జైలు గోడల మధ్యలోంచి స్వేచ్ఛాస్వరం!

Apr 15,2024 09:24 #Jeevana Stories

గుల్ఫిషా ఫాతిమా … ఎంబిఎ పట్టభద్రురాలు, సామాజిక కార్యకర్త, చరిత్ర పరిశీలకురాలు. బిజెపి ప్రభుత్వం ప్రకటించిన వివాదస్పద పౌరసత్వ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన యువతి. నాలుగేళ్లుగా తీహారు జైల్లో అక్రమ నిర్బంధంలో ఉంది. అయినా, ఆమె అదరలేదు. బెదరలేదు. ఎత్తయిన జైలు గోడల మధ్య నుంచి తన బమ్మల ద్వారా, కవితల ద్వారా స్వేచ్ఛాస్వరాన్ని వినిపిస్తోంది. దేశానికి తన సందేశాన్ని పంపిస్తోంది.

2020లో ఢిల్లీ షహీన్‌బాగ్‌ ఆందోళనల్లో పోరాడుతున్న మహిళలకు మద్దతుగా నిలబడింది గుల్ఫిషా ఫాతిమా. ఆ సందర్భంగా కొంతమంది బిజెపి నాయకులు, మంత్రులు చేసిన విద్వేష ప్రకటనలు ఈశాన్య ఢిల్లీలో అల్లర్లను సృష్టించాయి. 54 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. కోట్లాది రూపాయల ఆస్తినష్టం జరిగింది. ఆ అల్లర్లకు సూత్రధారి గుల్ఫిషా ఫాతిమా అని పోలీసులు కేసులు బనాయించారు. 2020 ఏప్రిల్‌ 9వ తేదీన అరెస్టు చేశారు. ఆ కేసులో మే 13వ తేదీన కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఆ తరువాత కొద్దిరోజుల్లోనే పాలకులు ఆమె మీద మోపిన హత్య, అల్లర్ల కేసును దేశద్రోహం కేసుగా మార్చేశారు. కఠినమైన చట్టాన్ని ప్రయోగించి, ఆమెను కారాగారానికే పరిమితం చేశారు. బనాయించిన కేసుపై ఇప్పటివరకూ ఏ ఆధారమూ లేదు. ఎలాంటి విచారణా లేదు. నాలుగేళ్ల నుంచి ఆమె తీహారు జైల్లోనే మగ్గుతోంది. డెబ్బరు ఐదేళ్ల స్వాతంత్య్ర భారతంలో ప్రజాస్వామ్యం ఇంత ఘనంగా వర్థిల్లుతోంది.
చురుకైన, తెలివైన విద్యార్థి

