ఈ వార్తలు ఇంతటితో సమాప్తం!

Apr 6,2024 06:10 #feachers, #Jeevana Stories

‘నమస్కారం. వార్తలు చదువుతున్నది..
మీ శాంతి స్వరూప్‌..
ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు..’ అంటూ 1980- 90 దశకాల్లో రాత్రి 7 గంటలకు దూరదర్శన్‌లో వినిపించే గొంతు మూగబోయింది. దూరదర్శన్‌ తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతిస్వరూప్‌ శుక్రవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. అప్పట్లో ఆయన చదివే వార్తలను వీక్షించేందుకు టీవీల ముందు జనసందోహం కనిపించేది. ఇప్పటి తరానికి ఇది విడ్డూరంగా అనిపించినా ఆనాటి తరానికి అదో మధుర జ్ఞాపకం.

టెలివిజన్‌ స్క్రీన్‌మీద తెలుగు వార్తలు చదివేందుకు ఓ వ్యక్తి వ్యాఖ్యాతగా కనిపించడం అదే తొలిసారి. అలా మొదలైన శాంతి స్వరూప్‌ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు. మరెన్నో ప్రశంసలు. అవార్డులు, సత్కారాలు, సన్మానాలకైతే లెక్కే లేదు. ప్రజల గుండెల్లో అంతలా నిలిచిపోయిన ఆయన, నేటి తరానికి అంతగా తెలియకపోవచ్చు. టెక్నాలజీ లేని కాలంలో ఓ అద్భుతానికి నాంది పలికిన గొప్ప దార్శనికుడిగా శాంతిస్వరూప్‌ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్నారు. టెలీ ప్రాంప్టర్‌ లేకుండా పదేళ్ల పాటు వార్తలు చదవడం మామూలు సంగతా మరి?!

కుటుంబం
శాంతి స్వరూప్‌ తండ్రి 1940ల కాలంలో అమెరికాలో ఇంజినీరింగ్‌ చదివారు. రోడ్‌ టెక్నాలజీ, సిటీ ప్లానింగ్‌లో ఎంఎస్‌ చేశారు. కృష్ణా జిల్లా నందిగామ తండ్రి స్వస్థలం. గుంటూరు జిల్లా బాపట్ల తల్లి స్వగ్రామం. దీంతో హైద్రాబాద్‌లో పుట్టి పెరిగినా శాంతిస్వరూప్‌ అచ్చమైన ఆంధ్రా తెలుగు మాట్లాడేవారు. ఆంధ్రవిద్యాలయంలో విద్యనభ్యసిం చారు. ‘ఆ స్కూలు తొలి విద్యార్థిని నేనే’ అని పలు ఇంటర్వ్యూలో చెప్పేవారు. స్కూలు విద్య నుండే నాటకాలు రాయడం, నటించడం ఆయన అభిరుచిగా ఉండేది. కాలేజీవిద్యకు వచ్చేసరికి, కవితలు రాయడం మొదలుపెట్టారు. ఇలా సాహిత్యరంగంలో తొలి అడుగులు వేసిన శాంతి స్వరూప్‌, ఆర్ట్‌ విద్యార్థి కాదు. సైన్స్‌ విద్యార్థిగా ఉత్తమ ప్రతిభ చూపేవారు.


