గవదబిళ్ళలు అంటువ్యాధే…

Jan 28,2024 09:44 #feature

దేశంలోని అనేక రాష్ట్రాల్లో గవద బిళ్లలు (పారా మిక్సోవైరస్‌) వ్యాధి వ్యాపిస్తోంది. చాలాకాలం తర్వాత మళ్లీ ఈ కేసులు విజృంభిస్తుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కొద్దిరోజులుగా మహారాష్ట్ర, తెలంగాణాలో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్న విషయం తెలిసిందే. ముంబై, హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తిస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా చలికాలంలోనే ఇవి వస్తుంటాయి. నవంబర్‌ నుంచి ఫిబ్రవరి మధ్య ఇవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది పిల్లలు దీని భారినపడుతున్నారు. సహజంగా గవదబిళ్లలు గొంతుకు రెండు వైపులా వస్తాయి. కానీ కొన్ని ప్రత్యేక కేసుల్లో ఇవి చెవులు, క్లోమం (పాంక్రియాస్‌), జననేంద్రియాల వద్ద కూడా వస్తాయి. కొన్ని జాగ్రత్తలతో ఈ వ్యాధి పిల్లల్లో వ్యాపించకుండా అరికట్టొచ్చు. అసలు గవద బిళ్లలు అంటే ఏమిటి? వాటి లక్షణాలు ఏమిటి? అనేది తెలుసుకుందాం.

వదబిళ్లలనేవి వైరల్‌ వ్యాధి. దగ్గు, జబులు, లేదా మాట్లాడేటప్పుడో ఈ వైరస్‌ పిల్లల శరీరంలోకి ప్రవేశిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. శీతాకాలంలో పిల్లల్లో కన్పించే అంటువ్యాధుల్లో ఇది కూడా ఒకటి. చెవులు కింద ముఖానికి ఇరువైపులా ఉన్న గవదల భాగంలోని లాలాజల గ్రంథులకు బాధాకరమైన వాపును కలిగించి బాధించే రుగ్మతే ఇది. గవదబిళ్ళలు ఒకటి లేదా రెండు గ్రంథులను ప్రభావితం చేయొచ్చు. ఫలితంగా లాలాజల గ్రంథులు ఒకటి లేదా రెండూ ఉబ్బుతాయి. ఈ వ్యాధి ప్రభావం 14 నుంచి 18 రోజుల వరకూ ఉంటుంది. వచ్చిన తర్వాత 7 నుంచి 10 రోజుల వరకూ ఉంటాయి. వ్యాప్తి ప్రారంభమైనప్పుడు అది టీకాలు వేయని వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా దగ్గరలో ఉండేవారికి వ్యాప్తిస్తుంది. ఇవి వస్తే ప్రధానంగా ఆరోగ్య సమస్యల్లో వినికిడిలోపం, మెదడువాపు, ఆర్కిటిస్‌, వృషణ, మెనింజైటిస్‌ వంటివి కనిపిస్తాయి.

పిల్లల్లోనే ఎక్కువ కేసులు

గవద బిళ్లలు వచ్చినప్పుడు ఒక్కోసారి రెండు వైపులా దవడలు వాపునకు గురౌతాయి. ఇలాంటి సమయంలో పిల్లలు ఏమీ తినలేరు. తాగలేరు, ఇది వారి జీర్ణ వ్యవస్థపైనా ప్రభావం చూపుతుంది. దీంతోపాటు జ్వరం, గొంతులో ఇన్ఫెక్షన్‌ కూడా కన్పిస్తాయి. బాలికల్లో పొత్తికడుపు నొప్పి కూడా ఉంటుంది. లక్షణాలు క్రమంగా కనిపిస్తాయి. రెండు వారాల్లో ఈ లక్షణాలు మాయమై రోగి సాధారణ స్థితికి వచ్చేస్తారు. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇవి తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇది సోకిన పిల్లలను బడికి పంపకుండా ఇంట్లోనే ఏకాంతంగా ఉంచాలనీ, లక్షణాలుంటే మాస్కు లేకుండా బయటకు పంపకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

వైరస్‌తో వ్యాప్తి

పారమిక్సో కుటుంబానికి చెందిన వైరస్‌ (సూక్ష్మజీవి)తో గడ్డలు ఏర్పడతాయి. వాతావరణంలో గాలిబిందువులతో గాలి ద్వారా ఈ సూక్ష్మజీవులు ముక్కులేదా నోటి ద్వారా మనుషుల శరీరాల్లోకి ప్రవేశిస్తాయి. చాలా వైరల్‌ వ్యాధుల్లాగేనే వీటికి కూడా ప్రత్యేకమైన చికిత్సేమీ లేదు. లక్షణాలను బట్టి డాక్టర్లు మందులు ఇస్తారు. దీంతోపాటు మల్టీ విటమిన్‌, మల్టీ మినరల్‌ టాబ్లెట్లు కూడా ఇస్తారు. వ్యాక్సిన్‌ వేసుకోవాలని సూచిస్తుంటారు. సాధారణ వ్యాధిలా భావించి ఇంట్లో వైద్యం చేయటం ఏమాత్రం సరికాదనీ, డాక్టరును సంప్రదించటమే మేలని పేర్కొంటున్నారు. ఈ వ్యాధి సోకిన 10 మందిలో ఒకరికి మెదడు వాపు వచ్చే అవకాశం ఉంది. ఈ రోగుల వీర్య కణాల ఉత్పత్తి తగ్గిపోవటం వల్ల భవిష్యత్తులో పిల్లలు పుట్టకపోవచ్చు. 20వేల మందిలో ఒకరికి చెవుడు కూడా వస్తుంది. 10 వేల మందిలో ఒకరు మరణించే అవకాశం ఉంది. ఈ వ్యాధి ఇతర వ్యక్తులకు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే వ్యాధి సోకిన వ్యక్తి తుమ్ముతున్నప్పుడు, దగ్గుతున్నప్పుడు నోటికి, ముక్కుకు అడ్డంగా చేతి రుమాలు ఉంచుకోవటం చాలా ముఖ్యం.

టీకాతో నివారించొచ్చు

దేశంలో ఏడాదికి లక్ష కంటే తక్కువ కేసులు వస్తుంటాయి. అరుదుగా వచ్చే ఈ వ్యాధిని టీకా ద్వారా నివారించొచ్చు. వైద్య నిపుణుల ద్వారా చికిత్సలు పొందాలి. నిర్ధారణలు కూడా అవసరమే. ల్యాబ్‌ పరీక్షలు లేదా ఇమేజింగ్‌ తరచుగా అవసరం ఉంటుంది. సులభంగా వ్యాపించే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. పానీయాలు పంచుకోవడం, పిల్లలను అదేపనిగా ముద్దులు పెట్టుకోవడం వల్ల లాలాజలం ద్వారా ఎక్కువగా వ్యాపిస్తుంది. రెండువారాల్లో తగ్గిపోతుంది. ఎంఎంఆర్‌ వ్యాక్సిన్‌ ద్వారా ఈ వ్యాధిని నివారించొచ్చు. నాన్‌ స్టెరాయిడ్‌ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్‌, అలాల్జేసిక్‌లను వాడొచ్చు.  – డాక్టర్‌ పి.శివశంకర్‌కింతలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పొందూరు మండలం, శ్రీకాకుళం జిల్లా.

➡️