స్నేహితులు ముద్దుగా గుల్‌ అని పిలుచుకునే గుల్ఫిషా ఫాతిమా చిన్నప్పటినుంచీ చాలా చురుకైన అమ్మాయి. తెలివైన విద్యార్థి. అమ్మానాన్న ఢిల్లీలోనే ఒక జనరల్‌ స్టోర్‌ నడుపుతారు. గుల్‌కి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. పేరు అకిల్‌ హుసేన్‌. వారిది ఏ చీకూ చింతా లేని కుటుంబం. అంతా హాయిగానే గడిచిపోతుంది. గుల్‌ ఢిల్లీ యూనివర్సిటీలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసింది. తరువాత ఎంబిఎ కూడా పూర్తి చేసింది. సమాజానికి ఏదైనా మేలు చేయాలని తపన పడేది. బిజెపి ప్రభుత్వం వివక్షాపూరితమైన పౌరసత్వ చట్టాలను ముందుకు తెచ్చినప్పుడు – వాటి గురించి చాలా అధ్యయనం చేసింది. ఆ చట్టం నిండా వివక్ష ఉందని అర్థం చేసుకొంది. ఆ చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసన కార్యక్రమాల్లో పాల్గనటం మొదలు పెట్టింది.
ఢిల్లీ షహీన్‌బాగ్‌లో పెద్దఎత్తున మహిళలు సిఎఎ, ఎన్నార్సీ వ్యతిరేక నిరసనలు జరుపుతున్నప్పుడు ఆ శిబిరాల్లో తన మిత్రులతో కలిసి పాల్గంది. ఆ చట్టాల్లో ఉన్న వివక్ష గురించి, దురుద్దేశాల గురించీ మహిళలకు వివరిస్తూ మాట్లాడింది. రోజుల తరబడి ఆ నిరసనల్లో పాల్గంటూ, ఆ మహిళలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలు చేపట్టింది. వారికి ఇంగ్లీషు తరగతులు బోధించింది. వివిధ చట్టాల గురించి, హక్కుల గురించీ వివరించింది. చారిత్రిక విషయాలను విశదపరిచింది.
గుల్‌ అలాంటి పాత్ర పోషించటం బిజెపి ప్రభుత్వానికి ససేమిరా నచ్చలేదు. ఆ నిరసనలు చెక్కుచెదరకుండా అన్నన్ని రోజులు కొనసాగటం అసలే నచ్చలేదు. రకరకాల నిర్బంధాలూ, నీచ ప్రచారాలూ ప్రయోగించినా, మహిళల్లో స్ఫూర్తి ఇసుమంత కూడా తగ్గలేదు. తొంబై ఏళ్ల ముదుసమ్మలు కూడా క్రమం తప్పకుండా శాంతియుత నిరసనల్లో పాల్గనటం బిజెపి ప్రభుత్వానికి మింగుడు పడలేదు.
ఆ తరువాతి కొద్దిరోజులకే ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు మొదలయ్యాయి. బలవంతాన నిరసన శిబిరాలను తొలగించారు. గుల్‌ మీద, ఇతర సామాజిక కార్యకర్తల మీదా పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. 2020 ఏప్రిల్‌ 9వ తేదీన గుల్ఫిషా ఫాతిమాను అరెస్టు చేశారు. ఏవేవో నిషేధిత సంస్థలతో సంబంధాలు ఉన్నట్టు ప్రచారం చేశారు. ఉగ్రవాద నిరోధక చట్టం – ఉపా కింద కఠినమైన సెక్షన్లు ప్రయోగించారు. తీహార్‌ జైల్లో బంధించారు. బెయిలు కోసం ఆమె పెట్టుకున్న పిటీషన్‌పై కూడా ఇంతవరకూ విచారణ చేపట్టలేదు.
చెక్కు చెదరని ధైర్యం

