ఎయిడ్స్‌ అంతం కోసం …

Dec 1,2023 10:07 #Jeevana Stories

భారతదేశంలో హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ వ్యాధి రాకముందే అగ్రదేశాలైన అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో ఆ వ్యాధి సోకిన రెండేళ్లకే పిట్టల్లా రాలిపోతుండేవారు. దీనికి విశాఖపట్టణానికి చెందిన అంతర్జాతీయ ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్‌ కూటికుప్పల సూర్యారావు-ఎంబిబిఎస్‌, ఎండి, పిహెచ్‌డి, ఎఫ్‌ఆర్‌సిపి, ఎఫ్‌ఎఎంఎస్‌, డిఎస్‌సి ఎంతో చలించిపోయారు. అక్కడి పిల్లలు, మహిళలు, వ్యాధిగ్రస్తుల పట్ల చూపిస్తున్న వివక్షపై తీవ్ర ఆందోళన చెందారు. మనదేశంలో అలాంటి పరిస్థితులు ఉండకూడదని భావించి పరిశోధనలు సాగించారు. నేడు ఒక్క ఇంజక్షన్‌ ద్వారా ఎయిడ్స్‌ తగ్గిపోయే మందులు వచ్చాయనీ, వ్యాధిగ్రస్తులు కూడా మామూలు వారి మాదిరిగా 80 ఏళ్లు వరకూ జీవించొచ్చునని చికిత్సల ద్వారా రుజువు చేస్తున్నారు. సొంతూరు శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కింతలి గ్రామం. అయితేనేం…ప్రముఖ సాంక్రమిత వ్యాధుల నిపుణుడిగా ఆయన విశాఖపట్టణం నుంచి ప్రపంచస్థాయి గుర్తింపు పొందారు. శుక్రవారంనాడు ప్రపంచ ఎయిడ్స్‌ నివారణా దినం సందర్భంగా ఆయన ప్రజాశక్తికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే…

             1981లో లాస్‌ ఏంజెల్స్‌లోనూ, న్యూయార్క్‌లోనూ పాతికేళ్లలోపు యువకులు ఆయాసం, విరోచనాలు, జ్వరంతో రెండేళ్లలోపే మరణించేవారు. ఇదే తంతు ఆఫ్రికాలోనూ కొనసాగింది. 1986లో మొట్టమొదటి పది హెచ్‌ఐవి కేసులు చెన్నైలో బయటపడే సరికే నేను ఈ మహమ్మారికి కారణాలు కనుగొనడంపై పరిశోధనలు చేస్తున్నాను. ఎయిడ్స్‌ వ్యాధిలాగే వ్యాపించే హెపటైటిస్‌ బి వ్యాధి రక్తం పాజిటివ్‌ వారితో లైంగిక సంపర్కం, కలుషిత సూదులు, పచ్చబొట్లు వేసుకునే సమయంలోనూ, ఆపరేషన్ల పనిముట్లు సరిగా స్టెరిలైజ్‌ చేయనప్పుడు వ్యాపిస్తుంది. పాజిటివ్‌ తల్లి నుంచి బిడ్డకు సోకుతుంది. ఆంధ్ర వైద్య కళాశాల కింగ్‌ జార్జి ఆసుపత్రి (విశాఖపట్టణం)లోని మైక్రో బయాలజీ విభాగం సహాయంతో నాటి వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ధనరాజ్‌, కెజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వీరభద్రయ్యల నుంచి అధికారికంగా అనుమతి తీసుకుని హెపిటైటిస్‌ బి వ్యాధిపైనా పరిశోధనలు సాగించాను. వివిధ విభాగాల లేబరేటరీల్లో పనిచేస్తున్న టెక్నీషియన్లు రక్తం, మూత్ర శాంపిళ్ల సేకరణకు సహకరించారు. ఆ పరిశోధనా పత్రాన్ని బ్రిటన్‌లోని మాంచెస్టర్‌ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో సమర్పించాను. అప్పటికే లండన్‌లో వేలాదిమంది యువకులు హెచ్‌ఐవికి గురైపోయి, దానితో ఒంటరి పోరాటం చేస్తున్న వారిని చూశాను. మాంచెస్టర్‌ ఆసుపత్రిలో హెచ్‌ఐవి వార్డు చూపించమని నేను అడిగితే అక్కడి స్టాఫ్‌ నర్సులు ఎంతో భయాందోళన ప్రదర్శిస్తూ చాలా దూరం నుంచే చూపించారు. వారి ప్రవర్తన నాకు చాలా వింతగా తోచింది. ఆ మరుసటి రోజే నేను ఆ యూనివర్శిటీ అతిథి గృహంలో ఓ పత్రిక చదువుతుంటే అందులో ఓ ఆర్టికల్‌ నన్ను ఆకర్షించింది. పాఠశాలలో ఏడేళ్ల విద్యార్థినిని తోటి విద్యార్థులు రాళ్లతో కొడుతున్నారు. ఎందుకనే ఆసక్తితో మొత్తం ఆర్టికల్‌ చదివాను. ఆ అమ్మాయి తల్లి పాజిటివ్‌ అయినందున తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి ఆ విద్యార్థిని టిసి ఇచ్చేయాలని ఆందోళన చేశారు. తల్లికి సమస్య అయితే ఏ పాపం ఎరుగని ఆ అమ్మాయిని కొట్టడం నా మనసును బాగా కదిలించివేసింది. బ్రిటన్‌ లాంటి అభివృద్ధి చెందిన దేశంలోనే హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ అంటే ఇంత వివక్షతో అంటరానిరోగుల్లా చూడటం తీవ్రంగా బాధేసింది. ఈ వ్యాధి భారత దేశానికి వస్తే బ్రిటన్‌తో పోల్చుకుంటే ఇక్కడ అక్షరాసత్య తక్కువ. మూఢ నమ్మకాలు ఎక్కువ. భారతదేశానికి రాగానే న్యూఢిల్లీలోని ప్రెస్‌క్లబ్‌లో హెచ్‌ఐవి/ఎయిడ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించేలా సందేశం ఇచ్చాను. దేశవ్యాప్తంగా కళాశాలలు, లయన్స్‌, రోటరీ లాంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారంతో అవగాహనా కార్యక్రమాల విస్తృతిని పెంచాను. నగరాల్లోని మురికివాడలు, గ్రామీణ ప్రాంతాల నుంచి గిరిజన తండాల వరకూ వందలు, వేలాదిగా ఎయిడ్స్‌పై అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు వ్యాధి వ్యాప్తి తీరు-నివారణా పద్ధతులుపై సవివరంగా వివరిస్తున్నాను.

