నాలుగో దశ అభ్యర్థుల్లో 28 శాతం మంది కోటీశ్వరులు

May 11,2024 23:54 #election

దేశ వ్యాప్తంగా నాల్గవ దశ లోక్‌సభ ఎన్నికలు (మే 13) పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 నియోజకవర్గాలకు నిర్వహిస్తున్నారు. ఈ దశలో 1,710 మంది పోటీ చేస్తుండగా, వారిలో దాదాపు 476 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌), ద నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ నివేదిక వెల్లడించింది. బరిలో నిలిచిన అభ్యర్థుల్లో దాదాపు 28 శాతం కోటీశ్వరులేనని తెలిపింది. అభ్యర్థుల అఫిడవిట్‌ల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. ఏడుగురు అభ్యర్థుల అఫిడవిట్‌లు సరిగ్గా స్కాన్‌ చేయకపోవడంతో వారి ఆస్తుల వివరాలు నివేదికలో పొందుపరచలేదు. పోటీలో నిలిచిన వారిలో 12 శాతం మంది ఐదు కోట్లు, అంతకంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు. ఎనిమిది శాతం మందికి రూ. 2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఆస్తులున్నాయి. 18 శాతం మంది రూ. 50 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు ఆస్తులు కలిగి ఉన్నారు. 25 శాతం మంది రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య ఆస్తులు కలిగి ఉన్నారు. 37 శాతం మందికి రూ. 10 లక్షల లోపు ఆస్తులు ఉన్నాయి.
2023-24లో అభ్యర్థి ఆదాయపు పన్ను రిటర్న్స్‌ (ఐటిఆర్‌) ప్రకారం చూస్తే.. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన షేక్‌ బషీద్‌ అత్యధిక ఆదాయం కలిగిన అభ్యర్థుల జాబితాలో నిలిచారు. ఆయన ఈసారి ఆంధ్రప్రదేశ్‌ రాజంపేట నుంచి పోటీ చేస్తున్నారు. వ్యాపారం ద్వారా రూ.28,63,66,000 ఆదాయం వచ్చింది. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (బిజెపి) తెలంగాణ చేవెళ్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు జీతం, వడ్డీ, అద్దె, డివిడెండ్‌ ఆదాయాల రూపంలో రూ. 4,65,48,830 ఆదాయం వస్తుంది. కాంగ్రెస్‌ నేత డాక్టర్‌ గడ్డం రంజిత్‌ రెడ్డి కూడా అత్యధిక ఆదాయం కలిగిన జాబితాలో ఉన్నారు. ఆయన చేవెళ్ల నుంచే పోటీ చేస్తున్నారు. జీతం, వ్యాపారం, ఇతర వనరుల ద్వారా రూ.4,92,63,730 ఆదాయం లభించింది.
సగటు ఆస్తి రూ.11.72 కోట్లు
టిడిపి నుంచి 17 మంది అభ్యర్థులు (416.42 కోట్లు). బిజెపి 70 మంది (రూ.101.77కోట్లు.). శివసేన మగ్గురు (రూ. 54.49 కోట్లు). బిఆర్‌ఎస్‌ 17 మంది (రూ. 54.25 కోట్లు). వైసిపి 25 మంది (రూ. 39 కోట్లు). టిఎంసి ఎనిమిది మంది (రూ. 36 కోట్లు.), కాంగ్రెస్‌ 61 మంది (రూ. 23.65 కోట్లు). శివసేన (యుబిటి) నలుగురు (రూ. 13.53 కోట్లు). ఎస్‌పి 19 మంది (9.86 కోట్లు.), ఎంఐఎం ముగ్గురు (రూ.9.53 కోట్లు.), ఆర్‌జెడి నలుగురు (రూ. 8.23 కోట్లు). బిజెడి నుంచి నలుగురు అభ్యర్థులు (రూ. 3.11కోట్లు). నాల్గవ దశలో పోటీ చేసే ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తి రూ.11.72 కోట్లుగా ఉంది.


టాపర్లు వీరే
1) టిడిపి నుంచి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఆస్తుల విలువ రూ. 5,705 కోట్లు. 2) కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (బిజెపి) తెలంగాణ చేవెళ్ల నియోజకవర్గం. ఆయన మొత్తం ఆస్తులు రూ. 4,568 కోట్లు. 3) ప్రభాకర్‌రెడ్డి వేమిరెడ్డి (టిడిపి) నెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆస్తులు రూ. 716 కోట్లు.

ఎలక్షన్‌ డెస్క్‌

➡️