పలు ప్రయోజనాల మునక్కాయ

Mar 26,2024 06:30 #feachers, #jeevana, #Munakkaya

వేసవిలో ఎక్కువగా లభించే కూరగాయల్లో మునక్కాయ ఒకటి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇవి విరివిగా లభిస్తాయి. ఈ చెట్టు వేరు నుంచి ఆకుల వరకూ అన్నీ ఉపయోగాలే. పోషకాలు కూడా ఎక్కువే. మునగ కాయలే కాకుండా ఆకులు కూడా చాలా బలమైన ఆహారం. ఆకులు కంటే కాయలను ఎక్కువగా కూరల్లో వాడుతుంటారు. కాయలతోపాటు పుష్పాలు, బెరడు, వేరు వంటి అన్ని భాగాల్లో ఔషధ గుణాలున్నాయి. వీటిలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వేసవిలో జీర్ణక్రియ వేగంగా పనిచేయటానికి దోహదపడతాయి. విటమిన్‌ ఎ, సిలతోపాటు కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంది. నిత్యజీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునగలో ఉంది. చాలావరకూ శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి. ఆకును కూడా కూరగా వండుకుని తినొచ్చు. పచ్చటి ఆకులను కొంచెం నీడలో ఎండబెట్టి పొడిచేసి నిల్వ వుంచుకోవచ్చు. అవసరమైనప్పుడు ఏడాది పొడవునా వాడుకోవచ్చు. సి విటమిన్‌ తప్ప మిగిలిన పోషకాలేవీ నశించవు. వంద గ్రాముల ఆకుల్లో కాల్షియం 440 మిల్లీ గ్రాములు, ఇనుము 0.85 మి.గ్రా, బీటా కెరోటీన్లు అధికంగా ఉంటాయి. ఆయుర్వేద వైద్య విధానంలో ఈ మునగకాయలు, ఆకులు, పువ్వులు, కాండం అన్నింటిలోనూ ఔషధగుణాలు అధికంగా ఉండటంతో ఎక్కువమంది వినియోగిస్తుంటారు.

  •  మన శరీరానికి అవసరమయ్యే మోనో సాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌కు సంబంధించి హైఓలిక్‌ యాసిడ్‌ను కలిగివుంటాయి
  •  మునగకాడలో పుష్కలంగా ఉండే సి విటమిన్‌ అనేక ఇన్ఫెక్షన్లతో పోరాడే లక్షణాలుంటాయి.
  • సీజనల్‌గా వచ్చే ముక్కు దిబ్బడ, చెవులు మూసుకుపోయినప్పుడు మునగకాడలను బాగా ఉడికించి ఆ నీటిని ఆవిరిగా పీల్చితే ఉపశమనం కల్గుతుంది. ఆస్తమాతోపాటుగా అనేక శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి.
  • కాల్షియం పుష్కలంగా ఉన్నందున ఎముకలను బలంగా ఉంచటా నికి సహాయపడతాయి. ఐరన్‌ రక్తహీనత లేకుండా కాపాడుతుంది.
  • మెగ్నీషియం, సెలీనియం, మ్యాంగనీస్‌ వంటివి ఆరోగ్యానికి సహాయపడతాయి.
  •  గర్భిణులకు నిస్సత్తువ, వాంతులు, తలతిరగటం నుంచి ఉపశ మనం కల్గిస్తుంది. ప్రసవ నొప్పులు సులభంగా వచ్చేలా చేస్తుంది.
  •  ప్రసవం తర్వాత బిడ్డకు సరిపడా పాలు పడాలంటే మునగాకును తరచుగా తింటుండాలి.
  •  ఆకుల్లో ఉండే విటమిన్‌ బి6, సియాసిన్‌, రెబోఫ్లేవిన్‌, ఫోలిక్‌ యాసియాసిడ్లు జీర్ణ వ్యవస్థ మెరుగుపడేందుకు దోహదపడుతుంది. డయేరియా, డైసెంట్రీ, జాండీస్‌ వంటి వాటికి విరుగుడుగా ఉంటుంది.
  •  మునగాకు రసాన్ని తీసుకోవటం వల్ల శరీర అవయవాలకు రక్త సరఫరా బాగా ఉంటుంది. -సూప్‌లాగా తీసుకుంటే రక్తాన్ని శుభ్రం చేయటంతోపాటు మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది.
  •  మూత్రనాళాల్లో మంట, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
  •  మునగ పువ్వులు, చిగుర్లు కూరగా వండుకని తింటే కీళ్ల జబ్బులు రావు.
  •  రక్తహీనత తగ్గి, హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది.
  •  ఎండబెట్టిన మునగాకు పొడిని తేనెతో కలిపి ప్రతిరోజూ భోజనానికి ముందు తీసుకుంటే అధిక బరువు తగ్గుతుంది.
  •  నెలసరి సక్రమంగా రానివారు, కాల్షియం తగ్గిన వారు చిన్న కప్పు పాలకు పెద్ద చెంచా మునగాకు రసం కలిపి రోజూ తీసుకుంటే సమస్యలు తగ్గుతాయి.
➡️