అద్భుత ఫార్ములాలతో వైద్యం

1980వ దశకంలో ఎయిడ్స్‌ వ్యాధి మరణానికి మారుపేరు. 2023లో కూడా దీర్షకాలిక వ్యాధి మాత్రమే. ఎయిడ్స్‌ అని 72 గంటల్లో తేలితే పోస్టు ఎక్ప్లోజర్‌ ప్రొఫలాక్సిస్‌ (పెప్‌) మందులు 28 రోజులు వాడితే పూర్తిగా నెగెటివ్‌ చేసుకునే అద్భుత ఫార్ములాలు నేడు మనకు అందుబాటులోకి ఉన్నాయి. అలసత్వం, ఉదాసీనత లేకుండా షుగర్‌, బీపీ రోగులు వేసుకునే మాత్రలు మాదిరిగానే ఈ మందులు కూడా వేసుకోవాలి. రూ.30 ఖరీదు చేసే ఒక్క మాత్ర రోజూ క్రమం తప్పకుండా వేసుకుంటే ఎయిడ్స్‌ రోగులు కూడా 80 ఏళ్లపాటు ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా జీవించొచ్చు. కాబోయే భాగస్వాములకు, పుట్టబోయే బిడ్డలకు 99.9 శాతం వరకూ హెచ్‌ఐవి వ్యాపించకుండా నిరోధించే అధునాతన హార్ట్‌, కాక్టైల్‌, సాల్వెజ్‌ థెరపీ లాంటి ఎన్నో మందులు అందుబాటులోకి వచ్చాయి. రెండు, మూడు నెలలకు లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి కెబోటిగ్రావిర్‌ లాంగ్‌ ఎక్టింగ్‌ ఇంజక్షన్లు, రెండేళ్లు పైబడి పనిచేసే ఎఆర్‌టి ఇంప్లాంట్స్‌ ఆవిష్కరించటం ఓ గొప్ప శుభవార్త.

కిక్‌ అండ్‌ కిల్‌తో అంతం

2022 జూన్‌లో టైప్‌-బి తెల్లకణాల్ని జన్యుపరంగా మార్పులు చేసి ఇంజక్షన్‌ రూపంలో ఒకే ఒక్కసారి ఇవ్వటం వల్ల ఎయిడ్స్‌ వ్యాధికి శాశ్వత చికిత్స ఆవిష్కరణైంది. వీటితోపాటు రాక్ఫెల్లర్‌ పౌండేషన్‌ యాంటీబాడీ ఇంజక్షన్ల ఉపయోగం, కిక్‌ అండ్‌ కిల్‌ విధానం లాంటి అత్యాధునిక వైద్యం త్వరలోనే అందుబాటులోకి రానుంది.

