‘ఐక్యత’తో విలువల పాఠం

Feb 23,2024 12:02 #feature

ప్రాథమిక దశ నుంచే విద్యార్థులకు మానవీయ విలువలు నేర్పిస్తే వారు మంచి పౌరులుగా రూపొందుతారు. విద్యాలయాల్లో అలాంటి ప్రయత్నం చేయటం ద్వారా విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యత, విలువలపై అవగాహన పెరుగుతాయి అంటున్నారు ఐక్యతా నేషనల్‌ ఫౌండేషన్‌ బాధ్యులు. పశ్చిమ గోదావరి జిల్లా కోపల్లె హైస్కూలులో పిల్లల్లో పరివర్తన తీసుకురావటానికి కృషి చేస్తున్నారు.

             పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కోపల్లె గ్రామంలోని మంతెన దుర్గరాజు రాజయమ్మ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల చిత్రలేఖన ఉపాధ్యాయుడు యలమర్తి శ్రీనివాసాచారి మదిలో వచ్చిన ఆలోచనే ఐక్యతా విభాగం. ఆయన తన ఆలోచనను మరికొందరితో పంచుకోగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేసి అవార్డులు, పురస్కారాలు పొందిన కొందరు పెద్దలు తోడయ్యారు. ఐక్యతా పౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థి స్థాయి నుంచి పిల్లలకు మానవీయ విలువలు నేర్పించాలన్న తలంపుతో మహాత్మాగాంధీ, అబ్దుల్‌ కలాం స్ఫూర్తితో ఐక్యత నేషనల్‌ ఫౌండేషన్‌ ఏర్పడింది. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో అవార్డులు సాధించిన ఉపాధ్యాయులు 18 సభ్యులతో 2022లో దీనిని ఏర్పాటు చేశారు. మొట్టమొదట ఉండి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల్లో జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్‌.వి.రమణ దీనిని ప్రారంభించారు. 6 నుంచి 9 తరగతులు చదువుతున్న 33 మంది విద్యార్థులకు భాగస్వామ్యం కల్పించారు. అధికారుల అనుమతితో 2022 బాలల దినోత్సవం నుంచి ఈ కార్యక్రమాన్ని ఆచరణలోకి తెచ్చారు. ఈ బృందంలోని విద్యార్థుల కార్యకలాపాలు స్ఫూర్తిదాయకంగా ఉండటంతో ఇతర పాఠశాలల్లోనూ అమలుకు పూనుకున్నారు.

సాంస్క ృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం

              కోపల్లె మంతెన దుర్గరాజు- రాజయమ్మ హైస్కూల్లో ఇటీవల పద్మభూషణ్‌ సుధామూర్తి పేరున గ్రూపు ప్రారంభించారు. వారు సాంస్క ృతిక కార్యక్రమాలు, చిత్రలేఖనం, మట్టి బొమ్మల తయారీ, గ్రీటింగ్స్‌ తయారీ తదితర అంశాలపై పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేస్తున్నారు. తెలుగు భాషా దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం, గురుపూజోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ పాఠశాలల్లో సేవా కార్యక్రమాలు, ప్రకృతి సేవ, సంరక్షణ కార్యక్రమాలు, మానవీయ విలువల అవగాహన కార్యక్రమాలు సాగుతాయి. ప్రతి ఆదివారం గ్రూపు సభ్యులైన విద్యార్థులు తమ గ్రామాల్లో సేవా కార్యక్రమాల్లో భాగంగా వృద్ధులు, పెద్దలకు పండ్లు పంపిణీ చేస్తున్నారు. పర్యావరణం, ప్లాస్టిక్‌ నిషేధం, నేత్రదానం తదితర అంశాలపై ప్రచారం చేస్తున్నారు. పెద అమిరం, వాండ్రం, కోపల్లె, జక్కరం గ్రామాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఆటపాటల్లోనూ ప్రావీణ్యత

