శీతాకాలంలో గుండె జర భద్రం!

Jan 22,2024 08:18 #feature, #health, #heart attack

శీతాకాలంలో చలి వల్ల వచ్చే వ్యాధుల్లో గుండె సంబంధితమైనవి కూడా సింహభాగంలోనే ఉంటున్నాయి. మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవం గుండె. శరీరానికంతటికీ రక్తాన్ని సరఫరా చేయటంతోపాటుగా అనేక రకాల విధులను గుండె నిర్వర్తిస్తుంది. దాని నిర్వహణతీరుపైన ఒత్తిడి పెంచితే ప్రమాదం బారిన పడతాం. సరైన ఆహారపు అలవాట్లు, మెరుగైన జీవనశైలి, ప్రశాంతమైన వాతావరణంలో ఉండగలిగితే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరబోవు. చలికాలంలో శరీర ఉష్ణోగ్రతను సమతౌల్యం చేయడానికి గుండె ఎక్కువ పనిచేయాల్సి వుంటుంది. హృదయ నాళ వ్యవస్థ బలహీనంగా ఉంటే గుండె ఎక్కువగా శ్రమపడినప్పుడు సమస్య పెరుగుతుంది.

సాధారణంగా 45 ఏళ్లు పైబడిన పురుషులు, 55 ఏళ్లు పైబడిన మహిళలు గుండె జబ్బులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇలాంటి సమస్యలే కుటుంబంలో ఉంటే మిగతా వారికి కూడా వచ్చే అవకాశం ఉంది. తాజా గణాంకాల ప్రకారం ఏటేటా హృద్రోగ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుంది.చాలా సందర్భాల్లో గుండెపోటు ఉదయం 4 నుంచి 7 గంటల మధ్య వస్తుంది. వేసవి కంటే శీతాకాలంలోనే ఈ కేసులు ఎక్కువగా ఉంటాయి. చలితో గుండె ధమనులు కుంచించుకుపోవటం కూడా ఒక కారణం. బీపీ పెరిగినా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని గమనించటం ద్వారా కొన్ని వైద్యపరమైన పద్ధతులను అనుసరించటం ద్వారా నివారించొచ్చు. కొన్ని జాగ్రత్తలుగుండె సమస్యలు ఉన్నవారు ఈ మరింత జాగ్రత్తగా ఉండాలి. తాజా పండ్లు, కూరగాయలు, విత్తనాలు, కాయలు, చిక్కుళ్లు, పప్పుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. ఆల్కాహాల్‌ చర్మంలోని రక్త నాళాలకు విస్తరించి, శరీరంలోని ముఖ్యమైన అవయవాల నుంచి వేడిని తీసుకుంటుంది. ధూమపానం గుండె వైపు ఆక్సిజన్‌ ప్రవాహాన్ని తగ్గిస్తుంది. హదయ స్పందన రేటు, రక్తపోటును పెంచుతుంది. ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోవడం వల్ల రక్త నాళాలు సంకోచిస్తాయి. గుండెపై అదనపు ఒత్తిడి పెరిగి ఆక్సిజన్‌ సరఫరా తగ్గుతుంది. కాబట్టి తగిన ఉష్ణోగ్రత ఉన్న గదుల్లో ఎక్కువ గడపాలి. శరీర ఉష్ణోగ్రత 95 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే, గుండె కండరాలకు హాని కలిగించే అల్పోష్ణస్థితికి గురవుతారు. చల్లని వాతావరణంలో ఎక్కువ సమయాన్ని గడిపేవారు, రక్తపోటు, డయాబెటిస్‌, అధిక కొలెస్ట్రాల్‌ సమస్యలున్నవారు, ధూమపానం, పొగాకు తీసుకునే వారికి ఈ స్థితి ఇబ్బందికరం. వైద్యపరీక్షలు ముఖ్యమే …గుండెపోటుకు ప్రధాన