ఆ చిత్రాలు ఎరుపెక్కిన పిడికిళ్లు …

Dec 30,2023 10:40 #feature

పోరాటం చేస్తున్న పిడికిళ్లు, మర ఫిరంగులకు ఎదురొడ్డి బందూకులు చేబూనిన వనితలు, ఎర్రని గోచి ధరించి, బళ్లెంతో ఉరుకులు పెడుతున్న యువకులు, కారంపొడి, రోకళ్లందుకుని తిరుగుబాటు చేస్తున్న వారిని అంతమొందించిన యుద్ధభూమి, ఏరులై పారతున్న రుధిర భూమిలో ప్రాణాలు ఉన్నంతవరకు పోరాడుతున్న యోధులు… ఇలా ఒకటా రెండా ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట అనేక దృశ్యాలను తన చిత్రాల ద్వారా కళ్లముందుంచుతున్నాడు బరిగెళ్ల శ్రీనివాస్‌ అనే కళాకారుడు. ‘బాంబుల వర్షం కురిసినా బారు ఫిరంగులు మోగినా ఎత్తిన జెండా దించకోరు అరుణపతాకకు జై జై’ అంటూ ఆయన గీసిన చిత్రం నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఘట్టానికి సజీవసాక్ష్యం.

             తెలంగాణ నల్గొండ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ది రెక్కాడితో కాని డొక్కాడని కుటుంబం. తల్లి రోజుకూలీ, తండ్రి చిరు వ్యాపారి. పోస్టుగ్రాడ్యుయేట్‌ చేసినా ఉద్యోగం రాని నిరుద్యోగి అతను. ఇలాంటి స్థితిలోనే చరిత్రను చాటిచెప్పేందుకు తన కుంచెను ఝుళిపిస్తున్నాడు. లైవ్‌ షో ద్వారా ఆయన వేసిన చిత్తరువులు వేలాది మంది అనుసరిస్తున్నారు.

ఔరా అంటున్నారు.’కళ, కళ కోసం కాదు, ప్రజల కోసం’ అంటారు శ్రీనివాస్‌. సామాజిక సమస్యలపై అవగాహన పెంచడానికి కళను ఉపయోగించాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్నారు. ‘నాటి పాలకుల దౌర్జన్యాలను, రక్తమోడుతున్నా, ప్రాణాలు హరించుకుపోతున్నా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగిన రైతాంగ పోరాటాన్ని నా చిత్రాల్లో ప్రతిబింబించి ప్రజల్లో చైతన్యం కలిగించాలన్నదే నా లక్ష్యం. ప్రపంచంలోనే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని మించిన పోరాటం మరొకటి లేదు. ఆ చరిత్ర తెలియని ఈ తరం వాళ్లకి దాన్ని తెలియజేయడమే నా ఆశయం’ అని చెబుతున్నారు. నిజాం నవాబు అరాచకాలు, పేదోళ్ల వెతలు, పోరాట యోధుల సాహసాలు… ఆయన లైవ్‌ చిత్రాల్లో ప్రతిబింబిస్తాయి. గొప్ప సృజనకారుడైన శ్రీనివాస్‌ అనేక సామాజిక అంశాలపై కూడా తన కుంచెతో అవగాహన కల్పిస్తున్నారు.

బాలకార్మిక వ్యవస్థను ఉద్దేశించి ‘ఆడుకునే వయసులో అడుక్కునే ఆకలి’ అంటూ ఆయన చిత్రించిన హైద్రాబాద్‌ ట్రాఫిక్‌ కూడలిలో బూరలు అమ్ముకుంటున్న బాలిక చిత్రం సోషల్‌మీడియాలో పోస్టు చేసిన స్వల్ప కాలంలోనే వందలాది మందిని అనుసరించేలా చేసింది. ఇంకా బాల్య వివాహాలు, ఆకలి, పేదరికం, భ్రూణ హత్యలపై ఆయన వేసిన చిత్రాలు బాగా ప్రాచుర్యం పొందాయి. అలాగే సమాజాన్ని పీడిస్తున్న వ్యసనాల పట్ల కూడా ఆయన కుంచె కదిలించారు. ‘గుట్కా తాగకు, గుటుక్కు మనకు’ అన్న చిత్తరువు ఎంతోమందిని హెచ్చరించింది. మరెంతోమందికి కనువిప్పు కలిగించింది. భాషతో పనిలేకుండా భావం చెప్పే ఇలాంటి ఎన్నో చిత్రాలు శ్రీనివాస్‌ చిత్రించారు. ఇంత ఆదరణ ఉన్నా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఈ కళాకారుడు ప్రస్తుతం పొట్ట నింపుకోవడం కోసం రాజకీయ నాయకుల పోర్టైట్స్‌ని చిత్రిస్తున్నారు. ఫ్లెక్సీలపై పెయింటింగ్‌ బొమ్మలు ముద్రిస్తున్నారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లు, పోరాటాలు చాటిచెప్పే ఇలాంటి కళాకారులు చాలా అరుదుగా ఉంటారు. కళ కూటి కోసం కాదు.. ప్రజల కోసమని చాటిచెబుతున్న వారందరికీ మనసారా కృతజ్ఞతలు తెలియజేద్దాం.

➡️