చికిత్స-పరిశోధనలకు పద్మశ్రీ పురస్కారం

ఎయిడ్స్‌ రంగంలో విశ్వవ్యాప్తంగా శాస్త్రీయ అవగాహన పెంపొందించటం, వ్యాధిగ్రస్తులకు సంఘీభావం తెలపటానికిగాను ప్రపంచంలోనే అతిపెద్ద రెడ్‌రిబ్బన్‌ను ప్రదర్శించాను. ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా ఉప ప్రధానమంత్రి పేరునున్న రికార్డును బద్దలు కొట్టి గిన్నిస్‌బుక్‌ వరల్డ్‌ రికార్డు సాధించాను. ఈ రెడ్‌ రిబ్బన్‌ను లండన్‌లోని అనీఫీల్డ్‌ పుట్‌బాల్‌ స్టేడియంలో ఎయిడ్స్‌పై అవగాహన నిమిత్తం రెండేళ్లపాటు ప్రదర్శించారు. సుమారు 4000 మంది సెక్స్‌ వర్కర్ల పిల్లలు, బడుగు, బలహీన వర్గాల పిల్లల అభ్యున్నతి కోసం, ఉచిత వసతి, భోజనం, విద్య, వైద్యం వంటి సదుపాయాలు కల్పించాను. చాలామంది నేడు ఢిల్లీ, ముంబై, లండన్‌, జర్మనీ, అమెరికా లాంటి దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వైద్యరంగంలో చికిత్స-పరిశోధనా రంగాల్లో చేస్తున్న కృషికి గుర్తింపుగా 2008లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ గారు దేశంలోనే మూడో అత్యున్నత పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించారు. బ్రిటన్‌లోని ఎగువ సభ (హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌) మహాత్మా సన్మాన్‌ పేరుతో పురస్కారాన్ని అందజేసింది. – ఇంటర్వ్యూ : యడవల్లి శ్రీనివాసరావు

ప్రపంచ గుర్తింపు పొందిన డాక్టర్‌

హార్వర్డ్‌ యూనివర్శిటీ (యుఎస్‌ఎ), కేన్బరా యూనివర్శిటీ (ఆస్ట్రేలియా), కేలగరీ యూనివర్శిటీ (కెనడా) ఫెలోగా సుమారు 56 దేశాల్లో ఆయన ఎయిడ్స్‌ రంగంలో పరిశోధనా పత్రాలు సమర్పించారు. అమెరికా తెలుగు అసోయేషన్‌ (ఆటా) వారు చికాగోలో విశిష్ట పురస్కారంతో సత్కరించారు. బ్రిటీష్‌ మెడికల్‌ జర్నల్‌, డబ్ల్యుహెచ్‌ఒ, న్యూయార్క్‌ టైమ్స్‌, యాంటీ సెప్టిక్‌ (యుకె) వంటి ప్రఖ్యాత జర్నల్స్‌లో 120కి పైగా పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి. ఎనిమిది టెక్స్ట్‌బుక్స్‌లో హెపటైటిస్‌, రేబిస్‌, ఎయిడ్స్‌, డయాబెటీస్‌ వంటి వివిధ అంశాలపై ఆంగ్లంలో అనేక పుస్తకాల్లో చాప్టర్లు రాశారు. ఐఎంఎ కాలేజ్‌ (చెన్నై) జాతీయ ప్రొఫెసర్‌గానూ, ఆంధ్రా యూనివర్శిటీ హ్యూమన్‌ జెనెటిక్స్‌ విభాగానికి గౌరవ ప్రొఫసర్‌గానూ, ఇన్ఫెక్టిస్‌ డిసీజెస్‌ సొసైటీ ఆఫ్‌ అమెరికా సభ్యుడిగా ఉన్నాను. కింగ్‌ జార్జి ఆసుపత్రి, ఆంధ్రా మెడికల్‌ కళాశాలకు సంస్థాగత ఎథిక్స్‌ కమిటీ ఛైర్మన్‌గానూ పనిచేశాను. ఆంధ్రా యూనివర్శిటీ పాలకవర్గ సభ్యుడిగానూ, ఎపి ప్రభుత్వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా గతంలో పనిచేశాను.

➡️