నిప్పులుకక్కే ఆకాశం కింద నిరంతర శ్రమజీవులు

ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. ఉదయం 7 గంటల నుండే ఎండ మండిపోతోంది. రాత్రి 7 గంటల వరకు ఒకటే వేడి గాలులు.. ఊపిరి తీసుకోనివ్వడం లేదు. ఇంత భయంకర వాతావరణంలో ఇంటి నుండి బయట కాలు పెట్టడానికి కూడా చాలామంది ఆలోచిస్తారు. సాయంత్రం వేళల్లోనే బయట పనులు చక్కబెట్టుకోవాలని ప్రణాళికలు వేసుకుంటారు. అయితే ఇంకొంత మంది మాత్రం ఆ ఎండలోనే బయటికి రావాలి. ఆరోగ్యం బాగున్నా, బాగోలేకపోయినా తప్పదు. వాతావరణ మార్పులు కొంతమందికి ఆహ్లాదాన్ని అందిస్తే, అవే మార్పులు మరికొంతమంది ప్రాణాలకు అపాయం కలిగిస్తాయి. అనారోగ్యాలకు కారణమవుతాయి. ప్రస్తుతం వేడిక్కిన వాతావరణం ఆ ప్రమాదాలను మరింత దగ్గర చేస్తోంది.

వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణరంగ కార్మికులు, గిగ్‌ కార్మికులు, ఏసీలు, ఫ్యాన్లు మరమ్మతులు చేసేవారు, రాపిడో, ఉబర్‌ వంటి ఆన్‌లైన్‌ ప్రయాణ సర్వీసులు ఇచ్చేవారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు.. ఇలా ఎంతోమంది కార్మికులు ఎండలోనే పనిచేస్తారు. ప్రస్తుత వాతావరణం వారి ప్రాణాలను హరించేస్తోందని ప్రపంచ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ) తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. భవిష్యత్తులో వారు ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని కూడా హెచ్చరిస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులకు ప్రభావితం అయ్యే వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. మొత్తం ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మంది ఏటా అధిక వేడికి గురవుతున్నారని నివేదికలో చెప్పారు. వారిలో దాదాపు 23 మిలియన్ల (2 కోట్లా మూడు లక్షలకు పైగా జనాభా) మంది పని ప్రదేశంలో ప్రమాదాలకు గురవుతున్నారు.

ఏయే ప్రమాదాలు అంటే..
నివేదిక ప్రకారం, అధిక వేడి, అతినీలలోహిత వికిరణం, విపరీత వాతావరణ సంఘటనలు, పని ప్రదేశాల్లో వాయు కాలుష్యం, వెక్టర్‌-బోర్న్‌ (చికెన్‌ గున్యా, మలేరియా, డెంగ్యూ తదితర జ్వరాలు), వ్యవసాయ రసాయనాలు వంటివి ఒత్తిడి, స్ట్రోక్‌, అలసట వంటి అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి.
అభివృద్ధి చెందుతున్న మనదేశ వర్కర్స్‌ కమ్యూనిటీలో వ్యవసాయం, అనుబంధ రంగాల కార్మికుల సంఖ్య కంటే గిగ్‌ కార్మికులు అంటే యాప్‌ డ్రైవర్లు, ఫుడ్‌ అండ్‌ గ్రాసరీ డెలివరీలు, ఎలక్ట్రికల్‌ వస్తువుల మరమ్మతులు చేసేవారు, ఇంటి మరమ్మతులు చేసేవారు, కొరియర్‌ సర్వీస్‌ ఉద్యోగుల సంఖ్య క్రమంగా వృద్ధి చెందుతోంది.
నాస్కామ్‌ అధ్యయనం ప్రకారం మన దేశ మొత్తం కార్మిక శక్తిలో గిగ్‌ కార్మికుల సంఖ్య 1.5 శాతం ఉన్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 4.5 నాటికి చేరుకోనుందని అంచనా వేస్తున్నారు. నివేదిక ప్రకారం మన దేశ మొత్తం కార్మిక శక్తిలో అంటే 60 కోట్ల మందిలో 80 శాతం మంది వేడి వాతావరణానికి ప్రభావితమై ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని నివేదిక సూచిస్తోంది. ఈ సంఖ్య దక్షిణ అమెరికా మొత్తం జనాభా 18 కోట్ల కంటే ఎక్కువ.

ఏయే రంగాలు ఎక్కువ ప్రభావితం?
వ్యవసాయం రంగ కార్మికులు వేడి వాతావరణానికి ఎక్కువగా ప్రభావితమవుతారు. ఎటువంటి రక్షణ లేకుండా పనిచేయడం వల్ల వాతావరణ మార్పులకు వారు త్వరగా గురవుతారు. మనదేశ మొత్తం శ్రామిక శక్తిలో వ్యవసాయ రంగం, దాని అనుబంధ రంగాలలో 45.76 శాతం మంది పనిచేస్తున్నారని గత నివేదికలు తెలుపుతున్నాయి. అలాగే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ) రంగం దేశంలోని శ్రామిక శక్తిలో 21 శాతం అంటే 12 కోట్ల 3 లక్షల మంది కంటే ఎక్కువ మంది కార్మికులు వ్యవసాయ అనుబంధ రంగాల్లో పనిచేస్తున్నారు. దాదాపు 6.4 కోట్ల ఎంటర్‌ప్రైజెస్‌తో కూడిన ఈ రంగం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విభాగం. అయినా..


దేశం మొత్తం ఉత్పాదక ఉత్పత్తిలో మూడవ వంతు కంటే ఎక్కువ వాటాను కలిగివున్న ఈ రంగంలో కార్మికుల రక్షణ కోసం ఏవిధమైన చర్యలూ లేవు. కార్మికుల పని పరిస్థితులపై ఎటువంటి పర్యవేక్షణ లేక, వేడి వాతావరణానికి తీవ్రంగా ప్రభావితమవుతారు. ఈ రంగాన్ని, భవన నిర్మాణ రంగం అనుసరిస్తుంది. ఇందులో దాదాపు 7 కోట్ల మంది అంటే భారత దేశ శ్రామిక శక్తిలో దాదాపు 12 శాతం మంది ఆధారపడుతున్నారు. ఈ రంగం ఎక్కువగా పట్టణాల్లోనే వేగంగా వ్యాపిస్తోంది. ఇక్కడ పనిచేసే కార్మికులు తరచూ శారీరక గాయాలతో గురవుతారు. అలాగే దేశంలో అనేక నగరాలు కాలుష్య కారకాలుగా మారడం వల్ల ఆస్మా వంటి వాయు కాలుష్య సంబంధ ఆరోగ్య ప్రమాదాలకు గురయ్యే అవకాశం కూడా ఉంది.
ఎండకు, వానకు, గజగజ వణికే చలికి ఏమాత్రం లొంగకుండా రెక్కలు ముక్కలు చేసుకునే కష్టజీవులకు వాతావరణ మార్పులు పెను ప్రమాదాన్ని తెచ్చిపెట్టడం విచారించదగ్గ అంశం. కార్మిక చట్టాల అమల్లో ఉన్న లోటుపాట్ల వల్ల సరైన రక్షణ సదుపాయాలు వారికి కల్పించడం లేదు. పాలకుల చర్యల్లో మార్పులు రానంత వరకు ఆ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే!

➡️