చెట్టు

Dec 4,2023 11:12 #Jeevana Stories

కరువును బాపే తరువును నేను

కల్పతరువై నీకు వరములిస్తాను

నరికినా నేను చిగురించుతూనే

బతుకుపై ఆశను కల్పించుతాను

 

మొలకనై నేను మురిపించుతాను

వృక్షమై నేను రక్షించుతాను

వైవిధ్యానికి ఆలంబనై నేను

జీవులన్నింటికీ బతుకునిస్తాను

 

అమ్మ చేత పాల బువ్వనౌతాను

నాన్న చేత కీలుగుర్రమౌతాను

అన్నయ్య చేతిలో వేణువై నేను

పాటనై నిన్నెప్పుడు పలకరిస్తాను

 

పొలమును దున్నగా నాగలౌతాను

రోగాలు బాపగా మందునౌతాను

కనువిందు చేసే పువ్వులుగ మారి

కడుపాకలి తీర్చే గింజలౌతాను

 

చల్లనీ గాలితో పలకరిస్తాను

పక్షులను ప్రేమగా సాకుతుంటాను

కొండకోనల్లో జంతుజాలాన్ని

కంటికి రెప్పలా కాపాడతాను

 

కరువును బాపే తరువును నేను

కల్పతరువై నీకు వరములిస్తాను! – రావిపల్లి వాసుదేవరావు,విజయనగరం, 94417 13136.

➡️