చదువుకునే రోజుల్లో తను రాసిన ఓ కవిత గురించి ఆయన ఓ సందర్భంలో ఇలా చెప్పారు. ‘నీళ్లు నిద్రలేచినట్లు.. అని నేను ఓ కవిత రాశాను. దానర్థం ఏంటంటే.. సాఫీగా సాగిపోతున్న ప్రవాహానికి అడ్డుగా ఓ రాయి వేసినప్పుడు అది దాని దిశను పక్కకు తిప్పుకుంటుంది. అదే రాయి, ప్రవాహం సాగకుండా అడ్డుపడుతుంటే మాత్రం.. దాన్ని తోసుకుపోయేలా ప్రవాహం తన వేగాన్ని పెంచుకుంటుంది. ఆ ఉధృతి పెరిగి పెరిగి, రాయిని అడ్డు తొలగించుకుంటుంది. అలాగే సమాజంలో కూడా బలహీన వర్గాలను అణచివేయాలని చూసినప్పుడల్లా ముందు తలవొంచుకున్నట్లు కనపడినా, ఒకానొక సమయంలో వారు ఆ అణచివేతను అణగదొక్కేలా చైతన్యవంతమౌతారు. ఆ దెబ్బకు సమాజంలో మార్పు వస్తుంది. అదే నా కవితలో చెప్పాను’ అని తనలోని అభ్యుదయ భావజాలాన్ని ఓ చర్చలో ప్రస్తావించారు. అలాగే ‘కొత్త దారి’ అనే నాటకం రాసినప్పుడు ఎదురైన ఓ అనుభవాన్ని ఇలా పంచుకున్నారు. ‘రవీంద్ర భారతిలో ఆ నాటకాన్ని వేశాం. నేనే రాశాను. ఓ మధ్య తరగతి వ్యక్తి చాలా పిరికిగా జీవితాన్ని వెల్లదీస్తాడు. ఎదురు తిరిగితే సమాజం ఏమంటుందోనని భయపడతాడు. అతనిలో ధైర్యం నింపేలా, తన శక్తిసామర్థ్యాలు ఓ పాత్రతో తెలియజేసేలా నాటకం రాశాను. ఆ నాటకాన్ని ప్రముఖ కవి సి. నారాయణ రెడ్డి కూడా వీక్షించారు. మెచ్చుకున్నారు. అయితే అది విప్లవ రచనలా భావించి పోలీసులు నాటకం అయిపోయేంత వరకు అక్కడే ఉన్నారని, నా గురించి వాకబు చేశారని నాటకాన్ని వీక్షించిన ఎమ్మెల్యే నాతో చెప్పారు’ అని ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. బలహీన వర్గాల గురించి ఆలోచించడం, వాళ్లల్లో చైతన్యం నింపిన యువకుడిగా శాంతిస్వరూప్‌ గురించి తెలిసినవాళ్లు చాలా అరుదు.

ఆకాశవాణిలో …
1970ల కాలంలో ఆకాశవాణిలో ఏడాది పాటు పనిచేశారు. వాణిజ్య ప్రసారాల వ్యాఖ్యాతగా ఎంతో ప్రతిభ చూపినా ఆయన దృష్టి అప్పటికి ఇంకా రాని దూరదర్శన్‌పైనే ఉండేది. ఆకాశవాణిలో పనిచేస్తూనే ‘త్వరలో దూరదర్శన్‌ వస్తుంది. నేను అక్కడ పనిచేస్తాను’ అని పదేళ్ల ముందే స్నేహితులతో చెప్పేవారు. ‘ఇంగ్లీష్‌ సినిమాలు చూస్తున్నప్పుడు అందులో టీవీలు కనిపించేవి.
అవి మనదేశానికి కూడా వస్తాయని అనుకునేవాడ్ని. మన ప్రాంతంలో కూడా వాటిని వినియోగిస్తారని చెప్పినప్పుడు నా చుట్టూ ఉన్నవాళ్లు నన్ను పిచ్చివాడిగా చూసేవారు. ఆ తరువాత నా అంచనానే నిజమైంది. హైద్రాబాద్‌కి టీవీ వచ్చింది’ అని ఆయన చెబుతున్నప్పుడు కళ్లల్లో మెరుపు కనిపించేది.
తణికెళ్ల భరణి, సుబ్బరాయశర్మ, సుందరం, కోటా శ్రీనివాసరావు, బాబూ మోహన్‌, తెలంగాణ శకుంతల, బ్రహ్మానందం తదితరులు టెలివిజన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్న రోజులు కూడా ఆయనకి ఇప్పటికే గుర్తే. టెలివిజన్‌ ప్రారంభ కార్యక్రమాల్లో పలు ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరువచేసే సంధాన కర్తగా శాంతిస్వరూప్‌ వ్యవహరించారు. ఆ తరువాత వార్తా కార్యక్రమాలు ప్రారంభించాల్సిన సమయానికి వ్యాఖ్యాత పోస్టుకు ఇంటర్య్వూలు పిలిచారు. ‘ఒక్క పోస్టుకు మొత్తం 25 మందిమి పోటీపడ్డాం. రేడియో న్యూస్‌ రీడర్లు, సినిమా వాళ్లతో పాటు నేను కూడా ఆ పోస్టుకు దరఖాస్తు చేశాను’ అంటూ తన తొలినాళ్ల అనుభవాన్ని పంచుకున్నారు.

