అమ్మకు ఇక ఏ కష్టం రాకూడదని …

Apr 18,2024 05:50 #feachers, #jeevana, #Jeevana Stories

గాలి, వాన నుండి, ఆకాశంలో ఎగిరే పక్షుల బెడద నుండి బిడ్డలను రక్షించుకునేందుకు తల్లి కోడి ఎంతలా ఆరాటపడుతుందో! బిడ్డలను కాపాడుకునేందుకు తన రెక్కలను ఎంత పెద్దగా విస్తరిస్తుందో చూస్తే, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నోరు లేని పక్షులు, జంతువులే బిడ్డలను కాపాడుకునేందుకు ఇంతలా తపన పడుతుంటే మన అమ్మలు ఇంకెంత కష్టపడతారో కదా! అలా తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఓ తల్లి తన బిడ్డలను ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేసింది. అంతర్జాతీయ అథ్లెట్‌ ప్రియాంక స్కిప్పర్‌, సోషల్‌ మీడియాలో ఇటీవల తన తల్లి గురించి, పిల్లల కోసం ఆమె పడ్డ కష్టం గురించి తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ఒంటరి తల్లిగా తన తల్లి పడ్డ అవమానాలు, అవహేళనల గురించి చెబుతూనే ఆమెకు తోడుగా నిలవడం కోసమే తాను క్రీడారంగాన్ని ఎంచుకున్నానని చెప్పారు ప్రియాంక.
ప్రియాంక కడుపులో ఉండగానే ఆమె తండ్రి చనిపోయాడు. తండ్రి జ్ఞాపకాలు ఏవీ లేకుండానే ఆమె బాల్యం గడించింది. అయితే, పెరిగి పెద్దవుతున్న ప్రియాంకకు తల్లి ఒక్కత్తే పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడడం ఎంతో ఆశ్చర్యంగా అనిపించేది.
”తన ఆరోగ్యం దెబ్బతిన్నా అమ్మ ఎందుకు పనికివెళుతుందో అర్థమయ్యేది కాదు. కొంచెం పెద్దయ్యాక ఈ విషయమే అమ్మని అడిగాను. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ప్రతి రోజూ హింస పెడుతున్నా పిల్లల కోసం ఆ బాధను భరించానని అమ్మ చెప్పింది. ఇద్దరు తోబుట్టువులు తరువాత నేను కడుపులో ఉన్నప్పుడే నాన్న చనిపోతే అత్తింటి వారు అమ్మను ఇంటి నుండి గెంటేశారు. పుట్టింటి వారి ఆదరణా లేదని అమ్మ చెప్పింది. అందుకే తన బిడ్డల కోసం ఇంతలా కష్టపడుతున్నానని చెప్పింది. ఆ మాటలు నా మనసులో బలంగా నాటుకున్నాయి. నేను పెద్దయ్యాక అమ్మకు ఏ కష్టం లేకుండా చూసుకోవాలనుకున్నాను. చదువొక్కటే అమ్మ కష్టాన్ని దూరం చేయదు. ఇంకేదైనా చేయాలి. అప్పుడే నాకెంతో ఇష్టమైన ఫిటెనెస్‌ వైపు అడుగులు వేశాను. స్కిప్పర్‌గా రాణించాను. విజయంతో నేను గెలిచిన ప్రతి అవార్డు అమ్మ కళ్లల్లో ఎనలేని సంతోషాన్ని తెచ్చిపెట్టింది” అంటూ ఎంతో భావోద్వేగంగా ప్రియాంక తన అమ్మ గురించి చెప్పుకొచ్చింది.
జాతీయ రోప్‌ స్కిప్పింగ్‌లో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్న ప్రియాంక, తన పేరు మీద మూడు అంతర్జాతీయ రికార్డులను కూడా సాధించింది. ఎనిమిది జాతీయ బంగారు పతకాలు సాధించిన ప్రియాంక, తన తల్లి గురించి ఇంకా ఇలా రాసింది.