నాలుగేళ్ల నుంచి తీవ్ర నిర్బంధంలో ఉన్నప్పటికీ, ఆమె విశ్వాసం కోల్పోలేదు. అధైర్యపడలేదు. దేశ పాలకుల్లో ఎంత విద్వేషం ఉందో, ఎంత నిరంకుశత్వం పేట్రేగిపోతుందో తన నిర్బంధం ఒక ఉదాహరణగా పేర్కొంటోంది. గుల్ఫిషా ఫాతిమా మంచి చదువరి. భావుకురాలు. కవయిత్రి, చిత్రకారిణి కూడా. జైలు నాలుగు గోడల మధ్యా తనదైన ప్రపంచాన్ని సృష్టించుకొని, స్వేచ్ఛాకాశాన్ని కలలు కంటోంది. ఆ కలలను తన చిత్రకళ ద్వారా వెల్లడిస్తోంది. ఆమె గీస్తున్న బమ్మలు చేయి తిరిగిన ఆర్టిస్టును తలపిస్తున్నాయి. తాను కఠిన కారాగారంలో బందీ అయినప్పటికీ- తన బమ్మలకు రెక్కలు తొడుగుతోంది. శాంతిని, సామరస్యాన్ని అభిలషించే తెల్ల పావురాలను చిత్రిస్తోంది.
హిందీలో చక్కని కవిత్వం కూడా రాస్తోంది. నిరంకుశం, నిర్బంధం కూలిపోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తోంది. తెలుగులోకి అనువదించిన కొన్ని కవితలను ఇవి.
మరుపు
పరీక్షల కోసం నేను
చరిత్రనంతా బట్టీ పడతా
కానీ, ఎప్పుడూ తారీఖులు మర్చిపోతుంటా
ఇప్పుడు నేను
మిగిలినదంతా మర్చిపోయా
కేవలం తారీఖులు మాత్రమే గుర్తు పెట్టుకున్నా!
(చరిత్ర అంటే తారీఖులూ దస్తావేజులూ కాదన్నాడు మహాకవి శ్రీశ్రీ. చరిత్ర సారాంశమూ, దాని నిర్మాణంలో ప్రజల చైతన్యమే ముఖ్యం. కానీ, నిరంకుశ పాలకుల ఏలుబడిలో లెక్కలకు, కొలతలకే ప్రాధాన్యం ఉంటుంది మరి!)
చుట్టూ ఉన్న గోడలు
నా చుట్టూ ఉన్న నాలుగు గోడలు
ఇంత మౌనంగా ఉన్నాయేమిటి?
ఇంత కాలం ఇవి నెత్తి మీద
తుపానులు, ఈదురు గాలులు
మాడ్చేసే ఎండలు భరిస్తూ
ఎలా తట్టుకుని ఉన్నాయి
అయినా ఇవి నోరు ఎందుకు విప్పడం లేదు
లేదు.. ఇవి మాట్లాడతాయనుకుంటా …
గోడలు బీట్లిచ్చి, మట్టి పెళ్లలు, సుద్దలు రాలిపడినప్పుడు
ఇవి ఏదో చెప్తున్నట్లు ఉంటాయి
కానీ, యజమాని వచ్చి మరమ్మతులు చేయించి
వీటి నోళ్లు మూయించేస్తాడు
చిరాఖరికి ఏదో ఒక రోజు ఈ భారంతో
గోడలు కూలిపోతాయి
వాటి స్థానే మళ్ళీ కొత్తగా
మౌనం పాటించే గోడలే కడతారు!
(గోడలకు కూడా చైతన్యాన్ని ఆపాదిస్తోంది గుల్‌. అవి పెచ్చులూడిపోవడం, కూలిపోవడం వాటి నిరసనకు, స్వేచ్ఛాకాంక్షకూ నిదర్శనం అంటోంది.)
కటిక చీకటి రాత్రి
నిన్న రాత్రి చీకట్లో
జైలు తలుపుల మీద
ప్రేమించిన వారి ప్రతిధ్వనుల మాదిరిగా
మలయ మారుత పవనాల తాకిడి
మెరుపుల్లా
మమ్మల్ని విడుదల చెయ్యమనే డిమాండ్లతో కూడిన
అభ్యర్ధనల తాకిడులు
చిగురు కొమ్మల నిర్వేదం
ఎన్నో విఫల యత్నాల తర్వాత
నిగ్రహించుకోలేని జలతారు వర్షంలా
కన్నీటి ప్రవాహం
వెల్లువెత్తిన ఆరోపణల మాదిరిగా
నేల మీద చిందిన
నీటి బిందువుల శబ్దం
చెవులు వినపడని పాములు
విషపు కోరలు సాచి
పడగలు విప్పి మరీ
చేస్తున్న నఅత్యం
పిడికిలి బిగించిన పీడితులు
ఇంకా ఆ కటిక చీకటిలోనే మగ్గిపోతున్నారు!
(సహజమైన గాలిలో, వానలో, ఎండలో మానవీయమైన స్పందనను చూస్తోంది గుల్మిషా ఫాతిమా. అదే సమయంలో నిరంకుశులైన పాలక భుజంగాలకు అవేమీ వినబడ్డం లేదని విమర్శిస్తోంది. పిడికిలి బిగించిన పీడితుల నిర్బంధంపై ఆవేదన చెందుతోంది. స్వేచ్ఛాయుతమైన, ప్రజాస్వామికమైన వాతావరణాన్ని ఆకాంక్షిస్తోంది.)
ప్రశ్నను భరించలేని, ప్రజా చైతన్యాన్ని సహించలేని పాలకులకు ప్రజలే బుద్ధి చెప్పాలి. ఓటు అనే ఆయుధాన్ని అందుకోసం ప్రయోగించాలి. అప్పుడే అక్రమ, అన్యాయపు సంకెళ్లకు కనువిప్పు.
– శాంతిమిత్ర

➡️