మొదటి వార్తా ప్రసారం..
‘1983 నవంబరు 14న బాలల దినోత్సవంపైనే తొలి తెలుగు వార్తా ప్రసారం మొదలైంది. ఎన్‌టి రామారావు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎల్‌బి స్టేడియంలో నిర్వహించిన ఆ కార్యక్రమం గురించి తొలిసారి టెలివిజన్‌ తెరపై వ్యాఖ్యానిం చాను. దాని తర్వాత బాలల చలన చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రెండో వార్తగా వ్యాఖ్యానించాను. రాత్రి 7 గంటల నుండి ఓ పది నిమిషాలు మాత్రమే ఆ వార్తలు ప్రసారమయ్యాయి. అలా మొదటి వార్తా ప్రసారంలో రెండు వార్తలే చది వాను. ఆ తరువాత వాటి సంఖ్య 10కి పెరిగింది.
ప్రముఖ సీనియర్‌ జర్నలిస్టులు వరదాచారి, పిఎస్‌ఆర్‌ ఆంజనేయశాస్త్రి, పి. రంగనాధరావు, దామోదర స్వామి, రామనాయుడు, ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ, వేమూరి వెంకట రమణ, పరకాల ప్రభాకర్‌ లాంటి జర్నలిస్టుల టెలివిజన్‌ అనుబంధాన్ని కూడా ఆయన ఓ సందర్భంలో గుర్తుచేసుకున్నారు.

ఇప్పుడే అందిన వార్త..
ప్రాంప్టర్‌ లేకుండా కంఠతా పట్టి వార్తలు చదివే శాంతిస్వరూప్‌, ప్రసారం మధ్యలో బ్రేకింగ్‌ న్యూస్‌ గురించి కూడా ప్రస్తావించేవారు. ‘ఇప్పుడే అందిన వార్త’ అంటూ ఆయన చదివే ఆ వార్తపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపేవారు. ‘అయితే ఓ సారి జరిగిన చిన్న పొరపాటు వల్ల చదవాల్సిన వార్త కాకుండా వేరే వార్త చదివాను. ఎన్‌టి రామారావు గారి భార్య బసవతారకం గారు మరణించారన్న వార్త అందించాల్సిన మా స్క్రిప్టు రైటర్‌ పేపరు తిప్పి ఇచ్చారు. దీంతో నేను అప్పుడే చదివిన వార్తను మరోసారి చదవాల్సి వచ్చింది. చదవాల్సిన వార్త మిస్‌ అయ్యింది. ఈలోపు టైం అయిపోయింది. అది నేను జీవితంలో మర్చిపోలేదు’ అంటూ నాటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నారు.
‘టెలివిజన్‌ అద్దం లాంటిది. అది మనల్ని స్పష్టంగా చూపిస్తుంది. అంటే నిజాన్ని ప్రతిబింబిస్తుంది. కానీ నేటి టీవీ రంగం అలా లేదు. కొత్త పుంతలు తొక్కుతోంది. వాస్తవాలు కనుమరుగవుతున్నాయి. అబద్ధాలు రాజ్యమేలు తున్నాయి’ అని ఓ సందర్భంలో శాంతిస్వరూప్‌ మాట్లాడుతున్నప్పుడు సమాజం పట్ల బాధ్యత గలిగిన వ్యక్తి మనకు కనిపిస్తారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, నేటి తరానికి ఆయన అందించిన స్ఫూర్తి మాత్రం ఎంతో దార్శనికమైనది.

సహచరి రోజారాణి నాట్యకారిణిగా ఎంతో ప్రతిభ చూపేవారు. దూరదర్శన్‌ రంగంలో కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. స్నేహితురాలిగా మొదలై భాగస్వామిగా మారిన తన భార్య గురించి శాంతి స్వరూప్‌ చాలా గొప్పగా చెప్పేవారు. ఐఐటి చదివి, విదేశాల్లో స్థిరపడిన ఇద్దరు కొడుకుల గురించి ఎప్పుడూ గర్వంగా చెప్పేవారు.

➡️