కారణం గుండెకు దారితీసే రక్తనాళాల్లో అడ్డుపడటం. ఇలాంటివి ముందుగానే గుర్తించేందుకు ఏడాదికి ఒకసారైనా పూర్తి శరీరాన్ని టీఎంటీ అనే ట్రెడ్‌ మిల్‌ టెస్ట్‌ చేయించుకోవటం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. గుండె జబ్బులు, స్ట్రోక్‌, కార్డియోవ్యాస్కులర్‌ వంటి ప్రమాద కారకాలను ఈ టెస్ట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ధూమపానం చేయటం, శారీరక శ్రమ చేయకపోవటం, అధిక బరువు కూడా గుండె వ్యాధులకు దోహదం చేస్తాయి. హృదయ ఆరోగ్యానికి దోహదపడే వాటిలో కొలెస్ట్రాల్‌, రక్తపోటు, గ్లూకోజ్‌ నియంత్రణ ముఖ్యం. గుండె సంబంధిత వ్యాధుల్లో స్ట్రోక్‌, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు, రిథమ్‌ డిజార్డర్లు, సబ్‌క్లినికల్‌ అథెరోస్క్లెరోసిస్‌, కరోనరీ హార్ట్‌ డిసీజ్‌, హార్ట్‌ ఫెయిల్యూర్‌, హార్ట్‌ డిసీజ్‌, సిరల వ్యాధి, ఫెరిఫెరల్‌ ఆర్టరీ డిసీజ్‌ వంటివి కూడా ఉంటాయని చెబుతున్నారు. హృదయ సంబంధిత వ్యాధులుమనిషి సగటు జీవితకాలంలో గుండె సుమారుగా 2.5 మిలియన్‌సార్లు కొట్టుకుంటుందని అంచనా. అంటే రోజుకు సుమారు లక్షసార్లు కొట్టుకుంటుంది. పురుషులతో పోల్చితే మహిళల్లో గుండె కొట్టుకోవటం చాలా వేగంగా ఉంటుంది. ఆడవారిలో నిముషానికి 78 సార్లు, మగవారిలో 70 సార్లు గుండె కొట్టుకుంటుంది. రోజుకు 7200 లీటర్ల రక్తాన్ని శరీరం మొత్తానికి గుండె పంపిణీ చేస్తుంది. మనిషి తన సాధారణ జీవితంలో సుమారు మూడు ఆయిల్‌ ట్యాంకర్ల కన్నా ఎక్కువ మొత్తంలో రక్తాన్ని అవయవాలకు పంపిణీ చేస్తుంది. ఆందోళన వద్దు అవగాహనే ముద్దుఎవరైనా గుండె బలహీనపడిందని తెలియగానే భయం, బాధ, ఆందోళన వ్యాధిని మరింత తీవ్రం చేస్తాయి. కానీ అందుకు కారణాలు చికిత్స అవకాశాలు గురించి అవగాహన ఉన్నప్పుడు భయం బదులు భరోసా లభిస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • కనీసం వారానికి ఒకసారి బీపీని చెక్‌ చేసుకోవాలి.
  • పెరిగితే డాక్టరును సంప్రదించాలి.
  • బయటకు వెళ్లేటప్పుడు వెచ్చదనాన్నిచ్చే దుస్తులు ధరించాలి.
  • కొవ్వు, పిండి పదార్థాలను తగ్గించాలి.
  • ఊబకాయం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
  • క్రమం తప్పకుండా మందులు వాడాలి.
  • శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి.
  • ఉన్ని బట్టలు, టోపీలు, గ్లౌజులు, సాక్సులు ధరించాలి.
  • ఇండోర్‌ వ్యాయామాలను ఎంచుకోవాలి.
  • గుండెకు ఒత్తిడి కలిగించే వ్యాయామాలూ చేయొద్దు.
  • మద్యపానం, ధూమపానం పూర్తిగా మానేయాలి.
  • భోజనం, సూప్‌ వేడివేడిగా తీసుకుంటూ ఉండాలి.
  • ఉప్పు, చక్కెర బాగా తగ్గించాలి. జంక్‌ఫుడ్‌ పూర్తిగా మానేయాలి.
➡️