హైదరాబాద్‌ స్టేట్‌ విలీనానంతర తొలి (1962) సంయుక్త ఎన్నికలు

Apr 11,2024 03:04 #2024 elections

మద్రాసు రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న ఆంధ్ర ప్రాంతం 1953లో ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడి… మళ్లీ 1956లో హైదరాబాద్‌ స్టేట్‌ (తెలంగాణ) విలీనమై ”ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌”గా రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఆంధ్ర రాష్ట్రానికీ, హైదరాబాద్‌ స్టేట్‌కూ 1952లోనే విడివిడిగా ఎన్నికలు జరిగినా.. ఆంధ్ర రాష్ట్రానికి 1955లో మధ్యంతర ఎన్నికలొచ్చాయి. 1956లో హైదరాబాద్‌ స్టేట్‌ ఆంధ్రరాష్ట్రంలో విలీనం అయింది. అయితే హైదరాబాద్‌ స్టేట్‌ శాసనసభ్యులకు 1957 నాటికి పదవీ కాలం పూర్తయింది. ఈ కారణంగా ఆంధ్ర రాష్ట్రంలో విలీనమైన తెలంగాణా స్టేట్‌ నుంచి మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.
హైదరాబాద్‌ స్టేట్‌కు సంబంధించి మొత్తం ఏకసభ్య (85) ద్విసభ్య (20)స్థానాలతో కలిపి 105 స్థానాలున్నాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 68, పిడిఎఫ్‌ పేరుతో పోటీ చేసిన కమ్యూనిస్టు పార్టీకి 22, ఇండిపెండెంట్లకు 12, పిఎస్‌పి, పిపి ఒక్కొక్కటి చొప్పున గెలుపొందాయి. కాంగ్రెస్‌కు 47.38 శాతం ఓట్లు రాగా, పిడిఎఫ్‌ పేరుతో పోటీ చేసిన కమ్యూనిస్టు పార్టీకి 25.75 శాతం ఓట్లు వచ్చాయి. వీరి పదవీకాలం 1962 నాటికి ముగుస్తుంది. అయితే అంతకు ముందే ఆంధ్రకు 1955లో ఎన్నికలు జరిగినందువల్ల పదవీకాలం 1960 నాటికే పూర్తి కావలసి ఉంది. అందువల్ల ఉభయ రాష్ట్రాల విలీనాన్ని దృష్టిలో ఉంచుకొని (1957నాటి ఇబ్బంది మళ్లీ తలెత్తకుండా) 1962 నాటి జనరల్‌ ఎన్నికలతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. 1962 ఎన్నికలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో 300 అసెంబ్లీ నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. అన్నీ ఏకసభ్య నియోజకవర్గాలే. ద్విసభ్య నియోజకవర్గాలు లేవు. ఈ పరిణామాల్లో అంతకుముందు మెజారిటీ రాని కాంగ్రెస్‌ పార్టీకి అధికారం వచ్చేలా సహకరించిన కృషికార్‌ లోక్‌పార్టీ, కిసాన్‌ మజ్దూర్‌ ప్రజా పార్టీ, ప్రజా సోషలిస్టు వంటి పార్టీలు కనుమరుగయ్యాయి. ఈ ఎన్నికల నాటికి కొత్తగా స్వతంత్ర పార్టీ రంగంలోకి వచ్చింది.
1955 ఎన్నికల అనంతరం మూడేళ్ల 71 రోజులపాటు అంటే 1960 జనవరి 11 వరకూ నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ తరువాత కాంగ్రెస్‌లో మళ్లీ గొడవలు వచ్చి దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రి చేశారు. ఆయన రెండు సంవత్సరాల 60 రోజులపాటు 1962 మార్చిలో సాధారణ ఎన్నికల వరకూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 300 స్థానాలున్న శాసనసభకు కాంగ్రెస్‌ అన్ని స్థానాలకూ పోటీ చేసింది. ఈసారి కాంగ్రెస్‌కు అప్పటివరకూ ఆదుకున్న మిత్రపక్షాలు లేవు. సింగిల్‌గా పోటీ చేసి 47.25 శాతం ఓట్లు సంపాదించి 177 స్థానాలను గెలుచుకుంది. కమ్యూనిస్టు పార్టీ కేవలం 136 సీట్లకు మాత్రమే పోటీ చేసింది. శాసనసభలో సగంకన్నా తక్కువ స్థానాల్లోనే పోటీ చేసింది. అయినా 20 శాతం ఓట్లు తెచ్చుకొని 51 స్థానాలను గెలవగలిగింది. మరో ఏడుగురు కమ్యూనిస్టులు ఇండిపెండెంట్లుగా పోటీచేసి కమ్యూనిస్టు పార్టీ మద్దతుతో విజయం సాధించారు. గెలిచిన వారు ఇండిపెండెంట్లు కనుక కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేలుగా సాంకేతికంగా లెక్కలోకి రాలేదు. కొత్తగా ఎన్నికల్లో పాల్గొన్న స్వతంత్ర పార్టీ 141 సీట్లలో పోటీ చేసి 19 స్థానాలను గెలుచుకున్నది. ఈ పార్టీకి 10.40 శాతం ఓట్లు వచ్చాయి. 300 స్థానాలకు పోటీ చేసిన ఇండిపెండెంట్లు 20 శాతం ఓట్లు తెచ్చుకొని 51 స్థానాలను గెలవగలిగారు. సోషలిస్టు పార్టీ 2 స్థానాల్లో గెలుపొందింది. మరే ఇతర పార్టీకి ప్రాతినిథ్యం లభించలేదు.

నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి, సుందరయ్య ప్రతిపక్ష నేత
ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే సాధారణ మెజారిటీ 151 సీట్లు వస్తే సరిపోతుంది. కాంగెస్‌కు 22 సీట్లు ఎక్కువ వచ్చాయి. ఏ పార్టీపైనా ఆధారపడే పరిస్థితి కాంగ్రెస్‌కు రాలేదు. మళ్లీ నీలం సంజీవరెడ్డిని ఎన్నుకున్నారు. అయితే ఆయన ఒక సంవత్సరం 346 రోజులు మాత్రమే అంటే 1964 ఫిబ్రవరి 1వ తేదీ వరకే ముఖ్యమంత్రిగా పనిచేశారు. అధికారయుత ప్రతిపక్ష నాయకుడుగా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన పుచ్చలపల్లి సందరయ్య ఎన్నికయ్యారు. అయితే కాంగ్రెస్‌లో అప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రినీ ఐదేళ్ల పాటు పదవిలో ఉండనివ్వలేదు. ఐదేళ్ల కాలంలో ఇద్దరు, ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చేసే సంప్రదాయం 1983 వరకూ కొనసాగించింది. అలాగే నీలం సంజీవరెడ్డిని కూడా పట్టుమని రెండేళ్లు కూడా ముఖ్యమంత్రి పదవిలో ఉంచలేదు.

1964లో ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానందరెడ్డి, ప్రతిపక్ష నేతగా నాగిరెడ్డి
మిగిలిన మూడేళ్ల పదవీ కాలానికి ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానందరెడ్డి ఎన్నికయ్యారు. అనంతర కాలంలో కమ్యూనిస్టు పార్టీలో చీలిక ఏర్పడింది. సిపిఎం ఆవిర్బవించింది. దీంతో అప్పటివరకూ ప్రతిపక్ష నేతగా ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడంతో ఆ స్థానంలో గతంలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన తరిమెల నాగిరెడ్డిని సిపిఎం పక్ష నేతగా ఎన్నుకున్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి 1967 సాధారణ అసెంబ్లీ ఎన్నికల వరకూ ముఖ్యమంత్రిగా కొనసాగారు.
కాసు బ్రహ్మానందరెడ్డికి ముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి స్వయానా బావా బామ్మర్దులు. 1952 ఎన్నికల్లో తరిమెల నాగిరెడ్డి అనంతపురం జిల్లా నుంచి సొంత బావ నీలం సంజీవరెడ్డిపై గెలుపొందడం అప్పట్లో సంచలనంగా మారింది. 1955 ఎన్నికల్లో తరిమెల నాగిరెడ్డి బావ సంజీవరెడ్డి చేతిలో ఓడిపోయారు. 1957 పార్లమెంట్‌ ఎన్నికల్లో అనంతపురం నుంచి నాగిరెడ్డి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. తరువాత 1962 ఎన్నికల్లో వీరిరువురూ వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. ఎక్కడైనా బావ గాని వంగతోటకాడ కాదన్నట్లు వీరి రాజకీయాలకు ఎవరూ బంధుత్వాన్ని ఆపాదించలేకపోయారు. విలువలు, పార్లమెంటరీ సంప్రదాయాలు పాటించారు.
1964 ఎన్నికల్లో యోధానుయోధులు గెలుపొందారు. కాంగ్రెస్‌ పక్షాన నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, అయ్యదేవర కాళేశ్వరరావు, కాకాని వెంకటరత్నం తదితరులు గెలుపొందగా.. కమ్యూనిస్టు పార్టీ పక్షాన పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, ఆరుట్ల కమలాదేవి, నల్లమల గిరిప్రసాద్‌, బొమ్మసాని ధర్మబిక్షం తదితర నేతలు, స్వతంత్ర పార్టీ పక్షాన గౌతు లచ్చన్న, ఇండిపెండెంట్‌గా వావిలాల గోపాలకృష్ణయ్య తదితరులు ఎన్నికయ్యారు.

– యు. రామకృష్ణ

➡️