచెట్టు కూడా ఉంది. దాని మీద ఎప్పటి నుంచో చాలా కోతులు ఉంటున్నాయి. వాటిలో ఒక అల్లరి కోతి ఉంది. అది బాటసారులు తిన్న తరువాత కడిగి ఆరబెట్టిన కంచాలను, గరిటెలను ఎత్తుకెళ్లి బావిలో పడేసేది. తోటి కోతులు వద్దని ఎంత వారించినా ఆ కోతి వినేది కాదు. సత్రంలో పనిచేసే రామయ్య మూడు రోజులకు ఒకసారి బావిలో దిగి కోతి పడేసిన వస్తువులన్నింటినీ బయటకు తెచ్చేవాడు. ఒక రోజు రామయ్య ఆ అల్లరి కోతికి ఎలాగైనా బుద్ధి చెప్పాల్ని కొన్ని కంచాలను మండుతున్న మూడురాళ్ల పొయ్యి మీద పెట్టాడు. అల్లరి కోతి కోసం చెట్టు పక్కనే దాక్కుని చూశాడు. కోతి రానే వచ్చింది. ఒక కంచాన్ని పట్టుకుని కిచకిచమని విసిరేసింది. కాలిన చేతుల్ని పదే పదే చూసుకుంది. ఇంతలో రామయ్య ఆ కోతిని ఒడుపుగా పట్టుకుని గిన్నెలో సిద్ధంగా ఉంచిన వెన్నను తీసి రెండు చేతులకు రాశాడు. ‘నిన్ను బాధ పెట్టాల్ని నేను ఈ పని చేయలేదు. నీకు బుద్ధి రావాలని ఇలా చేశాను నన్ను క్షమించు’ అన్నాడు. ఆ తరువాత మిగిలిన వెన్నను కోతికి తినిపించాడు. తనకు నష్టం కలిగించినా తన పట్ల రామయ్య చూపిస్తున్న ప్రేమకు కోతి ఎంతో సిగ్గుపడింది. కొద్దిసేపటికి దాని రెండు చేతుల బాధ తగ్గింది. హుషారుగా పరుగు తీసి రావి చెట్టు ఎక్కింది. అది మొదలు ఇంకెప్పుడూ ఆ కోతి పాదచారులు ఆరబెట్టిన సామానును బావిలో వేయలేదు. రామయ్యతో చెలిమి చేసి సంతోషంగా ఉంది.

– యు.విజయశేఖర రెడ్డి, 99597 36475.

➡️