              ఈ గ్రూపుల్లోని విద్యార్థులు చదువుతో పాటుగా ఆటపాటలు, కథలు చెప్పటం, నాటికలు, ఏకాపాత్రాభినయం తదితర సాంస్క ృతిక అంశాలు ప్రదర్శిస్తారు. పరిశుభ్రత, మొక్కల పెంపకంలో భాగస్వాములవుతారు. సెలవు రోజుల్లో యోగా, ధ్యానం, సంగీతం, నృత్యం వంటి అంశాల్లో నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నారు. బృంద నాయకత్వ బాధ్యతలను ప్రతి నెలా ఓ విద్యార్థికి అప్పగిస్తారు. వారు అందించే సేవల ఆధారంగా ఉత్తమ నాయకత్వ, సేవా క్రమశిక్షణ, అభ్యసన, నిజాయితీ విభాగాల్లో తల్లిదండ్రులు, ప్రముఖుల సమక్షంలో బహుమతులు అందిస్తున్నారు. తద్వారా విద్యార్థుల్లో మరింత ఆసక్తి కలుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.– గొట్టేటి శ్రీనివాసులు ప్రజాశక్తి విలేకరి, కాళ్ళ మండలం, పశ్చిమ గోదావరి జిల్లా

విలువలు నేర్పేందుకే … – ముదునూరి శివరామరాజు, ఐక్య నేషనల్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌

             ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందాను. మానవతా విలువలు నేటి సమాజంలో తక్కువగా ఉండటాన్ని గమనించాం. మా వంతుగా విలువలను పెంపొందించే కృషిని చేస్తున్నాం. ఆరో తరగతి నుంచే పిల్లలకు విలువల గురించి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

‘ఐక్యత’ మంచి ఆలోచన – దాయన చంద్రాజీ, కార్యదర్శి, ఐక్య నేషనల్‌ ఫౌండేషన్‌

           ప్రేమ, కృతజ్ఞతా జ్ఞానం, నిజాయితీ, సేవ, గౌరవం … ఇవన్నీ కూడా విద్యార్థులకు పాఠశాల స్థాయిలో నేర్పించాలి. ఐక్యతా ఫౌండేషన్‌లో ఉండే వారికి ప్రకృతి సేవ, దేశభక్తి, వృద్ధులకు సహాయం చేయటం, కళల్లో ప్రోత్సాహం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం.

పిల్లల్లో పరివర్తన గుర్తించాం – యలమర్తి శ్రీనివాసాచారి, ఐక్య ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు

           మన సంస్క ృతి, సాంప్రదాయాలు, సమాజ స్థితిగతులపై భావితరానికి అవగాహన కల్పించేందుకు ఐక్యత కమిటీ కృషి చేస్తోంది. సమాజం కోసం ఏం చేయాలో విద్యార్థులకు తెలియజేయడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం. అనుకూల సానుకూల ధోరణితో సాగే ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులు మార్పు వస్తోంది.

క్రమశిక్షణకు ప్రాధాన్యం – కె. నిర్మలాదేవి, ప్రధానోపాధ్యాయురాలు

            ఐక్యత పేరులోనే ఎంతో శక్తి ఉంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ, సాంస్క ృతిక కార్యక్రమాలపై ఆసక్తి పెంపొందిస్తున్నాం. సామాజిక బాధ్యత పెంపొందిస్తున్నాం.

బాధ్యతలు తెలిశాయి

ఐక్యతా పౌండేషన్‌ ద్వారా మాకు మంచితనం, నైతిక విలువల గురించి తెలియజేస్తున్నారు. సమాజం పట్ల ఎలా బాధ్యతగా వ్యవహరించాలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రకృతి, పర్యావరణ సంరక్షణ మొదలైనవి నేర్పుతున్నారు.– ఎస్‌.లిఖిత దుర్గ, బి.బాబా,విద్యార్థులు

➡️