అమ్మ చెప్పింది !

Dec 30,2023 10:18 #feature

           బడి గంట మోగింది. చకచకా పిల్లలు అందరూ బడి నుంచి ఇళ్ళకు బయల్దేరారు. రాజు, భీముడు, రాము కలిసి నడుస్తున్నారు. వీరు ముగ్గురూ మంచి స్నేహితులు. ‘అరేరు భీముడు! రేపు నా పుట్టిన రోజు’ అన్నాడు రాజు. దానికి భీముడు ‘అవునా? భలే భలే! అయితే రేపు నువ్వు మా అందరికీ చాక్లెట్లు ఇస్తావా? లడ్డూలు ఇస్తావా?’ అన్నాడు. భీముడికి లడ్డూలంటే చాలా ఇష్టం. రాజు ‘నేను చాక్లెట్స్‌, బిస్కట్స్‌ ఇస్తాను’ అన్నాడు. ‘నేను కూడా నా పుట్టిన రోజునాడు మంచి మంచి మిఠాయిలు ఇస్తాను’ అన్నాడు భీముడు.’మరి రామూ, నీ పుట్టిన రోజు నాడు నువ్వేం ఇస్తావు?’ అనడిగాడు రాజు, వారితో పాటుగా వస్తున్న రాముని. ‘నేను చాలా పెద్ద పెద్ద బహుమతులు ఇస్తాను. కాని ఇప్పుడు కాదు, కొంచెం పెద్దయిన తర్వాత’ అన్నాడు రాము. ‘అదేంటి? పెద్దయిన తర్వాత అంటున్నావు.మాకు అర్థం కాలేదు’ అన్నారు రాజు, భీముడు ఒకేసారి. దానికి రాము ‘నేను ప్రతి సంవత్సరం నా పుట్టిన రోజు నాడు ఒక మొక్క నాటుతాను. అవి పెద్దవైన తర్వాత పక్షులకు గూడులా, పశువులకు నీడలా, వర్షానికి గొడుగులా, ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టే అమ్మలా, నిరాశ్రయులకు, బాటసారులకు ఆశ్రయంలా ఉపయోగపడతాయి. నాతో మా అమ్మ ప్రతి సంవత్సరం నా పుట్టిన రోజునాడు ఒక మొక్క నాటిస్తుంది.” అని చెప్పాడు రాము. ఆ మాటలకు రాజు, భీముడు చాలా సంతోషపడ్డారు.”మేము కూడా మా పుట్టిన రోజునాడు ఒక మొక్క నాటుతాము.” అని అన్నారు. వెనుకే వస్తున్న ఉపాధ్యాయుడు వారి మాటలను విని, మరుసటి రోజు తరగతిలో అందరికీ చెప్పారు. పిల్లలందరూ రాముని అభినందిస్తూ చప్పట్లు కొట్టారు. ‘పిల్లలూ! మీరు కూడా ప్రతి పుట్టిన రోజునాడు ఒక మొక్క నాటండి. అది ఎంతో మంచి పని. ఎన్నో సమస్యలకు పరిష్కారం కూడి..” అన్నారు మాస్టారు.”ఓ … తప్పకుండా మాస్టారూ.. మేమూ మొక్కలను నాటుతాం. ప్రేమగా సాకుతాం.” విద్యార్థులు అందరూ ఒకేసారి అన్నారు, ముక్తకంఠంతో.- ధూళిపాళ్ళ లిఖిత్‌ సాయి, 6వ తరగతి,శ్రీ వేంకటేశ్వర బాల కుటీర్‌ పాఠశాల, గుంటూరు.

➡️