మెదడు, నరాలకు ఆధునిక శస్త్ర చికిత్సలు

Feb 7,2024 10:40 #feature

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఉరుకులు, పరుగుల జీవితాలను గడుపుతున్నారు. ఉద్యోగమో, వ్యాపారమో, లేదా వివిధ వృత్తుల్లో ఉంటున్న వారు తమ ఆరోగ్యంపై పెద్దగా దృష్టి సారించటం లేదు. ఏదో రూపంలో ఒత్తిళ్లకు గురై అనారోగ్యం పాలౌతున్నారు. కొంతమంది మెదడుకు సంబంధించిన వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. మెదడు, నరాల సమస్యలతో బాధపడేవారికి నేడు ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. తద్వారా ఎలాంటి క్లిష్టమైన న్యూరో సమస్యలనైనా సులభంగా తొలగించుకోవచ్చు.

                   మెదడు మానవ శరీరంలోని అత్యంత ముఖ్యమైన భాగం. దీని ద్వారా జ్ఞాపకశక్తి, స్పర్శ, దృష్టి, సహజ నైపుణ్యాలు, భావోద్వేగాలు, ఆలోచన, శ్వాస, ఆకలి, శరీరాన్ని సమతుల్యం చేసే అన్ని ప్రక్రియల వంటి ప్రధాన నియంత్రణలను కలిగి వుంటుంది. న్యూరో అనేది నరాలు లేదా నాడీ వ్యవస్థ కలయికను సూచిస్తుంది. చూపు, వాసన, మాట్లాడటం దగ్గరనుంచి ప్రతిదాన్నీ మన నాడీ వ్యవస్థ నిర్వహిస్తుంది. అయితే మానవ జీవన శైలిలో మార్పులు, ఉరుకులు, పరుగుల జీవనంతో నేడు నాడీ సంబంధిత సమస్యలు చాలామందిలో ఎక్కడో ఒకచోట కనిపిస్తుంటాయి. నరాల వ్యాధులు, నరాల బలహీనత వంటివి మనిషిని కృంగదీసే సమస్యలు. ట్యూమర్ల (కణతులు)లో చాలా రకాలున్నాయి. అయితే మొదటిది హానికరం కాని ట్యూమర్లు (బినైన్‌), రెండోది హానిచేసే ట్యూమర్లు (మాలిగెంట్‌). రెండోరకం ట్యూమర్లే క్యాన్సర్‌ వ్యాధులకు దారితీస్తాయి. సర్జరీ ద్వారా మెదడులో కణతులను తొలగిస్తారు. మెదడులో కణితి (ట్యూమర్‌) ఏర్పడినా భయపడాల్సిన పనిలేదు. అయితే మొదట్లోనే గుర్తిస్తే కొన్ని పూర్తిగా నయం చేయొచ్చు. ముదిరితే నియంత్రణకు కొంత సమయం పడుతుంది.

అప్రమత్తత అవసరం

                      బ్రెయిన్‌లో మెటాస్టాటెక్‌ ((పైమరీ, సెకండరీ), కార్బినోమేటస్‌ మెనింజైటిస్‌ సెకండరీ ట్యూమర్లు కూడా ఎక్కువగా కన్పిస్తున్నాయి. పెద్దవారిలో ఎక్కువగా మెదడు కణితుల్లో దాదాపు 60 శాతం ఇలాంటివే ఉంటున్నాయి. చిన్న పిల్లల్లో గ్రేడ్‌-1 నుంచి గ్రేడ్‌-4 వరకూ అన్ని రకాల ట్యూమర్లు కనిపిస్తాయి. మెదడులో కణితి ఉన్నంత మాత్రాన క్యాన్సర్‌ కానవసరం లేదు. మామూలు కణితులూ ఉండొచ్చు. శస్త్ర చికిత్స చేయకపోతే స్టిరియో టాక్టిక్‌ రేడియేషన్‌ అవసరం. శస్త్ర చికిత్స కూడా అవసరమే. మందులతో మెడికల్‌ ట్రీట్‌మెంట్‌ కూడా ఉంది. పీయూష (పిట్యూటరీ) గ్రంథిపై తలెత్తే మామూలు కణితులు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. కాళ్లు చేతులు బాగా పెరిగిపోయి, పొడువుగా అవుతుంటారు. (యాక్రోమెగాలే), పీయూష గ్రంథి వెనుకాల కణితుల మూలంగా మగవారిలో, ఆడవారిలో రొమ్ముల్లో నుంచి పాలు రావొచ్చు.

