ఎవరి ముఖం ఎవరు చూశారు?

Mar 17,2024 06:08 #feachers, #jeevana, #katha

వేకువనే కుమార్తెను చూడటానికి గోరంట్ల గ్రామం బయలుదేరింది భానుమతమ్మ. గుమ్మం తాళం వేసి వీధి లోనికి రాగానే, వ్యాపారి శివయ్య తల్లి వాళ్ళ ఇంటి ముందు ముగ్గు పెడుతూ కనిపించింది. ‘భానుమతమ్మ, వేకువనే బయలు దేరావు ఎక్కడికో?’ అన్నది శివయ్య తల్లి సుబ్బమ్మ. ‘అమ్మాయిని చూసి వద్దమని వెళుతున్నా అని’ చెప్పి బస్‌ స్టాండ్‌ వైపు అడుగులు వేసింది భానుమతమ్మ.
మరుదినం సాయంత్రం తను ఇల్లు చేరేసరికి, ఒక వ్యక్తి వచ్చి ‘అమ్మా మిమ్మల్ని వెంటనే రచ్చబండ దగ్గరకు రమ్మన్నారు ఊరి పెద్దలు’ అన్నాడు. అతన్ని అనుసరించి రచ్చబండ వద్దకు వెళ్ళింది భానుమతమ్మ.
రచ్చబండ వద్ద సమావేశమైన ఊరి పెద్ద ‘భానుమతమ్మ, నిన్న వేకువన నీ ముఖం చూసిన సుబ్బమ్మ గారు స్నానాల గదిలో పడి చేయి విరగొట్టుకున్నారట. తన చేయి విరగటానికి కారణం నువ్వేనని పొద్దున్నే నీ ముఖం చూడటం వలన ఇలా జరిగిందనీ ఆవిడ ఆరోపిస్తున్నారు. దీనికి నీ సమాధానం ఏమిటి?’ అన్నాడు ఊరిపెద్ద.
‘అయ్యా సుబ్బమ్మ గారు మాత్రమే కాదు. ఆమె, నన్ను.. నేను, ఆవిడను పొద్దున్నే ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం. నా ముఖం చూడటం వలన ఆమెకు చేయి విరిగింది. పదిరోజులు వైద్యంతో బాగుపడుతుంది. మరి ఆమె ముఖం చూసిన నాకు పెద్ద నష్టమే జరిగింది. బస్‌లో ఎవడో నా పర్సు కొట్టేసాడు. నాకు జరిగిన నష్టం ఎవరికి చెప్పుకోవాలి?’ అన్నది భానుమతమ్మ.
ఇరువురి వాదనలు విన్న ఊరి పెద్ద ‘ఈ సంఘటనలు కేవలం మీ ఇరువురి అజాగ్రత్త వలనే జరిగాయి. ఇందులో శకునం, ముహుర్తం, పొద్దున్నే ముఖం చూడటం వంటి వాటికి తావు లేదు. మూఢనమ్మకాలతో ఎదటివారిని నిందించడం తప్పు. పెద్ద వారైన మీకు ఈ విషయాలు తెలియనివి కావు. ఇటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఇప్పటి నుండైనా జాగ్రత్తగా ఉండండి’ అని హితవు పలికాడు.

– బెల్లంకొండ నాగేశ్వరరావు, చెన్నయ్.

➡️