”నాన్న చనిపోయిన తరువాత అమ్మ తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ బలవంతంగా గర్భస్రావం చేయాలని చూశారు. రెండో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారు. ఈ పరిస్థితుల్లో ఇంటి నుండి బయటికి రావడం తప్ప అమ్మకు మరో మార్గం లేదు. చిన్న ఉద్యోగం సంపాదించి, చాలీ చాలని జీతంతోనే మమ్మల్ని చదివించింది. చిన్నప్పుడు మేము ఇంటి నుండి బయటికి కూడా వచ్చేవారం కాదు. మా కోసం అమ్మ పడుతున్న కష్టం అర్థమయ్యాక, తనని ఎలాగైనా సంతోషపెట్టాలని చూశాం. మేం పెరిగి పెద్దయ్యేసరికి అమ్మ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. రెండు కిడ్నీలు పాడై అమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. జీవితంలో త్వరగా ఎదగాలని, అమ్మను సంతోషపెట్టాలని, చదువుతో పాటు మేము ఆటల వైపు కూడా దృష్టి పెట్టాం. డాడ్జ్‌బాల్‌లో అన్నయ్య జాతీయస్థాయిలో సత్తా చూపాడు. మొట్టమొదటి సారి అన్నయ్య విజయం సాధించినప్పుడు రూ.14 వేల క్యాష్‌ ప్రైజ్‌ ఇచ్చారు. ఆ రోజు అది మాకు చాలా పెద్ద మొత్తం. పతకాల కంటే ఎంతో విలువైనది కూడా! ఆ రోజునే నేను కూడా నిశ్చయించుకున్నాను. అమ్మకు సాయంగా నిలవాలంటే నేను కూడా క్రీడాకారిణిగా రాణించాలనుకున్నాను. రోప్‌ స్కిప్పింగ్‌లో సత్తా చాటాను. స్కాలర్‌షిప్‌లు సాధించాను. నేను గెలుచుకున్న బంగారు, వెండి, రజత పతకాలను అమ్మకు బహుమతిగా ఇచ్చాను” అంటూ సుదీర్ఘంగా తన తల్లి గురించి రాసుకొచ్చింది.
సోషల్‌ మీడియా వేదికగా డబ్బు ఆర్జన చేయొచ్చని తెలిసి, ప్రియాంక ఆ దిశగా కూడా ప్రయత్నించింది. మొదట టిక్‌టాక్‌ వీడియోస్‌ చేసి లక్షలాది అనుచరులను సంపాదించుకొంది. ”ఆ తరువాత దేశంలో టిక్‌టాక్‌ బ్యాన్‌ అవ్వడంతో ఒక్కసారిగా నిరుత్సాహపడిపోయాను. చాలా రోజులు కోలుకోలేదు. దాని ద్వారా వచ్చిన డబ్బులతో అమ్మను సంతోషపెట్టాలనుకున్నాను. ఫలితం చేతికందే దశలో అంతా వృథా అయింది. ఆ దిగులు చాలా రోజులు వేధించింది. అయితే స్నేహితులు ఇచ్చిన సలహాతో కొన్ని రోజులకే ఇన్‌స్టా వేదికగా నా అనుచరులను తిరిగి తెచ్చుకున్నాను. మాకు ఎవరి అండా లేదు. ఏ పెద్దలూ మమ్మల్ని ప్రోత్సహించరు. మా తోబుట్టువులందరం ఒకరికొకరు తోడుగా నిలబడతాం. అమ్మకు ఆసరా ఇవ్వాలనుకుంటాం. అమ్మే మా బలం. బలహీనత” అని పేర్కొంది.
”జీవితం చాలా చిన్నది. అది ముగిసిన రోజున పశ్చాత్తాప పడకుండా ఉండాలంటే సంపూర్ణవంతంగా జీవించండి” అంటూ తన ఫాలోవర్స్‌కి సూచించింది ప్రియాంక. విజయం సాధించిన ప్రతి ఒక్కరి వెనుకా కన్నీళ్లు తెప్పించే జీవితం ఒకటి ఉంటుందనడానికి ప్రియాంక జీవితం ఒక ఉదాహరణ.

➡️