నిర్ధారణ, చికిత్స

                    క్యాన్సర్‌ను అనుమానిస్తే ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయాల్సి వుంటుంది. ఒక్క కణితులతోనే కాదు. మెదడులో క్షయ, ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లతోనూ ఫిట్స్‌ రావొచ్చు. రక్తనాళం చిట్టి రక్తం గడ్డకట్టినా ఫిట్స్‌ రావొచ్చు. ఇంటి సమస్యలేమైనా ఉన్నాయేమో తెలుసుకోవటానికి ఎంఆర్‌ఐ విత్‌ స్పెక్ట్రోస్కోపీ చేస్తారు. కణితి నుంచి చిన్న ముక్కను తీసి పరీక్షిస్తారు. (బయాప్సీ). క్యాన్సర్‌ ఉంటే నిర్ధారణ అవుతుంది. కణితి చాలా లోతులో ఉంటే (బ్రెయిన్‌స్టెమ్‌గ్ల్రయోమాల వంటివి) బయాప్సీ చేయటానికి మాత్రమే కుదురుతుంది. పూర్తిగా తీసివేయటానికి సాధ్యం కాదు. అలాంటి పరిస్థితుల్లో రేడియేషన్‌ కీమోథెరపీ వంటివి అవసరమవుతాయి. మెదడు కణతులకు ఇచ్చే కీమో థెరపీ, మందులు ప్రత్యేకమైనవి.

కణితల తొలగింపు కష్టమే !

                 మామూలు కణితులు శస్త్ర చికిత్సతోనే నయం అవుతాయి. కానీ క్యాన్సర్‌ కణితలకు కీమోథెరపీ, రేడియో థెరపీ అవసరమవుతుంది. మామూలు కణితులు మళ్లీ వచ్చే అవకాశం తక్కువ. కాకపోతే 10 శాతం తిరిగి రావొచ్చు. కానీ క్యాన్సర్‌ కణితులను పూర్తిగా తొలగించటం, నివారించటం సాధ్యం కాదు. అందుచేత రేడియేషన్‌ కీమో థెరపీ ఇస్తారు. రోగులు ఎవరైనా కణితుల సమస్యలు ఉంటే ఆందోళన చెందకుండా అవగాహన పెంపొందించుకుని నిపుణులైన వైద్యుల వద్ద చికిత్స చేయించుకుంటే ఎలాంటి కణితి సమస్యలైనా సులభంగా తగ్గించుకునే వీలుంది.

కెజిహెచ్‌లో 24 గంటలూ ట్రామా కేర్‌

                  విశాఖపట్నంలోని కింగ్‌జార్జి ఆసుపత్రిలో 24 గంటలపాటు ట్రామా కేర్‌ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. చాలా ప్రయివేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో లేని అత్యంత అధునాతన న్యూరో సర్జికల్‌ యూనిట్‌ ఇక్కడ అందుబాటులో ఉంది. సంక్లిష్టమైన బ్రెయిన్‌ ట్యూమర్‌ సర్జరీలు నూతన పద్ధతుల్లో అందిస్తున్నాం. మెదడు అన్యూరిజం శస్త్ర చికిత్సలు కూడా ఉన్నాయి. ఫేషియల్‌ పెయిన్‌ సిండ్రోమ్స్‌ (ట్రైజెమినల్‌ న్యూరల్జియా, గ్లోసోఫారింజియల్‌ న్యూరల్జియా), మైక్రో వాస్కులర్‌ డికంప్రెషన్‌ సర్జరీలు అరుదైనవి. తల, వెన్నెముకకు గాయమైతే 24 గంటలపాటు ట్రామా సర్వీసులు అందిస్తున్నాం. స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ న్యూరో సర్జికల్‌ ఆపరేటింగ్‌ మైక్రో స్కోప్‌లు వంటి అధునాతన పరికరాలు (జీస్‌, మోల్లెర్‌విడెల్‌, లైకా)లతో వైద్య సేవలు అందిస్తున్నాం. హైస్పీడ్‌డ్రిల్స్‌ (మెడ్‌ట్రానిక్స్‌, స్త్ట్రెకర్‌), కూసా వంటి కణితి కట్టింగ్‌ సదుపాయాలుగా కూడా అందుబాటులో ఉన్నాయి. కార్ల్‌ స్టోర్జ్‌ మెదడు ఎండోస్కోపిక్‌తో కూడా చిత్ర చికిత్సలు అందిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ ఆసుపత్రికి వచ్చి నాణ్యమైన వైద్య సేవలు పొందొచ్చు.

– డాక్టర్‌ బి. హయగ్రీవరావుప్రొఫెసర్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఆఫ్‌ న్యూరో సర్జరీ,కింగ్‌ జార్జి ఆసుపత్రి, ఆంధ్రా మెడికల్‌ కళాశాల, విశాఖపట్నం.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • మంచి ఆహారపు అలవాట్లు పాటించాలి
  • మెదడుకు శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. జ్ఞాపకశక్తి చురుగ్గా ఉండేలా చూసుకోవాలి.
  • శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
  • వీలైనంతవరకూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.
  • ఒత్తిడులకు దూరంగా ఉండాలి.
  • మెదడు సమస్యలొస్తే న్యూరో సర్జన్‌ను సంప్రదించాలి.
  • న్యూరోవి చిన్న సమస్యలైనా నిర్లక్ష్యం వద్దు. పెద్దవి కాకుండా చూసుకోవాలి. తద్వారా శరీర వ్యవస్థ, మెదడుపై తీవ్ర ప్రభావం పడకుండా ఉంటుంది.
  • డాక్టరు సలహామేరకే చికిత్స పొందాలి. తద్వారానే త్వరగా కోలుకోవటానికి అవకాశం ఉంటుంది
➡️