జాతీయ జెండాతో సామరస్య ప్రచారం

Jan 26,2024 08:50 #campaign, #feature, #national flag, #Peace

                ఏలూరులో నివాసం ఉంటున్న షేక్‌ మాబు సుభాని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో పుట్టారు. ఆయన తల్లిదండ్రులు షఖినాబి, ఫరీద్‌ కూడా స్వాతంత్య్ర పోరాటాన్ని దగ్గరగా చూసిన వారు. వారి ఇంట్లో దేశభక్త వాతావరణం ఉండేది. తండ్రి ఫరీద్‌ కమ్యూనిస్టు భావజాలంతో ఉంటూ జనచైతన్యం కోసం బుర్రకథ చెప్పేవారు. స్వతహాగా టైలరింగ్‌ వృత్తిలో ఉండే ఆయన మిలటరీ దుస్తులు కుట్టేవారు. తల్లి షఖినాబి కూడా ఉర్దూ పండిట్‌. ఆరోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తీసుకోకుండా విస్సన్నపేట, మైలవరం, తిరువూరు వంటి ప్రాంతాలకు వెళ్లి నిరుపేదలకు చదువు చెప్పేవారు. అలాంటి ఇంట్లో పుట్టిన బిడ్డగా సుబాని చిన్నప్పటి నుంచే అభ్యుదయభావాలను అలవర్చుకున్నారు. బాలుడిగా ఉన్నప్పుడు జై ఆంధ్రా ఉద్యమంలో పాల్గొని పాటలు పాడేవాడు. పెద్దయ్యాక తండ్రిబాటలోనే టైలరింగ్‌ వృత్తిని ఎంచుకున్నారు. ఆయన ముగ్గురు కుమారులు. మొదట మల్లవల్లి, ఆ తర్వాత హనుమాన్‌ జంక్షన్‌లో పనిచేశారు. పిల్లలు పెద్దయ్యాక వారు స్థిరపడిన ఏలూరుకు మకాం మార్చారు.

26 ఏళ్లుగా జాతీయజెండాలు పంచుతూ…

               సుబానీకి కళలు, సంగీతం, సాహిత్యం ఎంతో ఇష్టం. ఆ ఆసక్తితోనే దేశభక్తిపరంగా పింగళి వెంకయ్య, సంగీతపరంగా ఘంటసాల వెంకటేశ్వరరావు, నటనాపరంగా అక్కినేని నాగేశ్వరరావులపై అభిమానం పెంచుకున్నారు. 2022 ఏప్రిల్‌లో ఘంటసాల శతజయంతి వేడుకను నిర్వహించారు. ఆగస్టు 15న భారత స్వాతంత్య్రానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా (ఆజాదికా అమృత మహోత్సవ్‌) నెక్సన్‌ కంపెనీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకకు 500 జెండాలను తయారు చేసి ఉచితంగా అందజేశారు. పింగళి వారసులను సన్మానించారు. స్కూళ్లు, కళాశాలలకు మరో 500 జెండాలు అందజేశారు. ఇంటింటికీ 1000 జెండాలను పంచారు. పింగళి వెంకయ్య చిత్రపటాలు, జెండాలతోపాటుగా 200కుపైగా కృష్ణాజిల్లా, ఏలూరు, అంబేద్కర్‌ కోనసీమ, తిరుపతి జిల్లాల్లో పంపిణీ చేశారు.

2023లో బాపులపాడు మండలం వేలేరులో జవహర్‌ నవోదయ విద్యాలయం వద్ద కొంతమంది దేశభక్తులు, మానవత సేవా సంస్థ సహకారంతో పింగళి వెంకయ్య విగ్రహ ప్రతిష్ట చేశారు. ఏటా ఆగస్టు రెండోతేదీన పింగళి జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తాను తయారు చేసిన జెండాలను ఆరోజు ఆవిష్కరించి, తరువాత పంపిణీ చేయడం అలవాటుగా పెట్టుకున్నారు. పింగళి వెంకయ్య, ఘంటసాల వెంకటేశ్వరరావు కుటుంబాలతో సుబానీ కుటుంబానికి అనుబంధం ఉంది. వారు మరణించిన తర్వాత ఆయా కుటుంబాలతో అనుబంధం కొనసాగించారు. పింగళి వెంకయ్యకు సరైన గుర్తింపు రాలేదని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని సుబానీ పేర్కొన్నారు. గత 26 సంవత్సరాలుగా ఈ విషయంపై ప్రచారం చేస్తున్నారు.

నాటకరంగంపై మక్కువ

దేశభక్తి, అభ్యుదయం, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి భావాలతో 200కుపైగా నాటిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు సుబానీ. ‘సమాజంలోని అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి’ అనే భావనతో ఈ ప్రదర్శనలు సాగేవి. ఎక్కడ కళాప్రదర్శనలు, పాటల పోటీలు జరిగినా వెళ్లి పాల్గొనేవారు.

పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు పేరుతో 2012లో స్వరపీఠం స్థాపించారు. ఘంటసాల జయంతి, వర్థంతులు ఏటేటా నిర్వహిస్తున్నారు. మహిళలకు ఉచితంగా టైలరింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఆసక్తి గల వారికి ఘంటసాల దేశభక్తి గేయాలను నేర్పుతున్నారు. మంచి సాంస్క ృతిక వాతావరణంతోనే దేశంలో శాంతి-కాంతి ఏర్పడతాయని ఆయన అంటారు. ఆయన వద్ద శిక్షణ పొందిన మహిళలు టైలరింగ్‌ వృత్తిలో సొంతంగా యూనిట్లు పెట్టుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు. ఆయన ఇచ్చిన శిఓనతో కళాకారులుగా రాణిస్తున్న వారూ ఉన్నారు. ఘంటసాల ఆణిముత్యాలు, దేశభక్తి గేయాలు, ప్రబోధ గీతాలను ప్రత్యేకంగా వేదికలపై ఆయన ఆలపిస్తుంటారు.

పలు సత్కారాలు

జాతీయ జెండాలతో సామరస్య భావాన్ని పెంపొందింపజేస్తున్న సుభానిని గుర్తించి పలు ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు అవార్డులు, పురస్కారాలు ప్రదానం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వ సృజనాత్మకత, కళా సంస్థ ఆధ్వర్వాన ఎబికె అబ్దుల్‌ కలాం పురస్కారాన్ని మంత్రి ఆర్‌కె రోజా అందజేశారు. కరోనాలో 6 వేల మందికి మాస్కులు, సబ్బులు, బిక్కెట్లు, శానిటైజర్లు వంటివి పంపిణీచేసినందుకు ప్రౌడ్‌ ఇండియా సంస్థ కరోనా సేవక్‌ పురస్కారం అందించింది. 2021లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా కళాకారుడిగా సత్కారం అందుకున్నారు. – యడవల్లి

➡️